సాధారణ బోదె పద్దతికి స్వస్తి చెప్పి, ప్రస్తుతం ఎంతో మంది రైతులు మెట్ట సాగుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. మెట్ట సాగు కూరగాయలు, ఆకుకూరలు, దుంపలు మరియు పూల సాగుకి అనుకూలంగా ఉంటుంది. మెట్ట సాగు చెయ్యడం ద్వారా మొక్కల్లో ప్రధానంగా వేరు కుళ్ళు తెగులును సమగ్రవంతంగా నివారించవచ్చు. దీనితోపాటు అధిక వర్షాల సమయంలో పంట ముప్పును కూడా తగ్గించవచ్చు. అంతే కాకుండా మెట్ట పంటల సాగులో నీటి వృధా కూడా తగ్గుతుంది. అయితే మెట్టపంటలు సాగు చేసే రైతులు మల్చింగ్ పద్దతిని కూడా వినియోగిస్తే పంట దిగుబడి పెరుగుతుందని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ మల్చింగ్ లేదా ఆర్గానిక్ మల్చింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మెట్టసాగులో ఎతైన బెడ్ల మీద మొక్కలను పెంచుతారు. ప్లాస్టిక్ మల్చింగ్ విధానంలో బెడ్ల మీద ప్లాస్టిక్ కవర్ తో కప్పి ఉంచుతారు. ఈ కవర్ మొక్క చుట్టూ ఉండటం వలన భూమిలోని నీరు ఆవిరి కాదు. నీటి లభ్యత తక్కువుగా ఉండి అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతంలో ఈ ప్లాస్టిక్ మల్చింగ్ బాగా ఉపయోగపడుతుంది. అయితే ప్లాస్టిక్ మల్చింగ్ పద్దతి పాటిస్తున్న రైతులు డ్రిప్ పద్దతిని తప్పకుండ పాటించవలసి ఉంటుంది, లేకుంటే మొక్కలకు సాగు నీటిని అందించడం కష్టతరంగా మారుతుంది.
ప్లాస్టిక్ మల్చింగ్ వలన మరొక్క వినియోగం ఏమిటంటే, కలుపు మొక్కల నివారణ. ఈ షీట్ అడుగుభాగం వచ్చే కలుపు మొక్కలకు సూర్య రష్మీ అందదు, దీనిమూలంగా కిరణజన్య సంయోగ క్రియ జరగక కలుపు మొక్కలు వచ్చేందుకు ఆస్కారం ఉండదు. అంతేకాకుండా వర్షపు నీరు నేరుగా మట్టి మీద పడదు కాబట్టి మట్టి నష్టాన్ని కూడా తగ్గించవచ్చు. మల్చింగ్ చేసిన పొలంలో పంటకాలం పూర్తయిన తర్వాత తిరిగి తిరిగి మళ్ళి మట్టిని దున్నే అవసరం ఉండదు, పాత మొక్కలను తీసేసి వాటి స్థానంలో కొత్త మొక్కలను నాటుకోవచ్చు. దీని వలన రైతులకు శ్రమ భారం తగ్గుతుంది. మల్చింగ్ పద్దతిలో సాగు చేసిన పంటల ద్వారా ఎక్కువ దిగుబడి మరియు నాణ్యమైన దిగుబడి వస్తుందని, రైతుల ఆదాయం కూడా పెరుగుతుందని రైతులు కూడా చెబుతున్నారు.
ప్లాస్టిక్ మల్చింగ్ లాగానే ఆర్గానిక్ మల్చింగ్ కూడా. కాకపోతే ఆర్గానిక్ మల్చింగ్ లో వరి లేదా గోధుమ గడ్డిని మల్చింగ్ కోసం వాడతారు. ప్లాస్టిక్ మల్చింగ్ లాగానే ఆర్గానిక్ మల్చింగ్ లో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి, అయితే ఆర్గానిక్ మల్చింగ్ భూమిలో కలిసి మొక్కలకు పోషకాలు అందిడంలో ఉపయోగపడుతుంది, సహజసిధమైన మల్చింగ్ కాబట్టి పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు. ఆర్గానిక్ మల్చింగ్ చేసే రైతులు, మల్చింగ్ మొక్కల అవశేషాల్లో ఏమైనా చీడపీడలు ఉన్నాయా అన్నది చూసుకోవాలి లేదంటే పంటకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది.
Share your comments