సాధారణంగా మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉండి వ్యవసాయ పనులు చేయాలంటే చాలామంది బద్ధకంగా వ్యవసాయ పనులు చేయలేక ఇతరులకు తమ పొలాన్ని చేసుకోవడానికి ఇస్తుంటారు. కానీ ఒక ప్రమాదంలో తన రెండు కాళ్లను కోల్పోయి నడవలేని స్థితిలో ఉన్నా కూడా ఆత్మస్థైర్యంతో అడుగులు ముందుకు వేశాడు రైతు అంజయ్య. తన ఎంతో ఇష్టపడే వ్యవసాయం చేయడానికి తన అంగవైకల్యం అడ్డురాదని నిరూపిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలిచాడు.రెండు కాళ్లు లేకపోయినప్పటికీ వ్యవసాయం చేస్తూ ఎంతో మంది రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న అంజయ్య కథ ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం...
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్, గ్రామానికి చెందిన బద్దెనపల్లి అంజయ్య అనే వ్యక్తికి 62 సంవత్సరాలు. ఒకసారి శ్రీశైలం కొండకి వెళ్లి వస్తూ మార్గమధ్యంలో యాక్సిడెంట్ కి గురయ్యాడు. ఈ క్రమంలోనే అతని రెండు కాళ్ళను నడుం వరకు తీసేయాలని వైద్యులు సూచించారు. ఈ విధంగా తన రెండు కాళ్లను కోల్పోయినప్పటికీ అంజయ్య ఏ మాత్రం నిరాశ చెందకుండా, కృంగిపోకుండా ఆత్మస్థైర్యంతో ముందుకు అడుగులు వేశాడు. తనకున్న కొద్దిపాటి పొలంలోనే వ్యవసాయం చేస్తూ..పంటలు పండిస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఈ విధంగా తనకు ఎంతో ఇష్టమైన వ్యవసాయం చేయడానికి తన అంగవైకల్యం ఏమాత్రం అడ్డు రాలేదని వ్యవసాయం చేయడం ఎంతో ఇష్టంగా ఉందని ఈ సందర్భంగా అంజయ్య తెలిపాడు. కాళ్లు లేకపోయినప్పటికీ వ్యవసాయ పనులను చేస్తూ డబ్బులు సంపాదించి తన ముగ్గురు పిల్లలకు పెళ్లి చేశాననని ఎంతో సంతోషంగా తెలియజేశాడు. ఆరు పదుల వయసులో కూడా వ్యవసాయం పై మక్కువ ఉండి,కాళ్లు లేకపోయినప్పటికీ ఎంతో మంది రైతులకు అంజయ్య ఆదర్శంగా నిలుస్తున్నాడని చెప్పవచ్చు. అంజయ్య కేవలం తన సొంత పనికి మాత్రమే కాకుండా ఉపాధి హామీ పనులకు వెళ్లడం, గ్రామంలో ఇతర పొలాలకు పనులు చేయడానికి వెళ్లడం కూడా చేస్తుంటారని గ్రామస్తులు తెలియజేశారు.
Share your comments