News

ఈ-నామ్ 2.0 – రైతుల కోసం ఆన్ లైన్ మార్కెట్

Sandilya Sharma
Sandilya Sharma

వ్యవసాయ మార్కెట్‌లో నూతన విప్లవం

దేశవ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధరలు అందించేందుకు జాతీయ వ్యవసాయ మార్కెట్ (NAM) కీలక పాత్ర పోషిస్తోంది. చిన్న, సన్నకారు రైతులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు, ఆధునిక సాంకేతికతను పెంచేందుకు ఈ-నామ్ 2.0ను కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించనుంది. రైతులు ఆన్‌లైన్‌లో తమ పంటను విక్రయించే అవకాశాన్ని కల్పిస్తూ, ఫాం గేట్ మాడ్యూల్, ఎఫ్‌పీఓల మద్దతు, లాజిస్టిక్స్ సేవలు వంటి సౌకర్యాలను కలుపుకొని ముందుకెళుతోంది.

ఈ-నామ్ వేదిక – రైతులకు అదనపు ఆదాయ మార్గం

దేశవ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లో రైతులకి గిట్టుబాటు ధర లభించట్లేదు. మధ్యవర్తుల ఆధిపత్యం, లాజిస్టిక్స్ సమస్యలు ఇలా దీనికి ఎన్నో కారణాలు. అందుకే ఈ-నామ్ వేదిక వాటిని అధిగమించేందుకు రూపొందించబడింది. ఇందులో బ్యాంకు ఖాతా ధృవీకరణ, ఆధార్ ఆధారిత ఈకేవైసీ, లాజిస్టిక్స్ సదుపాయాలు, పైడ్ సేవలు వంటి ప్రత్యేకతలు ఉంటాయి.

ఆన్‌లైన్ మార్కెట్ వేదిక: రైతులు ఈ-నామ్ పోర్టల్, మొబైల్ యాప్ (Android & iOS) ద్వారా నమోదు చేసుకుని, ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసుకోవచ్చు.ఏపీఎంసీ సహాయంతో రైతులకు సహాయపడేందుకు వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీ (APMC) ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాలు, అలానే టోల్-ఫ్రీ నంబర్ (18002700224) అందుబాటులో ఉంది.
2025 ఫిబ్రవరి 28 నాటికి 231 ఉత్పత్తులకు వ్యాపార యోగ్య కొలమానాలు ఖరారు చేశారు.

ఎఫ్‌పీఓల భాగస్వామ్యం – రైతులకు సమూహ మద్దతు

చిన్న రైతుల పంట ఉత్పత్తి తక్కువగా ఉండటంతో, మార్కెట్‌లో గట్టి పోటీకి తట్టుకోలేకపోతున్నారు. దీన్ని అధిగమించేందుకు ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ (FPOs) వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు. ఎఫ్‌పీఓల ద్వారా ఉత్పత్తులను ఒకచోట చేర్చి
ఉమ్మడి అమ్మకాల ద్వారా మంచి ధరలు పొందే అవకాశం ఉంది.  ఈ-నామ్ ద్వారా ఆన్‌లైన్ ట్రేడింగ్ మాడ్యూల్ ను ఉపయోగించి, ఇప్పటివరకు 4,392 ఎఫ్‌పీఓలు ఈ-నామ్‌లో చేరాయి. 

ఫాం గేట్ మాడ్యూల్ – రైతులకు మరింత లబ్ధి

రైతులు తమ పంటను ఏపీఎంసీ మార్కెట్‌కు తీసుకెళ్లకుండా నేరుగా ఫాం గేట్ మాడ్యూల్ ద్వారా అమ్ముకునే వెసులుబాటు ఉంది. దీనివల్ల….  

ప్రయాణ వ్యయాన్ని తగ్గించే అవకాశం
స్థానిక కొనుగోలుదారులకు నేరుగా విక్రయించే సౌలభ్యం
ఆన్‌లైన్ ద్వారా ఎక్కువ మంది వ్యాపారులను ఆకర్షించగల సామర్థ్యం

అంతర్-రాష్ట్ర వ్యాపారం – లాజిస్టిక్స్ ఆధునీకరణ

రైతులకు విస్తృత మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు ఈ-నామ్ వేదిక అంతర్ రాష్ట్ర వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రయత్నిస్తోంది. అయితే, ఇతర రాష్ట్రాల వ్యాపార లైసెన్సులను, APMC చట్ట నియంత్రణలు అనుమతించాలి.

ఈ-నామ్ వేదిక రైతులకు బలమైన మార్కెట్, మంచి లాభాలు, మధ్యవర్తుల ఆంక్షలను తొలగించడం వంటి అనేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ-నామ్ 2.0 మరింత ఆధునికీకరించబడుతూ, రైతుల ఆదాయాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది.

రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఉత్పత్తులను మరింత అధిక లాభాలతో విక్రయించే దిశగా ముందుకు సాగాలి.

Share your comments

Subscribe Magazine