
మొన్నటిదాకా ఆంధ్రాని గడగడ లాడించిన బర్డ్ ఫ్లూ ఇప్పుడు మళ్ళీ తెలంగాణపై దాడికి దిగింది. కొద్దిరోజుల క్రితమే, ఆంధ్రాలో ఒక బాలిక బర్డ్ ఫ్లూతో మృతి చెందింది అని వార్తలు రాగా, ప్రస్తుతం తెలంగాణలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది.
తెలంగాణలో బర్డ్ ఫ్లూ (Bird Flu in Telangana)
రంగారెడ్డి జిల్లా లోని అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో ఉన్న ఒక పౌల్ట్రీ ఫామ్‌లో కోళ్లకు బర్డ్ ఫ్లూ రావడంతో (Ranga Reddy poultry virus) వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయి. ఇది జరిగిన నాలుగు రోజుల్లో, ఆ కోళ్లను పరిశీలించిన అధికారులు శాంపిల్స్‌ని భోపాల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ (NIHSAD)కి పరిశోధన కోసం పంపించారు. పూర్తిగా పరీక్షలు చేసిన తరువాత ఆ కోళ్లకు H5N1 వైరస్ సోకిందని శాస్త్రవేత్తలు తేల్చిచెప్పారు. దాంతో హైదరాబాద్ లో H5N1 (H5N1 outbreak Hyderabad) వచ్చిందని గుర్తించి, దాదాపు 10వేల కోళ్లను చంపేసి.. జేసీబీ సాయంతో పూడ్చిపెట్టారు.
పరిస్థితులు చేయిదాటిపోయి, జరగరానిది జరగకూడదని అధికారులు పూర్తి స్థాయి నివారణా చర్యలు చేపట్టారు. అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో కోళ్లు, గుడ్ల అమ్మకుండా నిషేధం విధించారు. దాదాపు 10 కిలోమీటర్ల ప్రదేశంలో అధికారులు జల్లెడ పడుతున్నారు.
ఇప్పటికే గత కొన్ని నెలలుగా తెలంగాణాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. యాదాద్రి భువనగిరి, ఆ తర్వాత వనపర్తి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వేల కోళ్లు చనిపోయాయి. ఫిబ్రవరి లోనే మొత్తం 20,000 కోళ్లు చనిపోయాయని అధికారులు తేల్చారు.

ఆంధ్ర ప్రదేశ్ లో (Bird Flu in Andhra)
ఇక ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అయితే 5 లక్షలకు పైగా కోళ్లు చనిపోయాయి. నిపుణులు చెప్పే ప్రకారం, అక్కడ బర్ ఫ్లూ తగ్గింది. కానీ నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో ఇటీవల బాలిక మృతి చెందిన వార్తలు రావడంతో కథ మళ్ళీ మొదటికొచ్చింది.
నరసరావు పేటలో బర్డ్ ఫ్లూ వైరస్ (H5N1) లక్షణాలతో ఇటీవల బాలిక మృతి (Andhra girl dies bird flu) చెందిన ఘటనపై నిజానిజాలు తేల్చడానికి రాష్ట్రానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (Indian Council Of Medical Research - ICMR ) ప్రతినిధుల బృందం వచ్చింది.
వీరితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. అధికారులతో మాట్లాడిన పిదప వ్యాధి నిరోధక శక్తి లేకపోవడం, అపరిశుభ్ర వాతావరణం, లెప్టోస్పిరోసిస్ వంటి అంశాలు బాలిక మృతికి కారణమని నిర్ధారించారు (NIHSAD bird flu report).

బర్డ్ ఫ్లూపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు చెప్పారు. నరసరావుపేటలో పర్యటన అనంతరం చంద్ర బాబు, ఐసీఎంఆర్ బృందంతో బాలిక మృతికి గల కారణాలను చర్చించారు. మృతిచెందిన బాలిక నుంచి సేకరించిన నమూనాలలో H5N1 లక్షణాలు బయటపడినప్పటికీ, ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయని బృందం సభ్యులు చెప్పారు(ICMR Andhra bird flu investigation).
సరిగ్గా ఉడికించని మాంసం తినడం, వ్యాధి నిరోధకశక్తి లేకపోవడం, ఎలుకల విసర్జన వల్ల వ్యాపించే వ్యాధి (లెప్టోస్పిరోసిస్), అపరిశుభ్ర వాతావరణం కూడా మృతికి కారణాలుగా తమ అధ్యయనంలో తేలిందన్నారు.
చివరగా, ఆ పరిసర ప్రాంతంలో ఎలాంటి బర్డ్ ఫ్లూ లక్షణాలు లేవని, 8 బృందాలతో సర్వే చేపట్టామని అధికారులు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి వివరించారు.
ప్రజలకు సూచన (Precautions for Public)
కానీ ఎవరుఎంత భరోసా ఇచ్చినాగాని ఇంకా కొన్ని రోజులవరకు … ఇప్పుడు కోళ్లు తినవచ్చా? అన్న అనుమానం సామాన్య ప్రజలకు రావడం పరిపాటే. అయితే ప్రస్తుతం మంచిగా ఉన్న కోళ్లు తినవచ్చనీ, కానీ ఖచ్చితంగా వాటిని 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో వండుకోవాలని, అంటే మన గ్యాస్ స్టవ్‌లో మీడియం, హై ఫ్లేమ్‌లో వండుకుంటే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. అలానే వీలైనంత వరకు బయట పదార్ధాలు తినకుండా ఉండడం మేలు అని సలహా ఇస్తున్నారు. అలానే బర్డ్ ఫ్లూ లక్షణాలు, వ్యాప్తి నిరోధం(Bird flu symptoms and spread) వీటి గురించి మరింత సమాచారం తెలుసుకోవడం ముఖ్యం.
Read More :
Share your comments