Agripedia

వరి vs చిరుధాన్యాలు… ఏది లాభదాయకం?

Sandilya Sharma
Sandilya Sharma

ప్రపంచంలోనే అత్యధికంగా చిరుధాన్యాలు పండించే దేశం ఏంటో తెలుసా? అది మరేదో దేశం కాదు మన ఇండియానే. ఈ నేపథ్యంలో, ఒక పరిశోధన ప్రకారం, వరి సాగును తగ్గించి చిరుధాన్యాల సాగు పెంచడం వల్ల పంట దిగుబడి మీద వాతావరణ మార్పుల ప్రభావం తగ్గి, లాభాలు 11%దాకా పెరుగుతాయంట.

మరి వరి, చిరుధాన్యాలలో ఏది ఎక్కువ లాభదాయకం? ఏ పంట వేసుకుంటే చింతలు మరిచి, రైతన్న ప్రశాంతంగా నిద్రపోగలడు? మన తెలంగాణా, ఆంధ్ర రాష్ట్రాల్లో చిరుధాన్యాలు వేస్తే నష్టపోతారా? అసలు ఇప్పుడు మార్కెట్ ఉందా? ఇలా ఎన్నో అనుమానాలు రావడం సహజం. ఆ ప్రశ్నలకి సమాధానమే ఈ కథనం.

తాజాగా నేచర్ కమ్యూనికేషన్ లో ప్రచురితమైన ఒక పరిశోధనలో, వరి కంటే చిరుధాన్యాలు, జొన్న, మొక్కజొన్న వంటివి సాగు చేయటం ఎక్కువ లాభదాయకమని కనుగొన్నారు. ప్రస్తుతం వాతావరణంలో వస్తున్న మార్పులు, అసహజ వర్షాభావం, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు వరి సాగుపై ప్రభావం చూపుతున్నాయి అని అందులో వెల్లడించారు. 

వర్షాధారంగా ధాన్యన్ని ఉత్పత్తి చెయ్యడంలో ప్రపంచంలోనే భారతదేశం, ప్రధానంగా నిలుస్తోంది. అయితే, గడచిన కొన్ని దశాబ్దాలుగా అధికంగా వరి సాగుచేయడంతో, ఇతర ప్రత్యామ్నాయాల వైపు రైతులు మొగ్గుచూపటం మానేశారు. ఇదివరకు ముఖ్యమైన ధాన్యాలైన కొర్రలు, జొన్నలు, సజ్జలు, మరియు మొక్కజొన్న సాగు తగ్గిపోయింది. దీనివల్ల రైతుల దిగుబడి, రాబడి, వాతావరణ మార్పుల మీద ఆధారపడి అనేక సమస్యలు ఉద్భవించాయి.

ఈ పరిశోధనలో భారతదేశం లోని వర్షాధార ఖరీఫ్ ధాన్య పంటల పై అధ్యయనం చేసి, రైతుల వ్యవసాయ నిర్ణయాలు, ధరల ప్రభావం, వాతావరణ మార్పుల ప్రభావాన్ని విశ్లేషించారు.

వరి సాగులో సమస్యలు  

    • వరి సాగులో అధికంగా నీటి వినియోగం .
    • వాతావరణ మార్పుల ప్రభావానికి వరి తొందరగా గురవుతోంది.
    • ఎక్కువ శాతం ప్రజలు వరి వేయడంతో, పెరుగుతున్న పోటీ.

చిరుధాన్యాల పెంపంకం – రైతులకు లాభదాయకమా?

ప్రస్తుత పరిశోధన ప్రకారం, వరి సాగును తగ్గించి జొన్న, సజ్జ, మొక్కజొన్న, కొర్రలు వంటి పంటలకు ప్రాధాన్యం ఇస్తే రైతులకు లాభాలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • నీటి వినియోగం తక్కువ – వరితో పోల్చితే 50% తక్కువ నీటితో పెరిగే పంటలు.
  • వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం – మిగతా ధాన్యాలు అధిక ఉష్ణోగ్రతలలోనూ పెరుగుతాయి.
  • ఆహార పోషక విలువలు ఎక్కువ – మిల్లెట్స్‌లో ప్రోటీన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి.
  • రైతులకు అధిక ఆదాయం – మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.

మిల్లెట్ సాగు ప్రోత్సాహం – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం చర్యలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్రలోని గిరిజన ప్రాంతాలు, రాయలసీమ వంటి ప్రాంతాల్లో మిల్లెట్ సాగును తిరిగి ప్రోత్సహించేందుకు ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం  వెల్లడించిన ప్రకారం, ఈ పథకం కోసం రూ.22.80 కోట్ల నిధులను కేటాయించారు.

ఈ పథకం కింద ప్రధానంగా కిందివి అమలులోకి వస్తాయి:

  • చిన్న తృణధాన్యాల (మినుములు) సాగును పెంపొందించడం
  • రైతులకు విత్తనాలు, ఉత్పాదన సహాయ పథకాలు అందించడం
  • ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగాన్ని ప్రోత్సహించడం
  • సూక్ష్మ నీటిపారుదల విధానాలను అభివృద్ధి చేయడం
  • విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీకి సహాయపడటం

రాయలసీమలో మిల్లెట్ ఉత్పత్తి – అభివృద్ధి దిశగా ముందడుగు

కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ప్రస్తుతం మిల్లెట్ల ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ అభివృద్ధి చెందుతోంది. ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం 10 మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి. కొన్ని కంపెనీలు ఈ-కామర్స్ ద్వారా తమ ఉత్పత్తులను విక్రయిస్తూ, విస్తృత మార్కెట్‌ను చేరుకుంటున్నాయి.

మిల్లెట్ ఆధారిత ఆహారం – ప్రజల ఆరోగ్య పరిరక్షణ

ఆహార సంబంధిత ఆరోగ్య సమస్యలను అధిగమించేందుకు మిల్లెట్ ఆధారిత భోజనాన్ని ప్రజలు తమ రోజువారీ జీవితంలో భాగంగా చేసుకుంటున్నారు. దీనిని ప్రోత్సహించేందుకు కర్నూలు కలెక్టరేట్‌లో రెండేళ్ల క్రితం ‘మిల్లెట్ కేఫే’ ఏర్పాటు చేశారు. ఇందులో జొన్న రొట్టెలు, మిల్లెట్ లడ్డూలు, మురుకులు, బ్రెడ్ వంటి పదార్థాలు లభిస్తున్నాయి.

మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు

ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం (PMFME) ద్వారా మిల్లెట్ ఆధారిత వ్యాపారాలను ప్రోత్సహించేందుకు 35% సబ్సిడీ అందిస్తున్నారు. ఈ పథకం కింద గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ లభిస్తుంది. అంతేకాక, రూ.1 కోటి వరకు రుణం పొందేందుకు వీలుంది.

తెలంగాణలో మిల్లెట్ ప్రోత్సాహం

తెలంగాణ ప్రభుత్వం మిల్లెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు 50 ప్రత్యేక మిల్లెట్ అవుట్‌లెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. తెలంగాణ స్టేట్ అగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TSAgros) ఆధ్వర్యంలో మిల్లెట్ ఆధారిత ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో మిల్లెట్ల సాగుకు ప్రభుత్వం, వ్యవసాయ నిపుణులు, పరిశ్రమల మద్దతు పెరుగుతోంది. ఇది రైతులకు ఆర్థిక లాభాలను అందించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలదు. ప్రభుత్వ ప్రోత్సాహం, ఆర్థిక మద్దతుతో మిల్లెట్ వ్యవసాయం నూతన ఆదాయ మార్గాలను తెరవనుంది. రైతులు, యువ పారిశ్రామికవేత్తలు మిల్లెట్ ప్రాసెసింగ్ పరిశ్రమలను స్థాపించేందుకు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని, ఆరోగ్యంతో పాటు ఆర్థిక అభివృద్ధిని కూడా సాధించవచ్చు.

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More