వ్యవసాయం దండగ అనుకుని వ్యవసాయ భూములన్నీ ప్లాట్లుగా మార్చి అమ్ముకునే ఈ రోజుల్లో ఓ రైతు మాత్రం దీనికి భిన్నంగా,వ్యవసాయ మీద మక్కువతో తన వ్యవసాయ క్షేత్రం కోట్ల విలువ చేస్తున్నా, తన పొలం చుట్టూ పెద్దపెద్ద అపార్ట్మెంట్లు, కాలనీలు వెలసిన తనకున్న రెండెకరాల భూమిలో గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ ఆరోగ్యకరమైన పంటలు పండిస్తూ... కాలనీవాసులకు అక్కడే అమ్మి జీవనం సాగిస్తూ ...వ్యవసాయం మీద తనకున్న మక్కువను తెలుపుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
అందరికీ ఆదర్శంగా నిలిచిన ఆ రైతు వివరాలు అతడు పండిస్తున్న పంటలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం... తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ మీర్‌పేట కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడకు చెందిన సిద్దాల కొమురయ్య అనే రైతు దాదాపు 45 ఏళ్ల నుంచి వ్యవసాయం చేస్తున్నాడు. ఈ ప్రాంతం నగరానికి ఆనుకుని ఉండటం చుట్టూ కాలనీలు వెలిసినప్పటికీ వ్యవసాయాన్ని వదలకుండా తనకున్న రెండెకరాల పొలంలో
వరితో పాటు పాలకూర, తోటకూర, వివిధ రకాల కాయగూరలు పండిస్తుంటాడు.
విశేషమేమిటంటే సిద్దాల కొమురయ్య తన వ్యవసాయ క్షేత్రంలో పండే పంటలు ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధమైన ఎరువులతో ఆర్గానిక్ పద్ధతిలో అన్ని రకాల ఆకుకూరలు, కాయగూరలను పండిస్తున్నాడు.దీంతో ఇతడు పండిస్తున్న పంటలను కొనుగోలు చేయడానికి స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఇతడు పంట కోత జరిగిన వెంటనే తన భార్య అంజనమ్మతో కలిసి అక్కడే విక్రయిస్తుంటారు.
సిద్దాల కొమురయ్య తన వ్యవసాయ క్షేత్రం కోట్ల విలువ చేస్తున్న దాన్ని అమ్ముకుని సొమ్ము చేసుకోకుండా వ్యవసాయం చేస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు.
Share your comments