ప్రస్తుత కాలంలో చాలా మంది వారి ఇంటి అవసరాలకు సరిపడా కూరగాయలను ఇంటి గార్డెన్ లో సేంద్రియ పద్ధతులను ఉపయోగించి పెంచుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది.ఈ క్రమంలోనే చాలామంది ఈ విధమైనటువంటి సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను అవలంభిస్తుంటారు.ముఖ్యంగా ఈ కరోనా మహమ్మారి సమయంలో చాలామంది ఇంటికే పరిమితం కావడం వల్ల ఇలాంటి కూరగాయలను సాగు చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. అయితే ఇప్పటి వరకు వివిధ రకాల కూరగాయలను మన ఇంటి ఆవరణంలోని పెంపొందించుకోవడం చూసాము. తాజాగా వెల్లుల్లిని కూడా ఇంటిలో సాగు చేసుకోవచ్చని పుణేకు చెందిన అభిజిత్ టికేకర్ అనే ఇంటిపంటల సాగుదారుడు చెబుతున్నారు.
ఒక చిన్న ప్లాస్టిక్ బాటిల్ ద్వారా ఇంటిలోనే వెల్లుల్లి ఏ విధంగా సాగు చేసుకోవచ్చు వివరించారు. ఈ క్రమంలోనే అభిజిత్ మాట్లాడుతూ..ఒక ప్లాస్టిక్ బాటిల్‌కు నిలువెల్లా కంతలు పెట్టి ఎంచక్కా వెల్లుల్లిపాయలను పెంచుకోవచ్చని తెలిపారు. ఒక కంపెనీలో సెక్రటరీగా పని చేస్తున్న అభిజిత్ లాక్ డౌన్ సమయంలో తన ఇంటి టెర్రస్ పై పడిన ఎండిన ఆకుల ద్వారా కంపోస్ట్ తయారు చేసుకొని కిచెన్ గార్డెన్ ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెల్లుల్లిపాయలను కూడా ఒక ప్లాస్టిక్ బాటిల్ ద్వారా ఇంటిలోనే సాగు చేశారు.
వెల్లుల్లిపాయలను సాగు చేయడానికి ఒక ప్లాస్టిక్ బాటిల్ లో మట్టి లీఫ్ కంపోస్ట్, కొబ్బరి పొట్టును కలిపిన మిశ్రమాన్ని నింపుకోవాలి. మన చూపుడు వేలు పట్టే అంత చుట్టుకొలత ఉన్న ఇనుప చువ్వను తీసుకొని స్టౌ పై మంట పెట్టి బాగా వేడైన తర్వాత ప్లాస్టిక్ బాటిల్ చుట్టూ ఒక్కో అంగుళం దూరంలో బెజ్జాలు పెట్టుకోవాలి. ఈ బెజ్జాలులు వెల్లుల్లి ముక్కలు బయటకు ఉండే విధంగా నాటుకోవాలి.
ఈ విధంగా వెల్లుల్లి రెబ్బలు నాటిన తర్వాత సీసాలోని మట్టిలో తేమ శాతం పోకుండా చూసుకోవాలి. అలాగే తగినంత నీటిని కూడా అందిస్తూ ఉండాలి. కొన్ని రోజులకు ఈ వెల్లుల్లి రెబ్బలు వేరుపోసుకొని మొలకలు వస్తాయి. ఉల్లి పొరకల మాదిరిగా వెల్లుల్లి మొక్కలు వస్తాయి. ఈ పొరకలతో మనం వివిధ రకాల చట్నీలు తయారుచేసుకోవచ్చని అభిజిత్ వివరించారు
Share your comments