ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా
సాంప్రదాయ పంటలకు స్వస్తి చెప్పి సంవత్సరం పొడవునా ఆదాయాన్నిచ్చే కనకాంబరాల పూల సాగు చేసి తెలుగు రాష్ట్రాల రైతన్నలు అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు.కనకాంబరం పూల సాగుకు అనువైన వాతావరణం,నేలలు అందుబాటులో ఉన్న రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అనుకూలమైన వాతావరణం,నేలలు :
కనకాంబరం నీటి ఎద్దడిని బాగా తట్టుకునే బహువార్షిక పూల మొక్క. కనకాంబరం సాగు అన్ని రకాల వాతావరణంలోనూ సాగు చేస్తున్నప్పటికీ ఈ మొక్క పెరుగుదలకు 30 నుండి 32 డిగ్రీల సగటు ఉష్ణోగ్రత అనువుగా ఉండి ,చల్లని వాతావరణంలో పూల దిగుబడి అధికంగా పొందడానికి అవకాశం ఉంటుంది.
కనకాంబరం సాగుకు సేంద్రియ పదార్థం అధికంగా కలిగిన సారవంతమైన ఒండ్రు, గరప నేలలు, నీరు నిలవని అన్ని రకాల నేలలు అనుకూలమైనవి. నులిపురుగు సమస్యాత్మక నేలల్లో వీటి సాగు చేపడితే ఆర్థిక నష్టం వాటిల్లే ప్రమాదముంది.
మన ప్రాంత వాతావరణానికి అనువైన రకాలు:
డా.ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ : ఈరకం పూలకు నిల్వ సామర్థ్యం ఎక్కువగా ఉండి దూర ప్రాంతాలకు ఎగుమతి చేయడానికి అనుకూలంగా ఉంటాయి. పూల పరిమాణం కాస్త పెద్దదిగా ఉండి ఎరుపు రంగు పూల నిస్తుంది.
ఆరెంజ్ ఢిల్లీ: ఈ రకం కనకాంబరం ముదురు నారింజ రంగు పూలనిస్తుంది. కొమ్మకత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం సులువుగా చేసుకోవచ్చు.
లక్ష్మి : ఈరకం పూలు నారింజ రంగులో చూడడానికి ఆకర్షణీయంగా ఉండి, హెక్టారుకి 750 కిలోల అధిక పూల దిగుబడినిచ్చే ప్రసిద్ధి చెందిన రకం.
మధుమాడి: నారింజ రంగు పెద్ద పూలను కలిగి నులిపురుగులను,శిలీంధ్రాలను తట్టుకుంటుంది.
సెబాక్యులియన్ రెడ్: ఎరుపు రంగు పూలను కలిగి నులిపురుగులను తట్టుకొనే శక్తి కలదు.
Share your comments