
దేశవ్యాప్తంగా రైతులను ప్రత్యేక గుర్తింపు నెంబర్లతో గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ ప్రాజెక్ట్ తెలంగాణలో అధికారికంగా ప్రారంభమైంది. వ్యవసాయ రంగ డిజిటలీకరణ, కేంద్ర పథకాల అమలులో సౌలభ్యం, రైతులైన వారు నిజంగా వ్యవసాయ భూములకు యాజమానులేనా అనే విషయంలో స్పష్టత కోసం ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టారు.
అధికారికంగా రైతుల రిజిస్ట్రేషన్ ప్రారంభం
ప్రారంభ దశలో రైతులు తమ మండల వ్యవసాయ అధికారుల (MAO), వ్యవసాయ విస్తరణాధికారుల (AEO) వద్ద తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు. త్వరలోనే మీ సేవా కేంద్రాల్లో కూడా ఈ రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించనున్నారు. రైతులు ఆధార్, మొబైల్ నంబర్, పట్టాదారు పాస్‌పుస్తకంతో సహా నమోదు చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అనంతరం ఓటీపీ ధృవీకరణ ద్వారా రైతుకు 11 అంకెల విశిష్ట గుర్తింపు సంఖ్య కేటాయించబడుతుంది.
కేంద్ర పథకాల అమలుకు అనుసంధానం
ఈ విశిష్ట సంఖ్యను ఆధారంగా తీసుకుని రైతులకు పీఎం కిసాన్, పంటల బీమా, వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలలో లబ్ధిని కల్పించనున్నారు. వివరాలు లేని రైతులకు సకాలంలో కేంద్ర పథకాలు అందడం కష్టమవుతోందని గుర్తించిన కేంద్రం, ఈ రిజిస్ట్రేషన్ ద్వారా సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించాలనుకుంటోంది.
రాష్ట్ర పథకాలతో సంబంధం లేదు
ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యకు రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రైతుబంధు, రుణమాఫీ, రైతు భరోసా వంటి కార్యక్రమాలకు సంబంధం ఉండదని వ్యవసాయ శాఖ స్పష్టం చేసింది. అలాగే, ఈ రిజిస్ట్రేషన్ ద్వారా రైతులకు చట్టబద్ధ భూయాజమాన్య హక్కులు కల్పించబడవు. భూస్వామ్య హక్కులకు రెవెన్యూశాఖలో నమోదైన భూమి వివరాలే ప్రామాణికంగా పరిగణించబడతాయని పేర్కొన్నారు.
రైతులకు అవగాహన, శిక్షణ
ఈ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేయడానికి MAO, AEO లకు ఇప్పటికే శిక్షణను అందించినట్లు వ్యవసాయశాఖ తెలిపింది. రైతులు తమ వివరాలు సక్రమంగా నమోదు చేసుకుని, ప్రభుత్వ పథకాల లబ్ధిని పొందాలంటే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
భవిష్యత్‌లో సులభతర సేవల కోసం కీలకం
ఈ రిజిస్ట్రేషన్ ద్వారా దేశవ్యాప్తంగా రైతుల సమాచారాన్ని సమీకరించడం, వ్యవసాయ రంగంలో డిజిటల్ మార్పులకు దోహదపడడం, కేంద్ర పథకాలను వేగంగా అమలు చేయడం వంటి లక్ష్యాలను ప్రభుత్వం ముందుపెడుతోంది. రైతులు తమ భవిష్యత్తు భద్రత కోసం తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పాల్గొనాలి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు MAO లేదా AEOలతో తక్షణమే సంప్రదించాలని వ్యవసాయశాఖ అధికారులు పిలుపునిచ్చారు.
Read More :
Share your comments