Agripedia

నల్ల బియ్యం ప్రయోజనాలు.

KJ Staff
KJ Staff
Black rice crop
Black rice crop

నల్ల బియ్యం.. సహజంగా తెల్లగా ఉండే బియ్యం రకాలను చూసి ఉంటాం. కానీ ఈ బియ్యం మాత్రం ఎంతో నల్లగా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇవి ఎక్కువగా పండిచరు. అందుకే వీటిని ఫర్ బిడ్డెన్ రైస్ లేదా ఎంపరర్స్ రైస్ (చక్రవర్తుల బియ్యం) అని పిలుస్తారు.

పూర్వ కాలంలో ఈ బియ్యం కేవలం చక్రవర్తులు వారి కుటుంబ సభ్యులు మాత్రమే తినడానికి కేటాయించేవారు. ఇంకెవరూ దీన్ని తినకూడదని నియమం ఉండేది. దీన్ని తినడం వల్ల వారి ఆరోగ్యం బాగుండి.. ఎక్కువ కాలం జీవిస్తారని వారు నమ్మేవారట.

నల్ల బియ్యం ఎక్కడ పుట్టింది అన్న విషయంలో ఇప్పటికీ పక్కా ఆధారాలు లేవు. మన దేశంలో మణిపూర్ లో ఈ బియ్యాన్ని ఎక్కువగా పండిస్తారు. అక్కడ ఈ బియ్యాన్ని చకావో అముబి అని పిలుస్తారు. మణిపురీ భాషలో చకావో అంటే నోరూరించేది అని అర్థం. అముబి అంటే నల్లనిది అని అర్థం. నల్లగా, నోరూరించే రుచితో ఉండే బియ్యం కాబట్టి దీనికి ఆ పేరును పెట్టారు.

నల్ల బియ్యంలోని రకాలు

1. బ్లాక్ జపనికా రైస్

నలుపు రంగు పొట్టి ధాన్యాన్ని, మయోగనీ మీడియం గ్రెయిన్ రైస్ ని కలిపి పండించినప్పుడు ఈ తరహా బియ్యం పండుతాయి. దీని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మట్టి వాసనతో తీపి, కారం కలిపిన రుచితో ఉంటాయి.

2. బ్లాక్ గ్లుటినస్ రైస్

వీటిని బ్లాక్ స్టికీ రైస్ అని కూడా పిలుస్తారు. ఇవి నల్లని రంగులో పొట్టిగా బంకగా కనిపిస్తాయి. ఒక రకమైన తీపి ఫ్లేవర్ ని అందిస్తాయి. ఈ ధాన్యంలో అన్ని గింజల రంగు ఒకేలా ఉండదు. ఆసియా దేశాలలో ప్రధానంగా వీటిని స్వీట్ డిషెస్ చేయడానికి ఉపయోగిస్తారు.

3. ఇటాలియన్ బ్లాక్ రైస్

చైనీస్ బ్లాక్ రైస్, ఇటాలియన లాంగ్ గ్రెయిన్ రైస్ కలిపి తయారుచేసిన వెరైటీ ఇది. ఈ బియ్యం పొడుగ్గా చూసేందుకు చాలా బాగుంటాయి. మంచి బటరీ రుచిని కలిగి ఉంటాయి.

4. థాయ్ బ్లాక్ జాస్మిన్ రైస్

ఇవి అటు పొట్టి, ఇటు పొడుగు కాకుండా మధ్యస్థంగా ఉంటాయి. చైనీస్ బ్లాక్ రైస్ ని జాస్మిన్ రైస్ ని కలిపి తయారుచేసిన వెరైటీ ఇది. ఇందులో జాస్మిన్ రైస్ కి ఉన్నట్లు మంచి ఫ్లోరల్ వాసన కూడా ఉంటుంది.

వీటితో పాటు మన దేశంలో మణిపురీ బ్లాక్ రైస్, కాలా నమక్, కాలా భాత్ రకాలకు చెందిన నల్ల బియ్యాన్ని కూడా పండిస్తారు. నల్ల బియ్యం మిగిలిన అన్ని రకాల బియ్యంతో పోల్చితే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. అందుకే దీన్ని అందరూ సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. పాలిష్ చేసిన తెల్ల బియ్యంలో ప్రతి వంద గ్రాముల బియ్యానికి 6.8 గ్రాముల ప్రొటీన్, 1.2 గ్రాముల ఐరన్, 0.6 గ్రాముల ఫైబర్ ఉంటుంది. బ్రౌన్ రైస్ లో 7.9 గ్రాముల ప్రొటీన్, 2.2 గ్రాముల ఐరన్, 2.8 గ్రాముల ఫైబర్ ఉంటాయి. ఇక రెడ్ రైస్ లో 7.0 గ్రాముల ప్రొటీన్, 5.5 గ్రాముల ఐరన్, 2.0 గ్రాముల ఫైబర్ ఉంటాయి. నల్ల బియ్యంలో వీటన్నింటి కంటే ఎక్కువగా 8.5 గ్రాముల ప్రొటీన్, 3.5 గ్రాముల ఐరన్, 4.9 గ్రాముల ఫైబర్ ఉంటాయి. నల్లబియ్యంలో 18 రకాల అమైనో యాసిడ్లు, కాపర్, కెరోటిన్ వంటి ఎన్నో అత్యావశ్యక పోషకాలు ఉంటాయి. ఇందులో పోషకాలు అత్యధికంగా ఉండడం వల్లే దీన్ని సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. అందులో యాంథో సైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవే బ్లాక్ రైస్ కి ఆ రంగును అందిస్తాయి. మామూలు పంటల్లా దీనికి చీడ పీడల బాధ చాలా తక్కువ. కేవలం వంద రోజుల్లో పంట దిగుబడి చేతికి వస్తుంది. ఈ పంట సాగు వల్ల భూసారం కూడా దెబ్బతినదు.

Black Rice
Black Rice

నల్ల బియ్యం ప్రయోజనాలు

* నల్ల బియ్యం లో ఫైబర్, విటమిన్ ఇ, నియాసిన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఇనుము, జింక్ వంటివి ఎక్కువగా ఉంటాయి.

* నల్ల బియ్యం డయాబెటిస్ ని అదుపులో ఉంచుతుంది. శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ ని ఇది కంట్రోల్లో ఉంచుతుంది.

* ఈ బియ్యంలో ఫైబర్ ఎక్కువగా, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ఒబేసిటీ సమస్యను కూడా తగ్గిస్తాయి. దీన్ని మామూలు బియ్యానికి బదులు తినడం వల్ల బరువు వేగంగా తగ్గే వీలుంటుంది.

* నల్ల బియ్యంలో యాంథో సైనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి కంటి వ్యాధులను నయం చేస్తాయి.

* ఈ ఆంథో సైనిన్లు క్యాన్సర్ రాకుండా కాపాడతాయి. ముఖ్యంగా మహిళల్లో ఇవి క్యాన్సర్ నిరోధకాలుగా పనిచేస్తాయి.

* ఈ బియ్యం గంజిని తలకు పట్టిస్తే వెంట్రుకలు చాలా బలంగా పెరుగుతాయి. ముఖానికి మాస్క్ గా వేసుకుంటే మచ్చలు మొటిమలు తగ్గిపోతాయి.

* నరాల బలహీనత ఉన్నవారికి ఈ బియ్యాన్ని మసాజ్ చేసేందుకు కేరళ ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు.

* ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యాన్ని ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

* లివర్ డీటాక్సిఫికేషన్ లో కూడా ఈ బియ్యం తోడ్పడుతుంది.

* అధిక రక్త పోటు సమస్య నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుంది.

https://krishijagran.com/health-lifestyle/the-amazing-health-benefits-of-eating-black-rice/

https://krishijagran.com/featured/black-rice-the-new-super-food/

Share your comments

Subscribe Magazine