ఖరీఫ్ సీజన్ మొదలయ్యి 3 వారాలు కావొస్తున్నా ఇంకా రాష్ట్రములో వాన జాడ లేకపోవడం తో వరి సాగు చేసే రైతుల్లో అయోమయం నెలకొంది. నైరుతి రుతుపవణాలు రాష్ట్రం లోకి ప్రవేసిస్తే నార్లు పోద్దామని రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు వర్షాలు పడినప్పటికీ, గడువు దాటిపోయినందున దీర్ఘ కాలిక రకాలను సాగు చేయవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
ఒకవేళ ఇప్పటికిప్పుడు వర్షాలు పడినా కానీ .. దీర్ఘకాలిక రకాల సాగు చేస్తే మంచిది కాదని .. మధ్య, స్వల్పకాలిక వరి వంగడాలు మాత్రమే సాగు చేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. సాధారణంగా బోర్లు, బావుల్లో నీటి లభ్యత ఉన్న రైతులు మే చివరి వారం నుంచి జూన్ మొదటి వారంలోపే వరి నార్లు పోస్తారు. నిజామాబాద్, కామారెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ముందస్తుగా నార్లు పోస్తారు. నాట్లు కూడా అలాగే వేస్తారు. ఈ సీజన్‌లోనూ సాగునీటి లభ్యత ఉన్న కొన్ని ప్రాంతాల్లో నార్లు పోశారు. కానీ రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ఇంకా రాకపోవటంతో.. బోర్లు, బావుల కింద నార్లు పోసిన రైతులు కూడా నాట్లు వేసేందుకు ఆలోచిస్తున్నారు. ఇదిలా ఉండగా వానాకాలం సాగు సీజన్ మొదలై రేపటికి మూడు వారాలు అవుతుంది. ఒకవేళ ఈ రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించి, వర్షాలు పడినప్పటికీ.. వెంటనే నార్లు పోయడం సాధ్యం కాదు.
విపరీతమైన ఉష్ణోగ్రతలతో భూమి వేడెక్కింది. కనీసం వారం పాటు వానలు పడితే తప్ప భూమి చల్లబడే పరిస్థితి లేదు. భూతాపం తగ్గిన తర్వాతే రైతులు సాగు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. నైరుతి రాక ఆలస్యమైన నేపథ్యంలో జూలై ఒకటి నుంచి సాగుకు శ్రీకారం చుట్టాల్సివస్తే.. దీర్ఘకాలిక వంగడాల సాగు శ్రేయస్కరం కాదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీర్ఘకాలిక వంగడాల పంట కాలపరిమితి కనీసం 150-165 రోజులు ఉంటుంది. విత్తనాలు చల్లి, నారు చేతికి రావాలంటే నెల పడుతుంది. ఈ క్రమంలో దీర్ఘకాలిక రకాల జోలికి పోవద్దని, ఒకవేళ ప్రతికూల పరిస్థితుల్లో సాగుచేస్తే.. దిగుబడి తగ్గుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే ‘వెదజల్లే పద్ధతి’లో వరి సాగు చేసే రైతులకు.. డ్రమ్ సీడర్‌తో విత్తనాలు వేసే రైతులకు మాత్రం కాస్త అవకాశం ఉంది. దీర్ఘకాలిక రకాల సాగుకు కటాఫ్ తేదీ జూన్ 15 కాగా.. మధ్యకాలిక రకాల సాగుకు జూన్ మూడు, నాలుగో వారం వరకు అవకాశం ఉంటుంది. జూలై ఒకటి వరకు వెళ్తే.. స్వల్పకాలిక రకాలు సాగుచేయాల్సిందే. స్వల్పకాలిక రకాలు సాగుచేస్తే 115 రోజుల నుంచి 125 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఇందులో తెలంగాణ సోనా, జగిత్యాల రైస్-1, కూనారం సన్నాలు, ఎంటీయూ- 1001 రకాలను సాగు చేస్తే బాగుంటుందని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు
ఇది కూడా చదవండి
Share your comments