Agripedia

అధిక దిగుబడినిచ్చే సాంబమసూరి వరి వంగడం.... ఎందుకంత ప్రత్యేకం....

KJ Staff
KJ Staff

వరిసాగులో దిగుబడి తగ్గి, రైతులంతా మంచి దిగుబడినిచ్చే వరి వంగడాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో సాంబ మసూరి రకం మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. సాంబ మసూరి సన్న బియ్యం ఇచ్చే వరి వంగడం. అధిక దిగుబడి ఇవ్వడంతోపాటు మంచి నాణ్యమైన దిగుబడి రావడం మూలాన అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సాంబ మసూరి రకం వెనకాల ఎంతోమంది శాస్త్రవేత్తల కృషి, మరియు శ్రమ దాగివున్నాయి. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి రైతుల ఆదాయం పెంచాలన్న ఉదేశ్యంతో ఈ రకాన్ని అభివృద్ధి చేసారు. సాంప్రదాయ వరి రకాలతో పోలిస్తే సాంబ మసూరి రకం ఎక్కువ దిగుబడిని ఇస్తుంది.

భారత దేశంలో హరిత విప్లవం తరువాత వ్యవసాయ ఉత్పాదకత ఎన్నో రేట్లు పెరిగింది. వ్యవసాయ ఉత్పాదకతను కాపాడుకోవడానికి, మెరుగైన యాజమాన్య పద్దతులు ఎంతైతే అవసరమో, కొత్త వంగడాలను సృష్టించడం కూడా అంతే అవసరం. మారుతున్న ప్రజల ఆహార అవసరాలకు ధీటుగా కొత్త రకాలను అభివృద్ధి చెయ్యవలసి ఉంటుంది, దీనితోపాటు పంటను ఆశించే చీడపీడలు, మరియి భిన్న వాతావరణ పరిస్థితులను తట్టుకునే విధంగా కొత్త రకాలను అభివృద్ధి చెయ్యవలసి ఉంటుంది. వరి వంగడాల్లో సాంబ మసూరి రాకని విప్లవాత్మకమైనదిగా చెప్పవచ్చు. కేవలం దిగుబడిలోనే కాదు, అంతర్జాతీయ ఎగుమతుల్లో కూడా మొదటిస్థానంలో నిలిచింది.

ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న సాంబామసూరి రకాన్ని, గుంటూరు జిల్లా బాపట్ల వ్యవసాయ పరిశోధన కేంద్రంగా, డాక్టర్. ఎం. రమణారెడ్డి అభివృద్ధి చేసారు. సాంబ మసూరి రకాన్ని అభివృద్ధి చెయ్యడానికి శాస్త్రవేత్తలు దాదాపు 8 సంవత్సరాలు కృషి చేసారు, మేలు జాతి రకాలైన జీఈబి 1 మరియు తైచుంగ్ నేటివ్-1 రకాలను సంకరింపచేసి, వచ్చిన మొక్కలపైన అధ్యయనం జరిపి సాంబ మసూరి రాకని విడుదల చేసారు. విడుదలైన కొద్దీ కాలానికే సాంబమసూరి రకం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. సాంబ మసూరి రకం విడుదలై దాదాపు 35 సంవత్సరాలు పూర్తయినసరే, రైతుల్లో ఈ రకం వరి వంగడానికి ఉన్న డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. ఎకరానికి 35-40 బస్తాల ధాన్యం అందిస్తుంది.

సాంబ మసూరి బియ్యానికి మన దేశంతోపాటు విదేశాల్లో కూడా మంచి పేరు సంతరించుకుంది. ఇక్కడ పండిన పంటలో చాలా భాగం విదేశాలకు ఎగుమతవ్వడం విశేషం. ఎక్కువ నాణ్యత కలిగి ఉండటంతో అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ రకాన్ని సాగు చెయ్యడం ద్వారా, మార్కెట్లో మంచి ధర లభించి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఎన్ని ఉపయోగాలు ఉన్నాసరే ఈ వరి రకాన్ని సాగు చెయ్యడంలో కొన్ని సమస్యలు లేకపోలేదు.

సాంబ మసూరి రకాన్ని సాగు చేసే రైతులు ప్రధానంగా ఎదుర్కునే సమస్యల్లో, అగ్గి తెగులు, ఎండకు తెగులు, దోమపోటు ప్రధానమైనవి. ఇవి పంటను ఎక్కువుగా ఆశించి ఎక్కువ నష్టాన్ని కలిగిస్తున్నాయి. అయితే ఒక్క ఎండాకు తెగులును తప్ప మిగిలిన తెగుళ్లకు మందులు అందుబాటులోకి వచ్చాయి. ఎండాకు తెగులు బాక్టీరియా వల్ల సోకుతుంది కాబట్టి దీని నివారణ రైతులకు కష్టతరంగా మారుతుంది. అయితే ఈ ఎండకు తెగులును కూడా సమర్ధవంతంగా తట్టుకునే రకాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసారు. బయోటెక్నాలజీ సహాయంతో ఎండాకు తెగులును తట్టుకునే రకాన్ని జన్యువును ర్ రకంలోకి చొప్పించి ఇంప్రూవ్డ్ సాంబా మసూరి రకాన్ని అభివృద్ధి చేసారు. సాంబ మసూరి రాకని ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణతో పాటు, కర్ణాటక, తమిళ్నాడు, రాష్ట్రాల్లో కూడా విరివిగా సాగు చేస్తున్నారు.

Share your comments

Subscribe Magazine