ప్రకృతి ఎన్నో ఔషధాలకు నిలయం. ప్రకృతితో కలసి వ్యవసాయం చేసినంత వరకు, వ్యవసాయం లాభసాటి గానే ఉండేది. ఎప్పుడైతే కృత్రిమ పద్ధతులను, రసాయన మందులను వాడడం మొదలు పెట్టామో.. అప్పుడే నకిలి మందులకు, నకిలి విత్తనాలకు మార్కెట్లో, వ్యవసాయ రంగంలో, చోటు దక్కిందని చెప్పవచ్చు. మన జీవన విధానంలో మన జీవితాలలో విడతీయరాని భాగమైన పత్తిని సాగు చేయాలంటే పెట్టుబడి ఎక్కువగా పెట్టాల్సిందే. పంట దిగుబడి సరిగా రాకపోతే రైతులు ఆర్థికంగా, మానసికంగా , నష్టపోవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నుండి నేటి తరం రైతులు బయటికి రావాలంటే సేంద్రియ సాగు వైపు అడుగులు వెయ్యక తప్పదు. పత్తిని పండించడంలో పెట్టుబడి ని తగ్గించే ఏకైక మార్గం సేంద్రియ సాగు. ఈ విధానాన్ని అవలంబిచిన రైతులకు పెట్టుబడి తగ్గి, ఆదాయం పెరుగుతుంది.
అంతేకాకుండా, సేంద్రియ సాగు ద్వారా పండించిన పంటకు మార్కెట్లో భారీగా డిమాండ్ పెరుగుతోంది. అందుకే ఈ సేంద్రియ సాగులో రైతులకు మెలకువలు నేర్పించి, అవగాహనను పెంచడానికి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనిలు(FDC), ఎన్జీవోలు (NGO) ముందుకు వస్తున్నాయి. దీంతో ఏమాత్రం నష్టం కష్టం లేకుండా సేంద్రియ వ్యవసాయం పై పట్టుసాధించవచ్చు. సాధారణ పద్ధతిలో పత్తిని పండిస్తున్న ప్పుడు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం ఎక్కువగా ఉంటుంది. వీటి ప్రభావం రైతుల ఆరోగ్యంపైన పడుతుంది. వాటి అవశేషాలు రైతుల పై పడి చాలామంది శ్వాసకోశ వ్యాధుల భారిన పడుతున్నారు . దీంతో పెట్టుబడి ఖర్చులతోపాటు వారి దావఖాన ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. రైతుల ఆత్మహత్యలకు ఇది కూడా ఒక కారణంగా మారుతుంది.
సేంద్రియ సాగులో ఇలాంటి సమస్యలు ఉండవు. ఎందుకంటే పత్తి సాగులో సాధారణ పద్ధతి , సేంద్రియ పద్ధతి , రెండు విధానాలు కూడా ఒకే విధంగా ఉంటాయి. కానీ, ఆర్గానిక్ సేద్యంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విత్తనాలను సేకరించడం, వాటిని నాటడం లాంటి పనులు సాధారణ సాగులాగే ఉంటాయి. కానీ, మొక్క పెరుగుతున్నకొద్దీ తీసుకోవలసిన జాగ్రత్తలలో తేడాలుంటాయి. ఈ సాగులో రైతులు సహజసిద్ధమైన ఎరువుల తయారీ పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. దీనిపైన కూడా రైతులకు ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలు, ఎన్జీవోలు, రైతులకు అవగాహన కల్పిస్తున్నాయి.
సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం కోసం రైతులను గ్రూపులుగా ఏర్పాటుచేసి, వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాయి. ఎరువులు, పురుగు మందుల తయారీ వాడకంతో పాటు , అన్ని దశల్లోనూ తీసుకోవాల్సిన చర్యలపైనా అవగాహన కల్పిస్తున్నాయి. కాకపోతే ఈ సేంద్రియ సాగు విధానంలో విత్తనాలపై దృష్టిని పెట్టాలి. ప్రస్తుతం మనకు బీటీ విత్తనాలే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ,వాటిని సేంద్రియ పద్ధతి సాగుకు అనుకూలంగా మారుస్తారు. ఈ విధానంలో పేడ, సున్నం, గోమూత్రంతో చేసిన మిశ్రమం లో విత్తనాలను శుద్ధి చేస్తారు. కాబట్టి భవిష్యత్తులో చీడపీడలు రాకుండా ఉంటాయి.సేంద్రియ విధానంలో పెట్టుబడి ఖర్చు కూడా సగానికి సగం తగ్గుతుంది. సాధారణ పద్ధతిలో పత్తి సాగు చేస్తే ఎకరాకు 3 -5 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తే, సేంద్రియ విధానంలో 5-7 క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది.
సాధారణ పద్ధతిలో మొదటి రెండు సంవత్సరాలు పంట దిగుబడి ఎక్కువగా వస్తుంది. కానీ, క్రమంగా భూసారం తగ్గి పోయి .. పంట దిగుబడి కూడా తగ్గిపోతుంది. సేంద్రియ సాగులో మొదటి రెండు సంవత్సరాలలో దిగుబడి తక్కువగా ఉన్నా , తర్వాత నుంచి క్రమంగా పెరుగుతుంది. భూమి సారవంతంగా మారుతుంది. ఈ విధానంలో కరీంనగర్ , అదిలాబాద్, రైతులు విజయాలను సాధించారు. వీరు ఎకరాకి 6-7 క్వింటాళ్ళ పత్తి దిగుబడిని తీస్తున్నారు. ధర విషయంలోనూ సాధారణ పత్తి కి, సేంద్రీయ పత్తికి తేడా ఉంటుంది. సేంద్రీయ పత్తికి ఎక్కువ ధర మార్కెట్లో లభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ పత్తికి డిమాండ్ ఉండడంతో కంపెనీలే రైతు వద్దకు వెళ్లి, పత్తిని కొనుగోలు చేస్తున్నాయి.
నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ వాన కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 60. 16 లక్షల ఎకరాలలో పత్తి సాగు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సేంద్రియ సాగు ద్వారా పత్తిని పండిస్తే రైతులు అధిక లాభాలను పొందుతారనేది ప్రభుత్వ ఆలోచన. సాధారణంగా అన్నీ పంటలతో పోల్చుకుంటే పత్తి పంటకు అధికంగా తెగుళ్ళు వస్తుంటాయి.
సేంద్రియ పత్తి సాగులో ఈ సమస్యలను సారించవచ్చు. ఇంకా, బెండ , ఆముదం, బంతిపూలు, మక్కజొన్న, లాంటి పంటలను పత్తిలో అంతరపంటలుగా సాగు చేయవచ్చు. కానీ,వీటిని ఎక్కువగా పెట్టకూడదు. అక్కడక్కడా నాటడం వలన పత్తి పట్టే పురుగు ఆ మొక్కల పైకి వెలుతుంది. దీని ద్వారా పత్తి కి ఎలాంటి నష్టం రాదు. మక్కజొన్నకు పట్టే క్రైసోపర్లా అనే పురుగు పత్తి పంటకు పట్టిన పురుగును తింటుంది. పత్తి పంటలో చీడపీడలు తగ్గించడానికి అధిక దిగుబడి కోసం రైతులు ఎరువులను, పురుగుమందులను వాడుతుంటారు. దీంతో వ్యక్తిగతంగానే కాకుండా సమాజానికి కూడా నష్టమే కలుగుతుంది.
అదే సేంద్రియ విధానంలో రసాయన ఎరువులు, పురుగు మందులకు స్థానమే లేదు. వాటి స్థానంలో సహజసిద్ధమైన ఎరువులను, కంపోస్ట్ ఎరువులను ఉపయోగిస్తారు. వాటిని రైతులే సొంతగా తయారు చేసుకోవచ్చు. వీటి ఖర్చు కూడా తక్కువే. పశువుల పేడ, మూత్రాన్ని, సేంద్రియ ఎరువుల తయారీకి ఉపయోగిస్తారు.మార్కె ట్లలోనూ సేంద్రీయ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. పత్తి పంటకు పురుగుల బెడద ఎక్కువ కాబట్టి సేంద్రీయ పద్ధతిలో పలు పదార్థాలతో తయారుచేసిన కషాయాలను ఉపయోగిస్తారు. అల్లం , వెల్లుల్లి, వేప, మామిడి ఆకులతో కషాయాన్ని తయారుచేస్తారు. ఇంకా మేకలు తినని ఆకుల నుంచి కూడా పురుగుల మందు తయారు చేస్తారు. పేడ, గోమూత్రం, ఆకులను కలిపి మరికొన్నిటిని తయారు చేస్తారు. వీటి మిశ్రమాన్ని కొన్ని రోజులు మురగ పెట్టి, వాటి నుంచి రసాయనాన్ని బయటకు తీస్తారు. ఒక లీటర్ నీటికి 5-10 మిల్లీమీటర్ల రసాయనాన్ని కలిపి చెట్టుపై పిచికారీ చేస్తారు. పత్తిని ఏకపంటగా సాగు చేయడం మంచిది కాదని నిపుణుల అభిప్రాయం.
దీనివలన నేల సారం తగ్గి భూమి పనికిరాకుండా పోతుంది. కానీ,సేంద్రియ పత్తి సాగులో కచ్ఛితంగా అంతర్ పంటలను వేయాలి. కంది, పెసర, బబ్బెర్లు, మక్కజొన్న, వంటివాటిని వేయాలి. ఇవి గాలిలోని నత్రజనిని తీసుకొని భూమిలోకి పంపిస్తాయి. కాబట్టి, భూసారం పెరుగుతుంది. అందుకే సేంద్రియ పంటల సాగు వైపు పయనిద్దాం.. భవిష్యత్ తరాలకు కలుషితం లేని నేలను అందిద్దాం.
కృపాదేవి చింతా (ఐ)
Share your comments