
వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక, ఆక్వా, వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ఏప్రిల్ 11 నుంచి 14 వరకు తెలంగాణ రైతు మహోత్సవం నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రకటించారు.
మంగళవారం తన కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ మహోత్సవాన్ని అగ్రి కల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహిస్తామని తెలిపారు. రైతుల సమగ్రాభివృద్ధి దిశగా కొత్త ఆవిష్కరణలు, ఆధునిక వ్యవసాయ యంత్రాల ప్రదర్శన చేపడతామని వెల్లడించారు.
ఈ మహోత్సవంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని సూచించారు. వ్యవసాయ, పశుపోషణ, కోళ్ల పరిశ్రమ, మత్స్యపరిశ్రమ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, ప్రభుత్వ అధికారులు, సంబంధిత సంస్థలు హాజరవుతారని తెలిపారు. విత్తనాలు, ఎరువులు, మందుల కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు కూడా పాల్గొననున్నారని చెప్పారు.
సుమారు 400 ప్రదర్శన స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో సభ్యులు కెవిఎన్ రెడ్డి, భవాని రెడ్డి, గోపాల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Share your comments