
గ్రామీణ వ్యవసాయ ఆదాయంలో పాడి పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, పశువులకు తాగునీరు, గడ్డి అందించడంలో రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ఉపాధి హామీ పథకం ద్వారా 12,500 నీటి తొట్టెల నిర్మాణానికి ప్రభుత్వం రూ.56.25 కోట్లు కేటాయించింది. ఈ తొట్టెల నిర్మాణాన్ని ఏప్రిల్ 15వ తేదీ నాటికి పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆయన ఆదేశించారు.
ఈ ప్రాజెక్టు పనులు ఆర్థిక సంవత్సరపు మొదటిరోజు నుంచే ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో పశుసంపదకు తాగునీటి సమస్య రాకుండా చూడాలని సూచించారు. ఒక్కో నీటి తొట్టె నిర్మాణానికి రూ.45,000 ఖర్చు చేయలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.
ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల పశువులకు తాగునీరు అందే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో భూమి పూజలు ఇప్పటికే పూర్తయ్యాయి. వేసవి తీవ్రత పెరిగేలోపు ఈ తొట్టెలు వినియోగంలోకి రావడం వల్ల పశువులు నీటి కొరతతో ఇబ్బంది పడకుండా ఉంటాయని, పాల ఉత్పత్తి పెరగడానికి కూడా దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ప్రాజెక్టును పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రభుత్వ చొరవ వల్ల రాష్ట్రంలోని పాడి పరిశ్రమ, పశుసంపద రక్షణకు ఇది ఒక కీలక నిర్ణయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Share your comments