మన భారతీయ వంటలలో పసుపుకి ఎంతో ప్రాధాన్యత ఉంది. వంటలలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాలలో ఒకటైన పసుపును ఆహారంలో ఉపయోగించడం వల్ల ఆహారానికి రుచిని వాసనను ఇవ్వటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది అనే విషయం మనకు తెలిసిందే. పసుపు ఔషధగుణాల సమ్మేళనం అని మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పసుపు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తున్నారు.
పసుపులో కర్క్యుమిన్ అనే పదార్థం దాగి ఉంటుంది. ఈ పదార్థం మన శరీరంలో వివిధ అనారోగ్య సమస్యల నుంచి మనల్ని రక్షిస్తుంది. ముఖ్యంగా పసుపులో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. అందుకోసమే బ్యాక్టీరియా వైరస్ల ద్వారా వ్యాపించే వ్యాధులను అరికట్టడానికి పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మన శరీరానికి ఏవైనా గాయాలు తగిలితే గాయాలను మాన్పించడంలో పసుపు ముందు వరుసలో ఉంటుంది.
పసుపులో ఎన్నో ఔషధగుణాలు దాగి ఉన్నాయి కదా అని పసుపును మితిమీరి తీసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. మోతాదుకు మించి పసుపు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ముఖ్యంగా పసుపును అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరం ఐరన్ శాతాన్ని కోల్పోతుంది. ఐరన్ మన రక్తంలోని హిమోగ్లోబిన్ తయారీకి ఉపయోగపడుతుంది.
పసుపును అధికంగా తీసుకోవడం వల్ల పసుపులో స్టోయికియోట్రిక్ అనే గుణం ఉంటుంది. దీనివలన మన శరీరం ఐరన్ ను కోల్పోతుంది. ప్రతిరోజు మనం మన ఆహారంలో భాగంగా పసుపును 2000 నుంచి 2500 మిల్లీ గ్రాముల మాత్రమే తీసుకోవాలని ఈ మోతాదుకు మించితే సమస్యలు మనల్ని చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతకన్నా ఎక్కువ పరిమాణంలో పసుపు తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సమస్యలు, అధిక తల నొప్పి, చర్మంపై దద్దుర్లు ఏర్పడటం, కడుపులో మంట, మరి కొందరిలో కాలేయం, పెద్ద ప్రేగు క్యాన్సర్లు వచ్చే పరిస్థితులు కూడా ఎదురవుతాయి.
పసుపులో దాగి ఉన్న కర్క్యుమిన్ మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. అయితే రక్త సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఈ పదార్థాన్ని అధికంగా తీసుకోకూడదు. కనుక ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్న పసుపుని కూడా పరిమితికి మించి తీసుకోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Share your comments