
న్యూఢిల్లీ: భారతదేశం పశుసంపద పరంగా సంపన్న దేశాల్లో ఒకటి. గ్రామీణ జీవన విధానంలో భాగంగా రైతులు వ్యవసాయంతో పాటు ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నల వంటి పశువులను పెంచుతూ జీవనోపాధిగా చేసుకుంటున్నారు. వీటి నుండి వచ్చే పేడను సంప్రదాయంగా ఎరువుగా వినియోగిస్తూ పంటల దిగుబడి పెంచుకుంటున్నారు. అయితే ఇప్పుడు ఇదే పద్ధతి గల్ఫ్ దేశాల్లోనూ ట్రెండ్‌గా మారింది.
గోమయానికి అరబ్ దేశాల్లో పెరుగుతున్న డిమాండ్
ఆవు పేడ పొడిని ఖర్జూర పంటల దిగుబడి పెంపునకు వినియోగించడం ద్వారా అరబ్ దేశాల వ్యవసాయ పరిశోధకులు గణనీయమైన ఫలితాలను సాధించారట. ముఖ్యంగా కువైట్, సౌదీ అరేబియా వంటి దేశాల్లో గోమయ వినియోగం భారీగా పెరుగుతోంది. ఖర్జూర ఉత్పత్తిలో ఇది సహాయకారి కావడంతో, ఇప్పుడు భారతదేశం నుంచి గోమయాన్ని ఎగుమతి చేయడంపై ఆసక్తి నెలకొంది.
విజ్ఞాన ఆధారిత వినియోగం
అరబ్ దేశాల్లో గోమయ వినియోగం కేవలం సంప్రదాయ నమ్మకాల ఆధారంగా కాదు. శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాత, ఖర్జూర పంటల్లో గోమయం పొడి వాడకం ద్వారా పరిమాణం, రుచి, దిగుబడి అన్నింటిలోనూ మెరుగుదల కనిపించిందని పరిశోధకులు పేర్కొన్నారు. దీంతో అటు ప్రభుత్వ స్థాయిలోనూ, ఇటు ప్రైవేటు వ్యవసాయ కంపెనీలు కూడా గోమయం దిగుమతికి ఉత్సాహం చూపిస్తున్నాయి.

రూ. 400 కోట్ల ఎగుమతులు
2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అరబ్ దేశాలకు జరిగిన గోమయ ఎగుమతుల విలువ రూ.400 కోట్లు దాటినట్లు వాణిజ్య వర్గాల సమాచారం. ఒక్కో కిలో గోమయం ధర రూ.30 నుంచి రూ.50 మధ్య పలుకుతోంది. గత ఏడాది నుండి ఈ డిమాండ్ మరింతగా పెరగడంతో ఇప్పుడు గోమయ ఉత్పత్తి, ప్యాకేజింగ్, ఎగుమతుల ప్రక్రియ మరింత ప్రొఫెషనల్ స్థాయిలో మారుతోంది.
భారత పశుసంరక్షకులకు ఇదొక అవకాశమే!
ఈ అభివృద్ధి పశుపోషక రైతులకు ఆదాయ మార్గంగా మారే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులకు పెరుగుతున్న ప్రాధాన్యత నేపథ్యంలో గోమయాన్ని గ్లోబల్ మార్కెట్‌కు సరఫరా చేయడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం లభించనుంది.
గతంలో మన ఊరి వ్యవసాయ పద్ధతుల్లో మాత్రమే వినియోగించబడే గోమయం, ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో విలువైన వస్తువుగా మారింది. కేవలం మన శాస్త్రీయ సంపత్తినే కాకుండా, సంప్రదాయ జ్ఞానాన్ని కూడా ప్రపంచం ఇప్పుడు గుర్తిస్తోంది. గోమయంతో నిక్షిప్తమైన ఈ సేంద్రీయ ఉద్యమం భారత వ్యవసాయ రంగాన్ని కొత్త శిఖరాలకు చేర్చనుందని నిపుణుల అభిప్రాయం.
Read More:
Share your comments