Agripedia

ఖరీఫ్ కంది సాగులో పాటించవలసిన యాజమాన్య పద్దతులు....

KJ Staff
KJ Staff

మన తరచూ తినే పప్పు ధాన్యాల్లో కంది ప్రధానమైనది. అంతేకాకుండా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కందిని అధిక విస్తీరణంలో సాగు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్లో 2.80 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా, తెలంగాణాలో 2.86 లక్షల ఎకరాల్లో రైతులు కంది సాగు చేపడుతున్నారు. సాధారణంగా కందిని వర్షాధార పంటగా సాగు చేస్తారు, కాబట్టి ఖరీఫ్ సీసన్ కంది సాగుకు అనుకూలంగా చెప్పవచ్చు. దీనికి తగ్గట్టుగానే ఎంతో మంది రైతులు ఖరీఫే సీసన్ పంటను ప్రారంభించారు. కందిని జులై నుండి ఆగష్టు రెండొవ వారం వరకు విత్తుకునేందుకు అనుకూలంగా ఉంటుంది.

కంది సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే, సమగ్ర యాజమాన్య పద్దతులు పాటించడం తప్పనిసరి. ఖరీఫ్ సీసన్లో కంది సాగుకు చీడపీడలు ప్రధాన ప్రతిబంధకాలుగా నిలుస్తాయి, వీటిని సంగ్రవంతంగా నియంత్రిస్తే కంది సాగులో మంచి లాభాలు ఆర్జించవచ్చు. కొన్ని ప్రాంతాల్లో కందిని ఏకపంటగా సాగు చేస్తే మరికొన్ని ప్రాంతాల్లో అంతరపంటగా కూడా సాగు చేస్తారు. కందిని సాగు చెయ్యడం ద్వారా భూమిలోని నత్రజని శాతం పెరిగి, పంట ఎదుగుదలకు దోహదపడుతుంది. కందిని అంతర పంటగా సాగు చేస్తే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.

కందిని ఖరీఫ్ పంటగా సాగు చేసేందుకు జూన్ 15 నుండి, జులై రెండోవ వారం వరకు విత్తుకునే అవకాశం ఉంటుంది.ఒకవేళ వర్షాలు ఆలస్యమైతే ఆగష్టు రెండో వారం వరకు విత్తుకోవడానికి వీలుంటుంది, ఇంతకన్నా ఆలస్యమైతే వాతావరణ పరిస్థితులు అనుకూలించవు. కందిని ఏకపంటగా సాగు చేస్తే ఒక ఎకరానికి 6-7 కిలోల విత్తనం సరిపోతుంది, అంతరపంటగా సాగు చెయ్యాలనుకుంటే 2-3 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనాలు నాటేముందు విత్తనశుద్ధి తప్పనిసరి. రైజోబియం బాక్టీరియాతో శుద్ధి చెయ్యాలి. కంది సాగుకు దాదాపు అన్ని రకాల నేలలు అనుకూలం, నీరు నిల్వవుండే నేలలు మరియు చౌడు నేలలు సాగుకు పనికిరావు.

విత్తనాలు విత్తుకునేందుకు బోదె మరియు సాలు పద్దతులు అనుకూలం, ఈ పద్దతి ద్వారా నీటిని మరియు కలుపును సమగ్రవంతంగా నివారించవచ్చు. మొక్క ఎదిగే సమయంలో కలుపు ఆటంకం కలిగించకుండా ఉండేందుకు, విత్తనాలు నాటిన 36 గంటల్లోపు, 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్, 200 లీటర్ల నీటికి కలిపి, పొలం మొత్తం పిచికారీ చెయ్యాలి. అంతేకాకుండా విత్తిన 30-55 రోజుల మధ్యలో నాగలితో అంతకృషి చేపడితే కలుపును నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది. మంచి దిగుబడులు సాధించడంలో ఎరువుల యాజమాన్యం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఖరీఫ్ సీసన్ కంది సాగుకి సమగ్ర ఎరువుల యాజమాన్యం పాటించవలసి ఉంటుంది. హైబ్రిడ్ రకాలను సాగు చేసేవారు, తప్పకుండ ఎక్కువమొత్తంలో ఎరువులను అందించాలి. మొదటిగా విత్తనాలు నాటేముందు ఒక ఎకరానికి 2 టన్నుల పశువుల ఎరువును వేసి, పొలం మొత్తం కలియదున్నాలి. విత్తనాలు నాటిన తరవత, 8 కిలోల నత్రజన, 20-25 కిలోల భాస్వరం, మరియు 10-15 కిలోల పోటాష్ ఎరువులను అందించాలి. కంది వర్షాధారంగా కూడా పెరుగుతుంది, అయితే నీటి లబ్యత ఉన్నవారు, మొక్క ఎదిగే సమయంలో ఒకసారి మరియు పూత, పిందె కట్టే సమయంలో ఒకసారి నీటిని ఇవ్వడం ద్వారా మొక్కలు బాగా ఎదిగి అధిక దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది.

కంది పంటను అనేక రకాలైన పురుగులు ఆశించి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తాయి, వీటిలో కాయతొలుచు పురుగు ప్రధానంగా కనిపించే సమస్య. ఈ పురుగులు పిందెలు మరియు కాయల మీద చేరి, వాటిని తింటూ నష్టం కలిగిస్తాయి. కాయతొలుచు పురుగును సంగ్రయజమాన్య పద్దతుల ద్వారా నివారించవచ్చు. పొలాల్లో విత్తుకునే ముందు పొలం మొత్తం వేప పిండిన చల్లాలి, దీని వలన మట్టిలో పురుగులు మరియు వాటి గుడ్లు చనిపోతాయి. మొక్కలు పూతపూసే దశలో ఉన్నపుడు, వేప నూనెను నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. పొలం మొత్తం లింగాకర్షక బుట్టలను అమర్చడం ద్వారా వీటిని ఉదృతిని గమనించవచ్చు. పురుగుల బెడద ఎక్కువగా ఉంటే , క్లోరోపైరీఫోస్ మందును 2.5 మి.లి ఒక లీటర్ నీటికి కలిపి పొలం మొత్తం పిచికారీ చెయ్యాలి, దీనితోపాటు ఎసిఫేట్ 1.5 గ్రాముల మందును ఒక లీటర్ నీటికి కలిపి దీనిని కూడా పిచికారీ చెయ్యవచ్చు.

పురుగులతో పాటు ఎండు తెగులు మరియు వెర్రి తెగులు వంటివి, కందిని ప్రధానంగా పట్టి పీడించే సమస్యలు వీటికి సమగ్రయజమాన్య పద్దతులు అవసరం. ఈ తెగుళ్లను నివారించడానికి కార్బెన్డిజిమ్ లేదా మ్యాంకోజెబ్ 3 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి, పిచికారీ చెయ్యాలి.
కాయలు ఎండిన తరువాత మాత్రమే పంట కోత చేపట్టాలి, పూత రెండు నెలల వరకు పూస్తుంది కాబట్టి, కాయలు ఎండిన తరువాత కోసి, వాటిని కట్టెలతో కొట్టడం ద్వారా గింజలు వేరవుతాయి. ప్రస్తుతం కాయలు కోసి వాటి నుండి గింజలు వేరు చేసేందుకు యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ గింజలు శుభ్రం చేసి, వాటిని బాగా ఎండబెట్టితే తరువాత మాత్రమే నిల్వచేయాలి. అన్ని యాజమాన్య పద్దతులను సమగ్రవంతంగా పాటిస్తే ఒక ఎకరానికి 8-10 క్వింటాల్లా దిగుబడి వస్తుంది.

Share your comments

Subscribe Magazine