
రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు రైతులకు వ్యవసాయ మంత్రిత్వ శాఖ శుభవార్త అందించింది. 2023 మార్చి నాటికి ఒక టన్ను ఆయిల్ పామ్ గెలల ధర రూ.14,174గా ఉండగా, ప్రస్తుతం అది రూ.21,000కు పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.8,500 మేర ధర పెరిగిందని తెలిపారు, ఆయిల్ పామ్ సాగు లాభాలు మెరుగయ్యాయి అని. పెరిగిన ధరల వల్ల రాష్ట్రంలోని 64,582 మంది ఆయిల్ పామ్ రైతులకు అదనపు లబ్ధి చేకూరిందని తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు.
పంట మార్పిడి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని, వంటనూనెల డిమాండ్‌కు అనుగుణంగా, రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించనున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే 31 జిల్లాల్లో 14 కంపెనీలకు అనుమతులు ఇచ్చి, 2.43 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరించారని వివరించారు.
రైతుల ఆదాయాన్ని పెంచేందుకు తోటల యాజమాన్యం, అంతర పంటల సాగు కోసం 45,548 మంది రైతుల ఖాతాల్లో రూ.72 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు కేంద్రం ముడి పామ్ ఆయిల్ దిగుమతి సుంకాన్ని 27.5 శాతానికి పెంచడంతో 2025 ఆయిల్ పామ్ ధర గణనీయంగా పెరిగిందని వెల్లడించారు.
ఈ పెరుగుదలతో రాష్ట్రంలోని ఆయిల్ పామ్ రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి తెలిపారు. తాజా చర్యలతో మరింత మంది రైతులు ఈ సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
Share your comments