ఆధార్ వాడకంపై కేంద్రం మరో కీలక ప్రకటనను చేసింది. దేశవ్యాప్తంగా పలు ధృవపత్రాల జారీ కోసం ఇప్పటికే ఆధార్ ను ప్రామాణికంగా వినియోగిస్తుండగా.. మరికొన్ని అంశాలకు కూడా దీన్ని వర్తింపచేస్తూ కేంద్రం ఈ నిర్ణయాన్ని తెలిపింది.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, రిజిస్ట్రా జనరల్ ఆఫ్ ఇండియాకు అనుమతిస్తూ గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దీంతో ఇకపై దేశంలో ఆధార్ వాడకం మరింత విస్తృతం కానుంది.
దేశంలో జనన మరణాల నమోదు సమయంలో ఆధార్ ద్వారా ప్రామాణీకరణ చేయడానికి వీలుగా రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయానికి కేంద్రం అనుమతించింది. అయితే వీటి నమోదుకు ఆధార్ తప్పనిసరి మాత్రం కాదు. నిన్న ప్రచురించబడిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం జనన, మరణాల నమోదు సమయంలో అందించిన గుర్తింపు వివరాలను ప్రామాణీకరించడానికి ఆధార్ డేటాబేస్‌ను ఉపయోగించడానికి ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ రిజిస్టార్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయాన్ని అనుమతించింది.
జనన, మరణ నమోదు చట్టం, 1969 కింద నియమించిన రిజిస్ట్రార్ ఫారమ్‌లలో కోరిన ఇతర వివరాలతో పాటు సేకరించిన ఆధార్ నంబర్‌ను ధృవీకరించడానికి స్వచ్ఛంద ప్రాతిపదికన ఆధార్ ప్రమాణీకరణను నిర్వహించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఇకపై జననాలు లేదా మరణాలు, శిశువు, తల్లిదండ్రులు, జననాల విషయంలో ఇన్ఫార్మర్ యొక్క గుర్తింపును నిర్ధారించేందుకు ఆధార్ ను వాడబోతున్నారు.
కేంద్రం సూచించిన విధంగా ఆధార్ వాడకానికి రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కట్టుబడి ఉండాలని గెజిట్ లో పేర్కొన్నారు. 2020లో సుపరిపాలన, పబ్లిక్ ఫండ్స్ లీకేజీని నిరోధించడం, జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధార్ వాడకానికి అనుమతులు ఇవ్వొచ్చని ప్రకటించారు. వీటి ఆధారంగా పలు ప్రభుత్వ శాఖలు, సంస్ధలు కేంద్రం అనుమతి తీసుకుని ఆధార్ సమాచారాన్ని వాడుకుంటున్నాయి.
Share your comments