భారత దేశంలో దాదాపు 75 శాతం మంది ప్రజలు వ్యవసాయం దాని అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ రంగంలో అపారమైన అవకాశాలు కలిగి ఉన్నాయి. అయితే కూలీల సమస్య అధికంగా ఉండడంతో చాలా మంది రైతులు సాంప్రదాయ పంటల్ని సాగు చేస్తున్నారు. భారతదేశ గ్రామీణ జీవన విధానంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసుకొని వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుచుకోవడానికి కొన్ని
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను చేపట్టి అధిక లాభాలను పొందుతున్నారు.అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రోజుల్లో సకల పోషక విలువలు,ఔషధ గుణాలు సమృద్ధిగా ఉన్న పుట్టగొడుగులకు దేశవ్యాప్తంగా రోజురోజుకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.కావున రైతు సోదరులు, నిరుద్యోగ యువతీయువకులు తక్కువ పెట్టుబడి కొద్దిపాటి శ్రమతో పుట్టగొడుగుల పెంపకంను కుటీర పరిశ్రమగా ప్రారంభించి అద్భుత ఫలితాలను పొందవచ్చు.రోజుల్లో స్వచ్ఛమైన పాలకు డిమాండ్ ఉంది కావున గేదెలు, ఆవులతో స్థిరమైన ఆదాయాన్ని సంవత్సరం పొడవునా పొందడానికి పాడి పరిశ్రమ ప్రారంభించవచ్చు.
ఈ రోజుల్లో సేంద్రియ వ్యవసాయానికి ఆదరణ పెరుగుతోంది. కావున సేంద్రీయ ఎరువులను
తయారుచేసి మార్కెట్లో విక్రయించగలిగితే మంచి లాభాలను పొందవచ్చు. సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని తక్కువ పెట్టుబడితో ఇంటి దగ్గరే ప్రారంభించవచ్చు. మారుతున్న కాలానుగుణంగా దేశంలో ఆయుర్వేద వైద్యం పై ప్రజలకు మక్కువ పెరుగుతోంది. దాంతో ఆయుర్వేద వైద్యంలో వాడే ఔషధ మొక్కలకు మంచి డిమాండ్ ఏర్పడుతోంది. ఔషధ మొక్కలను సాగు చేస్తున్న రైతులకు ఇది మంచి అవకాశంగా చెప్పవచ్చు.చిన్న సన్నకారు రైతులు తమకున్న కొద్దిపాటి భూమిలో ఔషధ మొక్కల సాగును అధిక ఆదాయ మార్గంగా ఎన్నుకోవచ్చు.
Share your comments