ఆధునిక వ్యవసాయంలో విచ్చలవిడిగా పురుగు మందులు వాడడం వల్ల ప్రమాదకర పురుగు మందు అవశేషాలు నేల, నీరు, గాలి కాలుష్యానికి కారణం అవుతున్నాయి. దీని పర్యవసానంగా జన్యుపరమైన మార్పులు, ప్రమాదకర వ్యాధులతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని గ్రహించిన ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే సేంద్రియ వ్యవసాయ సాగు విధానాలను అమలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో వ్యవసాయంలో సేంద్రియ సాగు కోసం ఒక విధానాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం ఆక్వాకల్చర్‌లో కూడా సేంద్రియ పద్ధతిని అమలుచేసి ఈ దిశగా ఆక్వా రంగ రైతులను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
భారతదేశంలోని ఆక్వా రంగం ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఆక్వా ఉత్పత్తులు 2020 -21లో ఏకంగా 46.23 లక్షల టన్నులకు పెరిగాయి.ప్రస్తుత ఆక్వా రంగంలో అధికోత్పత్తే లక్ష్యంగా ప్రమాదకరంగా యాంటిబయోటిక్స్, ఎరువులు, సింథటిక్, పురుగుమందులు మోతాదుకు మించి వినియోగించడం వలన పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంమే కాకుండా వీటిని ఆహారంగా తీసుకున్న ప్రజలు అనేక రకాల వ్యాధులతో బాధ పడాల్సి వస్తోంది.
దీనికి పరిష్కార మార్గంగా ఆక్వాలో సేంద్రియ సాగును ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.త్వరలో తీసుకొస్తున్న ఆక్వా సేంద్రియ పాలసీలో భాగంగా రైతులు సేంద్రియ పద్ధతుల్లో ఆక్వాసాగు చేయడానికి సేంద్రియ పద్ధతుల్లో తయారుచేసిన, జన్యుమార్పిడి లేని సర్టిఫైడ్ సీడ్, ఫీడ్‌ను రైతులకు అందించి సహజమైన పద్ధతుల్లోనే చెరువులు నిర్వహించడం వంటి వాటి పై రైతులకు అవగాహన కల్పించి వారిని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
Share your comments