పుడమి తల్లిని నమ్ముకుని ప్రకృతి వనరులను వాడుకుంటూ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ దేశానికి రైతే రాజని నిరూపించారు 76 ఏళ్ల వృద్ధ రైతు పొన్నం మల్లయ్య. పొన్నం మల్లయ్య వరంగల్ జిల్లా ఎనబావి గ్రామంలో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారు . ఇతన్ని చూసి గ్రామం లోని మిగితా రైతులు రసాయనిక ఎరువులు లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేసి ఊరికి తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు.
గత 20సంవత్సరాల నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. మొదట రసాయనాలు ఉపయోగించి సేద్యం చేసి అధిక దిగుబడి పొందినప్పటికీ కొన్ని సంవత్సరాలలో పెట్టుబడులు పెరగడం దిగుబడి తగ్గడం నేల సేద్యానికి పనికి రాకుండా పోవడం గమనించి తన తాత ముత్తాతలు అవలంబించిన రసాయన రహిత వ్యవసాయ పద్ధతులను అవలంభించడం మొదలు పెట్టాడు. సేంద్రియ వ్యవసాయం చేస్తే దిగుబడి ఎక్కువ రాదని అందరూ నిరుత్సాహ పరిచినప్పటికి, రసాయనాలు వాడి అధిక దిగుబడి పొందమని సలహాలు ఇచ్చినప్పటికీ అందరినీ ఒప్పించి వారిని ఈ సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా చేశాడు.
పొన్నం మల్లయ్య ప్రకృతి వ్యవసాయం లో అవలంభించిన పద్ధతులు:
* పెరుగుదలకు పంచగవ్య మరియు జీవామృతం ను ఉపయోగించారు. ఉదాహరణకు పంచగవ్య అనగా ఆవు పేడ,మలం, పాలు, నెయ్యి మరియు పెరుగు యొక్క మిశ్రమం. ఇది కూరగాయలు పండ్ల యొక్క రుచిని, రంగును మరియు ఆకృతిని మెరుగుపరుస్తుంది. అదే విధంగా జీవామృతం అనగా 10కిలోల ఆవు పేడను 200 లీటర్ల నీటిలో పొడి బెల్లం మరియు శనగపిండి కలిపి రెండు రోజులు పులియబెట్టిన వచ్చు మిశ్రమం.
*పశుశాలల నుండి పశువుల పేడ, మలాన్ని సేకరించి జీవ ఎరువులుగా, వెర్మి కంపోస్ట్ గా తయారు చేసి పంటలకు ఉపయోగించారు. ఈ కంపోస్ట్ ని వాడడం వల్ల పంటకు తెగుళ్లను తట్టుకునే శక్తి పెరుగుతుంది. అందువల్ల క్రిమి సంహారక మందులకు అయ్యే ఖర్చు తగ్గుతుంది. కంపోస్ట్ వాడితే పంటకు నీరు తక్కువ పట్టి నీరు ఆదా అవుతుంది.
*ఎండు గడ్డి,ఎండు ఆకులు,కలుపు మొక్కలు,వివిధ నూర్చిన తర్వాత వచ్చిన వ్యర్థాలు, తంగేడు,కానుగ, దిరిశెన, వావిలి మొదలైన మొక్కల ఆకులు,పశువుల పేడ, గొర్రెల, కోళ్ల పెంట మలం మొదలైన వాటి నుండి కంపోస్ట్ ఎరువులు తయారు చేసి వాడుకున్నారు.
పొన్నం మల్లయ్య గారి గొప్పతనాన్ని గుర్తించి వ్యవసాయం లో తనకు ఉన్న అనుభవాలని పంచుకోవడానికి అమెరికా, ఆస్ట్రేలియా మరియు శ్రీలంక వంటి దేశాల నుండి ఆహ్వానం లభించింది. 2016వ సంవత్సరంలో ఎనబావి గ్రామానికి సంపూర్ణ సేంద్రియ మరియు రసాయన రహిత గ్రామంగా గుర్తింపు లభించింది. ఈనాడు ఎనబావి ఒక ఆదర్శ గ్రామం మరియు ఒక జ్ఞాన కేంద్రం. దేశం లోని నలుమూలల నుండి తోటి రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఎనబావి గ్రామాన్ని సందర్శించి జ్ఞానాన్ని పొందుతున్నారు.
Share your comments