సాధారణంగా తాటిచెట్లు అంటే మన ప్రాంతాలలో సుమారు వంద అడుగుల ఎత్తులో ఉంటాయి. వీటి పైకి ఎక్కి కార్మికులు కల్లు సేకరించాలంటే ఎంతో కష్టంతో కూడుకున్న పని. ఈ క్రమంలోనే కార్మికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు పొట్టి తాటి చెట్ల సాగు పై ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ చెట్లు కేవలం 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతాయి. మరి ఈ పొట్టి తాటి చెట్ల వల్ల అధిక ప్రయోజనాలను పొందవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నీరా విధానాన్ని ప్రకటించడంతో తాటిచెట్ల పెంపకం పై రైతుల ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం రైతులకు మేలైన తాటి చెట్లను అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. తాటి చెట్ల నుంచి వచ్చే నీరాతో తయారైన బెల్లానికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో ఈ పంటపై చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే మన దగ్గర పెరిగే తాటి చెట్ల రకం కన్నా బీహార్ కి చెందిన తాటిచెట్లు ఎంతో మేలని పామ్ ప్రమోటర్స్ సొసైటీ చైర్మన్ విష్ణుస్వరూపరెడ్డి తెలిపారు.
మన దగ్గర ఉండే తాటి చెట్టు సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండి పంట పెట్టిన 14 సంవత్సరాలకు గాని గీతకు రావు.అదే బీహార్ రాష్ట్రానికి చెందిన పొట్టి తాటి చెట్లు 20 అడుగుల ఎత్తులో ఉండి ఏడు సంవత్సరాలకు గీతకు వస్తాయి. అలాగే 100 తాటికాయలు వరకు దిగుబడినిస్తాయి. ఇక సీజన్ లో రోజుకు 3 నుంచి 10 లీటర్ల నీరు అందిస్తుందనీ తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలినట్లు విష్ణుస్వరూప్‌రెడ్డి తెలిపారు.
ఈ చెట్టు తక్కువ ఎత్తులో ఉండటం వల్ల కార్మికులకు పని ఎంతో సులువుగా మారుతుంది.గతంలో ఈ విధమైనటువంటి పొట్టి తాటి చెట్లు ఐదు వేల మొక్కలు తెప్పించి రైతులకు ఉచితంగా ఇచ్చినట్లు విష్ణు స్వరూప్ రెడ్డి తెలిపారు.ఈ ఏడాది 1,25,000 మొక్కలను దిగుమతి చేసుకున్నట్లు తెలియజేశారు. అదేవిధంగా రోజుకు 30 లీటర్ల వరకు నీరా అందించే మేలైన జీలుగ, గిరిక మొక్కలను అభివృద్ధి చేస్తున్నట్లు ఈ సందర్భంగా విష్ణు స్వరూప్ రెడ్డి తెలియజేశారు.
Share your comments