
దేశంలోని వృక్ష జన్యు వనరులను భవిష్యత్తు తరాలకు భద్రపరచేందుకు కేంద్ర ప్రభుత్వం రెండవ జాతీయ జన్యు బ్యాంక్ ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. 2025-26 కేంద్ర బడ్జెట్‌లో “నూతన ఆవిష్కరణలపై పెట్టుబడులు” నేపధ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం, భారత వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలకమైన అడుగు.
భారతీయ వ్యవసాయానికి మేలుకలిగించే నిర్ణయం
- 10 లక్షల జన్యు వనరులను భద్రపరచే సామర్థ్యం కలిగిన అత్యాధునిక జన్యు బ్యాంక్ నిర్మాణం.
- భవిష్యత్తులో ఆహార భద్రత, పోషక భద్రత కోసం కీలక ప్రాజెక్టు.
- వృక్ష జన్యు వనరుల సంరక్షణ ద్వారా పంటల అభివృద్ధికి తోడ్పాటు.
జాతీయ జన్యు బ్యాంక్
ప్రస్తుతం న్యూఢిల్లీలోని ICAR-National Bureau of Plant Genetic Resources (NBPGR) లో జాతీయ జన్యు బ్యాంక్ పనిచేస్తోంది. ఈ బ్యాంక్ 4,71,561 జన్యు నమూనాలను భద్రపరిచిన రెండో అతిపెద్ద జన్యు బ్యాంక్. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగంలోని వృక్ష సంరక్షణ, వ్యవసాయ పరిశోధన సంస్థలు దీనిని ఉపయోగించుకుంటున్నాయి.
భారతదేశం - గ్లోబల్ లీడర్‌గా ఎదుగుదల
రెండవ జన్యు బ్యాంక్ భారతదేశాన్ని ప్రపంచ స్థాయిలో బలమైన జీవవైవిధ్య కేంద్రంగా నిలిపేందుకు పెద్ద దోహదం చేయనుంది. వ్యవసాయ ఉత్పత్తి పెంపుదల, కొత్త పంట రకాల అభివృద్ధి ద్వారా ఆహార, పోషక భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Share your comments