Agripedia

సేంద్రియ ఎరువులు, మల్చింగ్ నుండి రైజోబియం వరకు – భూమి సారత పెంపుకు ప్రకృతి మార్గం

Sandilya Sharma
Sandilya Sharma
సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, మల్చింగ్, రైజోబియం, compost manure in Telugu
సేంద్రియ ఎరువులు, జీవన ఎరువులు, మల్చింగ్, రైజోబియం, compost manure in Telugu

ప్రస్తుతం సాగు విధానాలు వేగంగా మారుతున్న తరుణంలో, రసాయన ఎరువులపై ఆధారపడే వ్యవసాయ పద్ధతుల వల్ల భూమి సారత తగ్గిపోతుండటం, నీటి కాలుష్యం పెరగడం వంటి సమస్యలు ఎక్కువయ్యాయి. దీనికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ మరియు జీవన ఎరువుల వినియోగం ద్వారా ఆరోగ్యకరమైన పంటలు, సుస్థిర వ్యవసాయ విధానాలు సాధ్యమవుతున్నాయి. ఈ వ్యాసంలో మల్చింగ్ నుండి రైజోబియం వరకు వివిధ సేంద్రియ, జీవన ఎరువుల వివరాలు మరియు వాటి ప్రయోజనాలపై లోతుగా పరిశీలిద్దాం.

1. మల్చింగ్ (Mulching)

మొక్కల చుట్టూ వేర్ల భాగాన్ని ఆకులు, చెఱకు పిప్పి, చిన్న రాళ్లు మొదలైన పదార్థాలతో కప్పడం మల్చింగ్. ఇది నేల తేమను నిలుపుతుంది, మట్టికోతను నివారిస్తుంది.

లాభాలు:

  • నీటి ఆదా: 30-70% వరకు నీరు ఆదా అవుతుంది; డ్రిప్ వ్యవస్థతో కలిపితే అదనంగా 20%.
  • కలుపు నివారణ: 60-90% వరకు కలుపు మొక్కల పెరుగుదల నియంత్రణ.
  • మట్టికోత నియంత్రణ: నేల సారాన్ని కాపాడుతుంది.
  • ఉష్ణోగ్రత నియంత్రణ: నేల ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది.
  • దిగుబడి పెరుగుదల: దిగుబడి 20-60% వరకు పెరుగుతుంది.
  • తెగుళ్లు నివారణ: పారదర్శక షీటుల ద్వారా భూమిలోని కీటకాలు, తెగుళ్ల నివారణ.

2. పచ్చిరొట్టు పైర్లు (Green Manure Crops)

జీలుగ, కట్టెజనుము వంటి మొక్కలను పెంచి భూమిలో కలిపే ప్రక్రియ పచ్చిరొట్టు ఎరువుగా ప్రసిద్ధి.

లాభాలు:

  • భౌతిక స్వభావం మెరుగవుతుంది.
  • సుక్ష్మజీవుల వృద్ధి.
  • నీటిని నిలుపుకొనే సామర్థ్యం పెరుగుతుంది.
  • దిగుబడి పెరుగుతుంది.

3. కంపోస్ట్ తయారీ విధానాలు

(i) వానపాముల ఎరువు (Vermicompost):

సేంద్రియ పదార్థాలను వానపాముల సహాయంతో కంపోస్ట్ చేయడం. ఇది భూసారాన్ని పెంచే ఉత్తమ పద్ధతుల్లో ఒకటి.

(ii) నాడెప్ పద్ధతి:

ఇటుకలతో తొట్టె నిర్మించి, పొరలుగా పశువుల మూత్రం, ఆవుపేడ, మట్టి, గడ్డి వాడటం.

(iii) బయోడైనమిక్ కంపోస్ట్:

ఎండు, పచ్చి గడ్డి పొరలతో బీ.డి.502-507 ప్రిపరేషన్లు ఉపయోగించి తయారు చేయబడే కంపోస్ట్.

(iv) కౌ పాట్ పిట్:

ఆవుపేడ, బెల్లం, బోన్ మిల్ వంటి పదార్థాలతో గుంటలో తయారుచేయబడే ప్రత్యేక కంపోస్ట్.

(v) ద్రవ రూప సేంద్రియ ఎరువులు:

వేప, కానుగ, జీలుగ వంటి ఆకుల నుండి తయారైన ద్రవ రూప సేంద్రీయ పదార్థాలు, మొక్కల ఎదుగుదలకు తోడ్పడతాయి. వేప, జిల్లేడు వంటి పదార్థాల వాడకముతో పురుగుమందులా పనిచేస్తాయి.

4. జీవన ఎరువులు (Biofertilizers)

(i) రైజోబియం (Rhizobium):

పప్పు జాతి పంటలకు వేర్ల భాగంలో బుడిపెలుగా ఏర్పడి గాలిలో నత్రజనిని నిలుపుతుంది.

(ii) అజోస్పైరిల్లం (Azospirillum):

వేర్ల మీద జీవించి 8-16 కిలోల నత్రజనిని భూమిలో స్థిరీకరిస్తుంది.

(iii) అజటోబాక్టర్ (Azotobacter):

గాలినుండి నత్రజని గ్రహించి అన్ని రకాల పైర్లకు ఉపయుక్తంగా పనిచేస్తుంది.

(iv) ఫాస్ఫేట్ సాల్యూబలైజింగ్ బాక్టీరియా (PSB):

పొటాష్, ఫాస్ఫరస్ లాంటి మూలకాలను మొక్కలకు అందించే బాక్టీరియా.

(v) నీలి ఆకు పచ్చ నాచు (Blue-Green Algae):

వరి పంటలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. నాస్టాక్, ఎనబీన వంటి జాతులు భారతదేశంలో లభించును.

(vi) వెసికులార్ ఆర్బిస్కులార్ మైకోరైజా (VAM):

భూమిలోని పోషకాలను మొక్క వేర్లకు అందించే సహజ శ్రేణి సూక్ష్మజీవులు.

5. కలుపు యాజమాన్యం

పంట మార్పిడి, మిశ్రమ పంటలు వేయడం, మానవులచే కలుపు తొలగించడం, వాటిని మల్చింగ్ పదార్థాలుగా ఉపయోగించడం ద్వారా భూమి సారాన్ని కాపాడుతూ కలుపులను నియంత్రించవచ్చు.

సేంద్రియ మరియు జీవన ఎరువుల వినియోగం ఒకటే కాదు, పంట దిగుబడి పెంచడమే కాదు, భవిష్యత్తు తరాలకు భూసారం ఉండేలా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. రైతులు ఈ పద్ధతులను అనుసరిస్తే ఖచ్చితంగా పంటల నాణ్యత, దిగుబడి పెరగడమే కాక భూమి ఆరోగ్యం మెరుగుపడుతుంది. రసాయనాల వినియోగాన్ని తగ్గించి ప్రకృతితో కలిసిపోయే సాగు పద్ధతుల వైపు దృష్టి మళ్లించుకోవాలి.

Read More:

తెలంగాణ మామిడిని ప్రపంచానికి పరిచయం చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం: నేరుగా రైతుల నుంచి ఎగుమతి

బిందుసేద్యంలో దేశంలో అగ్రస్థానం – ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణం!!

Share your comments

Subscribe Magazine

More on Agripedia

More