పొగాకు సాగుకు ప్రతికూల పరిస్థితులు అధికంగా ఉంటాయి. చీడపీడలు బెడద అధికంగా ఉంటుంది. దీంతో పంటకు అనేక రకాల తెగుళ్లు సోకుతాయి. దీని కారణంగా పంటపై ప్రభావం పడి... దిగుబడి తగ్గిపోతుంది. అందుకే పొగాకు సాగు చేసే రైతులు.. చీడపీడల నివారణ, తెగుళ్లు రాకుండా ఉండటం కోసం విపరీతంగా మందులను వాడుతుంటారు. దీని వల్ల పొగాకు పంటల్లో అధిక మొత్తంలో క్రిమి సంహారకాల అవశేషాలు చేరుతాయి. ఈ ప్రభావం పంటను మార్కెట్ కు తరలించినప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే అధిక మొత్తంలో రసాయనాలు వాడటం వల్ల పొగాకులో వాటి అవశేషాల శాతం పెరుగుతుంది. దీని కారణంగా పంట రేటు తక్కువగా పలుకుతుంది. రసాయనాల అవశేషాలు మోతాదుకు మించితే.. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్ముకోవడానికి వీలు పడదు. ఎగుమతి చేయడం విషయంలో ఆంక్షలు సైతం ఎదుర్కొనవచ్చు. కాబట్టి రైతులు పొగాకు సాగుకు సంబంధించి పలు రకాల రసాయన మందులను వాడకూడదని వ్యవసాయ నిపుణులు, పరిశోధకులు చెబుతున్నారు. వారు వెల్లడించిన వివరాల ప్రకారం..
సహజ ఎరువులను ఉపయోగించి పొగాకు సాగు చేయడం వల్ల పంటకు మార్కెట్ లో రికార్డు ధర లభిస్తుంది. ఈ సాగుకు సంబంధించి ప్రభుత్వాలు రైతుల కోసం వివిధ వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో శిక్షణ తరగతులను సైతం నిర్వహిస్తోంది. సేంద్రీయ ఎరువుల వాడకంతోటి పంట సాగుపై అవగాహన కల్పిస్తోంది. మందుల వాడకానికి సంబంధించి.. పొగాకు పంటల్లో సహజంగా తయారు చేసుకున్న సేంద్రీయ క్రిమి సంహారకాలు, మేపమందులు, వేప నూనేలు, కానుగ పిండిలతో పాటు ఎన్ పీ వీ ద్రావడం, ఇమామెక్టిన్ బెంజోయెట్ (ప్రొక్లెయిమ్), థయామిథాక్సామ్ (ఆక్టారా), ఇమిడాక్లోప్రిడ్(కాన్ఫిడార్), ఫ్లూబెండమైడ్ (ఫేమ్) వంటి మందులను వాడుకోవాలి.
అయితే, కొన్ని రకాల మందులను వాడటం వల్ల పొగాకులో వాటి అవశేషాలు అలాగే ఉండిపోతాయి. దీంతో మార్కెట్ లో ఆ పంటకు రేటు తక్కువగా వస్తుంది. కాబట్టి అలాంటి రసాయన మందులను వాడకూడదని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. పొగాకు సాగులో వాడకూడని కీటక నాషకాలు, చీడపీడల నివారణ మందుల జాబితాలో మోనోక్రోటోఫాస్, క్వినాల్ ఫాస్, ఎండోసల్ఫాన్, ఫెన్ వలరేట్లిన్ , పొడి మందులు, ప్రోఫినోఫాస్, ఎసిఫేట్, క్లోరోఫైరీఫాస్ వంటివి ఉన్నాయి. పొగాకు సాగులో వీలైనంత తక్కువలో మందులు వాడటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు.
Share your comments