
అతిత్వరలో అన్నదాత సుఖీభవ పథకం పూర్తిస్థాయిలో అమలుచేస్తాం అని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో వెల్లడించారు. రైతులకు ఇచ్చిన హామీలు తీరుస్తామని, అన్నదాత సుఖీభవ పథకం మూడు విడతల్లో జరుగుతుందని, మొదట 5 వేలు, తర్వాత 5 వేలు, ఆతర్వాత 4 వేలు ఇస్తామని, చివరగా కేంద్రం అందించే 6వేలతో కలుపుకొని మొత్తం 20వేల రూపాయిలు రైతుల ఖాతాల్లో పడుతాయని సీఎం చంద్రబాబు అన్నారు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతీ ఆంధ్రప్రదేశ్ రైతుకు ఖచ్చితంగా 20 వేలు చొప్పున ఆర్దిక సాయం అందుతుందని, పీఎం కిసాన్ నిధులు ఎలా అయితే మూడు విడతల్లో విడుదల అవుతాయో, వాటితో పాటే రాష్ట్ర ప్రభుత్వ నిధులు కూడా ఇవ్వడం జరుగుతుంది అని స్పష్టం చేసారు. తాజాగా జరిగిన కలెక్టర్ల సమావేశంలో అనేక విషయాల గురించి చర్చించిన ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నదాత సుఖీభవ నిధులు తొలి రెండు విడతల్లో 5 వేలు, పిమ్మట 4 వేలు చొప్పున, నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడు దఫాలుగా ఇచ్చే ఆరు వేలతో కలిపి ఒక్కో రైతుకు 20 వేలు అందుతాయని వివరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని జిల్లాల అభివృద్ధికి కలెక్టర్లే బాధ్యులని, ప్రజలే ముఖ్యమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఇవేకాకుండా మత్స్యకారుల కోసం ప్రకటించిన 20 వేల వేటనిషేధ భత్యం ఏప్రిల్ లో అందజేస్తామని హామీనిచ్చారు.
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని, మార్చిలో పోయిన ఏడాది కంటే ఇప్పటికే ఎక్కువ వేడి నమోదు అయ్యిందని, కానీ ఈ పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం రైతుల మీద పడ కూడదు అని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని, ఈ సందర్భంగా నాయుడు గారు అన్నారు.
Share your comments