Agripedia

సేంద్రియ ఎరువుగా కోళ్ల ఎరువు, భూసారం మెరుగు...

KJ Staff
KJ Staff

మితిమీరిన రసాయనాల వాడకం వలన భూసారం తగ్గిపోతుంది. రసాయన ఎరువులు మట్టిలోని వైవిధ్యాన్ని దెబ్బతీసి, సాగుకు అనువైన నేలలను సైతం బీడు భూములుగా మారుస్తున్నాయి. వీటి వాడకం కేవలం మట్టి ఆరోగ్యానికే కాకుండా పర్యవరణ ఆరోగ్యానికి మరియు మనుషుల ఆరోగ్యానికి కూడా తీరని నష్టం కలిగిస్తున్నాయి. ఈ సమస్యను నిర్ములించడానికి సేంద్రియ వ్యవసాయం మాత్రమే ఇప్పుడు మనకున్న మార్గం.

సేంద్రియ విధానంలో వ్యవసాయం, మట్టికి మరియు పర్యావరణానికి మేలు చేకూరుస్తుంది. సేంద్రియ పద్దతిలో మొక్కలకు పోషకాలు అందించాడని అనేక రకాల ఎరువులున్నాయి. అయితే సేంద్రియ ఎరువులంటే కేవలం పశువుల ఎరువులు మాత్రమే కాదు, కోళ్లు మరియు మేకలు మరియు ఇతర జంతువుల విసర్జకాలతో కూడా సేంద్రియ ఎరువులను తయారుచెయ్యవచ్చు. పౌల్ట్రీ ఫారాలు ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో రైతులు కోళ్ల పెంటను తమ పొలంలో ఎరువుగా వినియోగించుకొని, భూసారాన్ని పెంచుకోవచ్చు. అయితే కోళ్ల ఎరువులను వాడే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో ఎకరాల్లో తేలిక భూములున్నాయి. తేలికపాటి భూముల్లో సేంద్రియ కర్బనం తక్కువుగా ఉంటుంది, ఇది మొక్క ఎదుగుదలలో మరియు మట్టిలో ఇతర జీవాల పోషణలో ముక్యమైన పాత్ర పోషిస్తుంది. రసాయన ఎరువులు వినియోగం ద్వారా, మట్టిలో సేంద్రియ కర్బన శాతం తగ్గిపోతుంది. ఇందుకుగాను సేంద్రియ ఎరువులను వినియోగించడం ద్వారా మట్టిలో కర్బన శాతం పెంచవచ్చు. రైతులకు అందుబాటులో ఉండే ఎరువుల్లో పశువుల ఎరువు ఒకటి, దీని మీద రైతులు ఎక్కువుగా ఆధారపడుతూ ఉంటారు. అయితే కోళ్ల ఫారాలు ఎక్కువుగా ఉండే ప్రదేశాల్లోని రైతులు కోళ్ల ఎరువులను వాడుకోవడం ద్వారా ప్రయోజనం ఉంటుంది.

కోళ్ల ఫారాల్లో ప్రతీ నలభై కోళ్లకు ఒక టన్ను వరకు కోళ్ల ఎరువు వస్తుంది. కోళ్ల ఎరువులో రెండు రకాలుంటాయి, మొదటిది బ్రాయిలర్ కోళ్ల ఎరువు, అలాగే రెండవది లేయర్ కోళ్ల ఎరువు.

1. బ్రాయిలర్ కోళ్ల ఎరువు: సాధారణంగా బ్రాయిలర్ కోళ్లను పెంచే షెడ్లలో కోళ్ల విసర్జకాలతో పాటు, వరి పొత్తు మరియు కోళ్ల మూత్రం కూడా కలిసి ఉంటుంది. ఇటువంటి ఎరువుకి ఆమ్ల శాతం తక్కువగా ఉంటుంది. దీనిని ఎకరానికి రెండు టన్నుల చొప్పున వినియోగించుకోవచ్చు, మట్టి ఆఖరి దుక్కిలో ఎరువును కలిపి కలియదున్నడం ద్వారా మొక్కకు అవసరమైన పోషకాలు లభిస్తాయి.

2. లేయర్ కోళ్ల ఎరువు: లాయర్లను గుడ్ల కోసం బోన్లలో పెంచుతారు, వీటి నుండి మలమూత్రాలు షెడ్ అడుగు భాగంలో జమవుతాయి. ఇటువంటి ఎరువులో ఆమ్లత్వం ఎక్కువుగా ఉంటుంది. లేయర్ కోళ్ల ఎరువును వాడే రైతులు ఒక ఎకరానికి 1-1.5 టన్నుల ఎరువును వినియోగిస్తే సరిపోతుంది. అయితే దీనిని నేరుగా పొలంలో వాడకూడదు, షెడ్ నుండు బయటకు తీసి రెండు నెలలు మాగిన తర్వాత మాత్రమే ప్రధాన పొలంలో చల్లుకోవాలి.

వంద కిలోల కోళ్ల ఎరువులో 3% నత్రజని, 2% భాస్వరం, మరియు 2.5 % పోటాష్ అందుబాటులో ఉంటుంది. ఈ పోషకాలు మొక్క ఎదుగుదలలో దోహదపడతాయి, అంతేకాకుండా కోళ్ల ఎరువులోని సేంద్రియ కర్బనం మట్టి ఆరోగ్యాన్ని పెంపొందించి, మట్టి నీటిని పట్టి ఉంచేలా చేస్తుంది. ఎరువులు పొలం మొత్తం వేసిన వెంటనే దుక్కిదున్నాలి, లేకుంటే ఎరువులు వర్షపు నీటితో కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine