
వరికు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు – జిల్లాలో కొత్త పంటకు ఊతమిస్తున్న ప్రభుత్వం
నిజామాబాద్ జిల్లాలో 5,600 ఎకరాల్లో సాగు – 400 ఎకరాల్లో కోతకు సిద్ధం
వరి పంటకు ప్రత్యామ్నాయంగా అధిక దిగుబడులు ఇచ్చే ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. రైతులకు తక్కువ ఖర్చుతో అధిక ఆదాయాన్ని అందించే పంటగా ఆయిల్‌పామ్‌ను గుర్తించి, జిల్లాల్లో విస్తృతంగా సాగు చేసే దిశగా చర్యలు తీసుకుంటోంది.
ఐదేళ్ల నుంచి 30 ఏళ్ల వరకూ దిగుబడి
ఒక్కసారి నాటిన ఆయిల్‌పామ్ మొక్కలు 30 ఏళ్ల వరకూ దిగుబడి ఇస్తాయి. మొదటి కోత 3వ సంవత్సరం నుంచే ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ స్థిరమైన ఆదాయ వ్యవస్థతో రైతులు ఆర్థికంగా బలపడే అవకాశముందని వ్యవసాయ శాఖ అంటోంది.
జిల్లాలో 5,600 ఎకరాల్లో సాగు – 400 ఎకరాల్లో కోత సిద్ధం
నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే 5,600 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు జరిగింది. ఇందులో 400 ఎకరాల్లో కోతకు తగిన దశకు పంటలు వచ్చాయి. ఎకరానికి 10 టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేయబడింది. మార్కెట్ ధర టన్నుకు రూ.21,000గా నిర్ణయించబడింది. అంటే ఒక్క ఎకరం నుండి రైతుకు రూ.2 లక్షల వరకు ఆదాయం పొందే అవకాశం ఉంది.
కొనుగోళ్లకు 9 కేంద్రాలు సిద్ధం
పంట కోత పూర్తయిన తర్వాత ఖమ్మం జిల్లా అశ్వారావుపేట ఆయిల్‌ఫెడ్ ఫ్యాక్టరీకి ఆయిల్‌పామ్ గెలలు తరలించనున్నారు. ఇందుకోసం అధికారులు జిల్లావ్యాప్తంగా 9 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. అవి: అంకాపూర్, నందిపేట, వెల్గటూర్, మోర్తాడ్, భీంగల్, ఇందల్వాయి, బోర్గాం (పి), వీరన్నగుట్ట, బోధన్. ఆయిల్‌ఫెడ్ కంపెనీ యాజమాన్యం ప్రతి సెంటరులో తూకం కొలిచే కాంటాలను ఏర్పాటు చేయనుంది.
2024-25లో 3,000 ఎకరాల లక్ష్యం
ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా యంత్రాంగం 3,000 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. దీనిపై మిషన్ మోడ్‌లో అవగాహన కార్యక్రమాలు, మొక్కల సరఫరా, డిమాండ్ ఆధారంగా కేంద్రాల ఏర్పాటు కొనసాగుతోంది.
నిర్మల్లో త్వరలో పామాయిల్ ఫ్యాక్టరీ
రాష్ట్రంలో రెండు జిల్లాలకు ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం, నిర్మల్‌లో రూ.100 కోట్ల వ్యయంతో ప్రీ యూనిక్ కంపెనీ ఆధ్వర్యంలో ఒక పెద్ద ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మించబోతోంది. దీనితో నిజామాబాద్, నిర్మల్ రైతులకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
ప్రభుత్వం నుంచి రూ.3 కోట్ల మద్దతు
రైతులపై ఆర్థిక భారం పడకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రూ.3 కోట్ల మేర నిధులు కేటాయించింది. రూ.193 విలువచేసే ఆయిల్‌పామ్ మొక్కలను రెండు రూపాయలకే అందిస్తోంది. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థపై
- ఎస్సీ, ఎస్టీలకు – 100% సబ్సిడీ
- బీసీలకు – 90% సబ్సిడీ
- 12 ఎకరాల లోపు భూమి కలిగిన రైతులకు – 80% సబ్సిడీ అందిస్తోంది.
అంతేగాక, ఎకరానికి రూ.4,200 సాగు ఖర్చుగా కూడా మంజూరు చేసింది.
అందుకనే రైతులు ఆయిల్‌పామ్ సాగుకు ముందుకు రావాలని, తక్కువ ఖర్చుతో అధిక లాభాలను పొందగలిగే అవకాశం ఉందని, ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని, త్వరలో నిర్మల్ జిల్లాలో ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని, ఈ పంట ద్వారా రైతులకు భవిష్యత్‌లో మంచి ఆదాయం లభిస్తుందని హార్టికల్చర్ అధికారుల అభిప్రాయం
వరి వంటి ఎక్కువ నీటి అవసరమున్న పంటలకు బదులుగా ఆయిల్‌పామ్ సాగు ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడంతో పాటు రైతుల ఆదాయాన్ని పెంచే అవకాశం ఏర్పడుతోంది. ప్రభుత్వం ఇచ్చే మద్దతుతో ఈ పంట వ్యవసాయ రంగానికి కొత్త మార్గాన్ని చూపనుంది.
Share your comments