
రైతులు తమ పొలాల్లోనే అధిక దిగుబడులు ఇచ్చే విత్తనాలను స్వయంగా ఉత్పత్తి చేసుకునేలా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ శిక్షణలు ఇక పెద్దపల్లి జిల్లాలో ప్రారంభం అయ్యాయి. కునారం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఇప్పటికే మేలైన వరి విత్తనాలను అభివృద్ధి చేస్తుండగా, అవి తెలంగాణతో పాటు దక్షిణ భారత రాష్ట్రాల్లో సైతం మంచి దిగుబడులు ఇస్తున్నాయి.
రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు:
జిల్లా వ్యవసాయ శాఖ ‘రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నేటి నుంచి చేపట్టనుంది. ఇందులో నూతన విత్తనోత్పత్తి పద్ధతులు, అధిక దిగుబడులను సాధించే శాస్త్రీయ పద్ధతులు, పర్యావరణ హితమైన సాగు మెలకువలను రైతులకు నేర్పించనున్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని కునారం వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త శ్రీధర్ సిద్ధి నేతృత్వంలో నిర్వహిస్తున్నారు.
ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి:
రైతులకు కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. తద్వారా పీఎం కిసాన్ పథకంలో తదుపరి లబ్ధి పొందాలంటే రైతులు తమ భూమి వివరాలతో పాటు ఆధార్ ఆధారంగా యూనిక్ ఐడీ (11 అంకెలతో) పొందవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చట్టబద్ధ యాజమాన్య హక్కులను కల్పించకపోయినా, కేంద్ర పథకాల అమలుకు ప్రధాన ఆధారంగా మారుతుంది. ఈ రిజిస్ట్రేషన్ మే 5 నుంచి జిల్లా క్లస్టర్లలో ప్రారంభం అయ్యాయి. రైతులు తమ ఏవో, ఏఈవోలను సంప్రదించి తగిన సమాచారంతో నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అవగాహన సదస్సులు – తేదీలు, ప్రదేశాలు:
వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మే 5 నుంచి జూన్ 11 వరకు జిల్లా వ్యాప్తంగా 6 రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాలు జరుగనున్నాయి.
- మే 5 – గంగారం (కాల్వ శ్రీరాంపూర్ మండలం)
- మే 12 – ముత్తారం మండల కేంద్రం
- మే 24 – తారుపల్లి (కాల్వ శ్రీరాంపూర్ మండలం)
- మే 28 – జీలకుంట (ఓదెల మండలం)
- జూన్ 5 – రాంపల్లి (పెద్దవల్లి మండలం)
- జూన్ 11 – పెద్దపల్లి జిల్లా కేంద్రం
విషయాల పరిధి:
ఈ శిక్షణల్లో మోతాదుకు మించి యూరియా, రసాయన ఎరువుల వాడకానికి వ్యతిరేకంగా అవగాహన కల్పించబడుతుంది. సాగునీటి సద్వినియోగం, భూగర్భ జలాల పరిరక్షణ, పంటల మార్పిడి, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై సైంటిఫిక్ అవగాహన ఇస్తారు. రైతులు స్థానికంగానే అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను తయారు చేసుకునేలా ప్రోత్సహిస్తారు.
రైతులకు డీఏవో సూచన:
ఈ రెండు కార్యక్రమాలు రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి పేర్కొన్నారు. "శిక్షణతో పాటు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా పూర్తి చేయాలి. క్లస్టర్లతో పాటు గ్రామ పంచాయతీల్లోనూ నమోదు చేపడతాం. రైతులు అందుబాటులో ఉండాలి" అని ఆయన పేర్కొన్నారు.
Read More :
Share your comments