
తొలకరి వర్షాలు ప్రారంభమయ్యేలోపు రైతులు తమ పొలాలను సన్నద్ధం చేసుకోవడం అత్యంత కీలకమని మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశం తెలిపారు (pre-monsoon farming tips). వేసవి కాలాన్ని సద్వినియోగం చేసుకొని దుక్కుల పనులు ముందుగానే పూర్తిచేస్తే, త్వరలో రానున్న వర్షాకాలంలో సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు.
పాత సంప్రదాయాల ప్రాముఖ్యత
మునుపటి రోజుల్లో రైతులు తమ ఎద్దులు, ఆవులు, గేదెలను పొలాల్లో కట్టేసేవారు. వాటి పేద మూత్రం నేరుగా నేలపై పడటంతో, ఆ అవశేషాలు సేంద్రియ ఎరువులుగా మారి నేలల సంస్కరణకు సహాయపడేవని వెంకటేశం గుర్తు చేశారు. ఇప్పటిలా రసాయన ఎరువులపై ఆధారపడకుండా, ప్రకృతిసిద్ధమైన ఈ విధానం ఖర్చులు తగ్గించడమే కాక, పంటల ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.
అకాల వర్షాల తర్వాత అనుకూలమైన తేమ
ఇటీవల షాబాద్ మండలంలో విస్తరించిన అకాల వర్షాల వల్ల నేలలో తేమ పెరగడంతో దుక్కులు చేయడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ తరుణంలో ట్రాక్టర్లతో కానీ, ఎద్దుల నాగళ్లతో కానీ 9 అంగుళాల లోతుగా దుక్కులు చేయాలని అధికారుల సూచన. లోతు దుక్కుల ద్వారా నేలలో దాగున్న పురుగులు, తెగుళ్లు వెలికి రావడంతో, పంటలకు రక్షణ కలుగుతుంది.

వేర్ల విస్తరణకు సహకారం
వేసవిలో లోతుగా దుక్కులు చేయడం వల్ల తొలకరి వర్షాల తర్వాత సేద్యం ప్రారంభించినప్పుడు వేర్లు నేలలో లోతుగా విస్తరించగలవు. దీనివల్ల పంటలకు నీటి గ్రహణ సామర్థ్యం పెరుగుతుంది. సేద్యానికి ఉపయోగించే గొర్రు, గుంటుక, దతెల వంటి పరికరాలు నేలలో సుమారుగా 3–4 అంగుళాల లోతు వరకూ చొచ్చుకుపోతాయి. పదే పదే దుక్కులు చేసేటప్పుడు నేలలో ఒక గట్టి పొర ఏర్పడుతుంది, ఇది నీటిని అడ్డుకుంటుంది. ఈ సమస్యను నివారించేందుకు వేసవిలోనే లోతు దుక్కులు చేయాలని సూచిస్తున్నారు.
సేంద్రియ పదార్థాల పెంపుకు అవకాశం
పంటకోత అనంతరం పొలాల్లో మిగిలే మొక్కజొన్న మొదళ్లు, ఆకులు, కలుపు మొక్కలు మొదలైన అవశేషాలు లోతు దుక్కుల సమయంలో కుళ్లిపోతాయి. ఇది సేంద్రియ పదార్థాల పరిమాణాన్ని పెంచుతుందని, జీవవైవిధ్యాన్ని నిలుపుతుందని అధికారులు తెలియజేశారు. పశు ఎరువులను వేసవిలోనే పొలాల్లో పంపి, వర్షాల అనంతరం దుక్కులు చేయడం వల్ల ఈ ఎరువులు నేలలో బాగా కలుస్తాయని వివరించారు.
వేసవిలోనే సరైన ప్రణాళికతో దుక్కులు చేయడం వల్ల రైతులు పొలాలను తొలకరి సాగుకు సమాయత్తం చేయవచ్చు. తెగుళ్లు నివారణ, నీటి నిల్వ సామర్థ్య పెరుగుదల, వేర్ల విస్తరణ, సేంద్రియ పదార్థాల వృద్ధి వంటి ప్రయోజనాల దృష్ట్యా, ఈ ప్రక్రియను తప్పకుండా అమలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
Read More:
Share your comments