Agripedia

గులాబీ సాగ... రైతుల ఆదాయానికి బహుబాగు....

KJ Staff
KJ Staff

పూల సాగు ఎప్పుడూ లాభదాయకమే. పండగలు మరియు పూజల సమయంలో పూల ధరలకు రెక్కలొస్తాయి. జులై నెల వచ్చిందట ఇంక వరుసగా పండుగలు వస్తూనే ఉంటాయి. ఖరీఫ్ పంటగా పూలు సాగు చేద్దాం అనుకున్న రైతులకు ఇది ఒక మంచి కాలం. మిగిలిన పంటలతో పోలిస్తే పూలను సాగు చెయ్యడం కొంచెం సులభతరమనే చెప్పవచ్చు. అయితే పూల సాగు చేపడడం అనుకునే రైతులకు గులాబీ సాగు లాభదాయకం. గులాబీలో ఎన్నో రకాల అందుబాటులో ఉన్నాయి. మార్కెట్ డిమాండ్ అనుసరించి రైతులు గులాబీ పూలు సాగు చేపడితే మంచి లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది.

పూలలో గులాబీని రాణిగా పరిగణిస్తారు. ఫంక్షన్లు, పూజలు ఇలా ఏ విధమైన సందర్భమైన సరే గులాబీ పూలు లేకుండా సాధ్యపడదు. అన్ని కాలాల్లోనూ గులాబీకి మంచి డీమాండ్ ఉంటుంది. గులాబీని కేవలం దేశీయ మార్కెట్లలోనే కాకుండా విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చెయ్యవచ్చు. ఏ- గ్రేడ్ గులాబీ పూలకు విదేశీ మార్కెట్లలో అధిక ధర లభిస్తుంది. ఈ విధంగా రైతులు ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చు. అయితే దిగుబడి మరియు నాణ్యత బాగుండాలంటే సరైన వాతావరణం ఉండాలి, కాబట్టి గులాబీ సాగు చేసే రైతులు మార్కెట్ డిమాండ్ తో పాటు, అనువైన వాతావరణం ఉందొ లేదో చూసుకోవాలి. గులాబీని ఆరుబయట పొలాలతోపాటు, పోలీ హౌసుల్లోను సులభంగా సాగు చెయ్యవచ్చు. పోలీ హౌస్ లో సాగు చేస్తే రేటింపు దిగుబడి పొందడంతో పాటు, నాణ్యమైన దిగుబడిని కూడా పొందే అవకాశం ఉంటుంది.

గులాబీని కేవలం పూజలకు కాకుండా, వాణిజ్య పరమైన ఉపయోగాలు కూడా ఉన్నాయి. వీటిని పర్ఫ్యూమ్, బ్యూటీ ప్రొడక్ట్లు, రోజ్ వాటర్ తయారీలోనూ వినియోగిస్తారు. గులాబీలు ఎన్నో రకాల రంగుల్లో అందుబాటులో ఉన్నాయి, వీటిలో, పింక్, ఎరుపు, పసుపు, తెలుపు, రంగులను మన దేశంలో ఎక్కువుగా సాగు చేస్తారు. రైతులు అన్ని రకాల రంగుల గులాబీలను సాగు చెయ్యడం ద్వారా మెరుగైన లాభాలను పొందవచ్చు. గులాబీ సాగుకు దాదాపు అన్ని నేలలు అనుకూలమే అయితే ఉప్పు నేలలు, మురుగు నీరు నిలువ ఉండే నేలలు గులాబీ సాగుకు అనుకూలించవు. అలాగే ఉష్ణోగ్రత 28-32 ℃ ఉంటే గులాబీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. వీటిని నాటుకునేందుకు ఇది మంచి సమయం. గులాబీని విత్తనాల గ్రాఫ్టింగ్ ద్వారా వృద్ధి చేసి, పొలంలో నాటుకుంటారు.

గులాబీ పంటను ఒక్కసారి మొదలుపెడితే దాదాపు 4 సంవత్సరాల వరకు నికర ఆదాయం అందిస్తుంది. మొక్కలు నాటిన 3 నెలల నుండి దిగుబడి రావడం ప్రారంభమవుతుంది. మిగిలిన పూల మొక్కలతో పోలిస్తే గులాబీలో చీడపీడల బెడద తక్కువుగా ఉంటుంది. మొక్కకు అవసరమైన పోషకాలు, NPK మిశ్రమం మరియు సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని సమయానుసరంగా ఇవ్వాలి. నాణ్యమైన దిగుబడి పొందడానికి సరైన నీటి యాజమాన్యం తప్పనిసరి, మట్టిలోని తేమ శాతాన్ని బట్టి నీటిని అందించాలి. కూలీల అవసరం తక్కువుగా ఉండటం వలన రైతులకు పెట్టుబడి భారం తక్కువుగా ఉంటుంది. అన్ని యజమాన్య పద్ధతులు సరైన పద్డతిలో పాటిస్తే ఏడాది మొత్తం గులాబీ నుండి దిగుబడి పొందవచ్చు.

Share your comments

Subscribe Magazine