Agripedia

పచ్చిరొట్ట పైర్లు సాగుచేయ్యండి.... భూసారాన్ని పెంచండి....

KJ Staff
KJ Staff

రోజురోజుకు పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం ద్వారా భూమిలోని సారం తగ్గి, మట్టి జీవాన్ని కోల్పోతుంది. ఎక్కువ దిగుబడి ఆశించాలనుకున్న రైతులు, విచక్షణ రహితంగా ఎరువులను వాడుతూ మట్టికి ఎంతో హాని తలపెడుతున్నారు. మట్టిలోని సారాన్ని పెంచి మట్టికి పునర్జీవం పోసేందుకు సేంద్రియ ఎరువులు ఎంతగానో తోడ్పడతాయి. ఈ సేంద్రియ ఎరువుల్లో పేచ్చిరొట్ట ఎరువులు కూడా ఒకటి. పొలంలో పంట సాగుచెయ్యని సమయంలో పచ్చిరొట్ట ఎరువులను సాగుచెయ్యాలి. పచ్చిరొట్ట మొక్కలు తక్కువకాల వ్యవధిలోనే ఎదిగి మొక్కలకు అవసరమైన పోషకాలను అందించగలవు.

నేల యొక్క సారం పెంచే పచ్చిరొట్ట ఎరువులు ఎన్నో అందుబాటులో ఉన్నాయి, వాటిలో జిలుగు, జనుము, పిల్లి పేసర్లు, అలసంద వంటి ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ మొక్కలను పెంచి లేత పూత దశలో ఉన్నపుడు పొలంలో కలియదున్నుకోవాలి. ఈ మొక్కలు మట్టిలో కలవడం ద్వారా మట్టిలో కార్బన్ శాతం పెరుగుతుంది, అంతేకాకుండా పంట ఎదుగుదలకు కావాల్సిన, నత్రజని, భాస్పరం మరియు పోటాష్ వంటి పోషకాలు కూడా మట్టిలో నిక్షిప్తమవుతాయి.

పచ్చిరొట్ట ఎరువులు అన్నిటిలోకెల్లా జనుమును విస్తృతంగా సాగుచేస్తారు. దీనిని అన్నిరకాల నేలల్లో సాగుచేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఒక ఎకరానికి 12 నుండి 15 కిలోల విత్తనం అవసరం ఉంటుంది. వెదజల్లే పద్దతి ద్వారా విత్తనాన్ని పొలంలో చల్లుకోవాలి. ఒక ఎకరానికి ఆరు టన్నుల వరకు దిగుబడి లభిస్తుంది. ఒక టన్ను జనుము పచ్చిరొట్టలో 4 కిలోల నత్రజని మరియు ఇతర పోషకాలు ఉంటాయి. అంతేకాకుండా ఈ జనుము మొక్కలను పశువులకు మేతగా కూడా వినియోగించవచ్చు.

రసాయన ఎరువుల అధిక వినియోగం కారణంగా, దేశంలో చౌడు నేలలు మరియు క్షార నేలలు ఎక్కువైపోతున్నాయి. ఇటువంటి భూములని సరిచేయడానికి వీటిలో జిలుగును పచ్చిరొట్ట ఎరువుగా వాడుకోవచ్చు. వరి పండించే భూముల్లో కూడా జీలుగను పెంచవచ్చు, ఒక ఎకరానికి 12 కిలోల జిలుగు విత్తనం అవసరమవుతుంది. ఎకరానికి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది, మొక్కలు పూత దశలో ఉన్నపుడు పొలంలో కలియదున్నవలసి ఉంటుంది. ఒకటన్ను జీలుగ నుండి 5 కేజీల వరకు నత్రజని లభిస్తుంది. పచ్చిరొట్ట ఎరువులను వాడటం వలన భూమిలో సారం పెరగడమే కాకుండా, భూమి గుల్లగా తయారవుతుంది, దీని వలన వర్షపు నీరు భూమిలోకి ఇంకి మొక్కల అవసరాలకు ఉపయోగపడుతుంది. పచ్చిరొట్ట ఎరువులు మట్టిలో కర్బన శాతాన్ని పెంచి మట్టికి జీవం పోస్తుంది, మట్టిలో జీవం పెరగడానికి పచ్చిరొట్ట ఎరువులు సహాయపడతయి. పచ్చిరొట్ట మొక్కల వేర్లు భూమి లోపలి వరకు వెళ్లి పోషకాలను బయటకు తీసుకువచ్చి మొక్కలకు అందిస్తాయి.

Share your comments

Subscribe Magazine