Agripedia

చెరకు లో నాణ్యమైన విత్తనోత్పత్తికి మెళకువలు!

Srikanth B
Srikanth B
Sugarcane farming
Sugarcane farming



మన రాష్ట్రంలో చెరకు పంటను సుమారు 21 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగుచేస్తూ, 16 లక్షల టన్నుల చెరకు ఉత్పత్తి చేస్తున్నాము. చెరకు పంట ద్వారా పంచదార, బెల్లం, ఖండసారి, బగాస్సె, మొలాసెస్‌ మరియు ఫిల్టర్‌ మడ్డి ఉత్పత్తి అవుతాయి. అధిక చెరకు దిగుబడితోపాటు ఎక్కువ పంచదార దిగుబడి పొందడానికి నాణ్యమైన విత్తనాలు (రకములు), అనువైన శీతోష్ణ ష్టస్థితులు, సాగుభూమి, సాగుపద్దతులు, సస్యరక్షణ మరియు సాగునీటి నాణ్యత అనే ఆరు అంశాలు ప్రభావితం చేస్తాయి.

 

రైతులకు ఏడాది పొడుగునా కష్టపడి పండిస్తే దిగుబడి ఎకరానికి సగటున 40 టన్నులు కూడా రావడం లేదు. దీనిలో సుమారుగా 30 టన్నుల రాబడి, ఖర్చులకే సరిపోగా రైతుకు మిగిలేది 10 టన్నుల రాబడి మాత్రమే. ఇటీవల యంత్రీకరణ ద్వారా కొంతలో కొంత ఖర్చు తగ్గించుకుంటున్నారు.

చెరకు ఇంకా లాభసాటిగా ఉండాలంటే సరైన రకాలని మరియు మంచి నాణ్యమైన విత్తనమును ఎంచుకోవడం వలన అధిక దిగుబడులు పొందవచ్చు. చెరకు పంట ఒక మొక్క తోట మరియు రెండు మోడెం తోటెలుగా రెండు నుండి మూడు సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి నాణ్యమైన విత్తనం చాలా ముఖ్యమయినది. విత్తన ఎంపిక, విత్తన రేటు మరియు విత్తన శుద్ధి గురించి రైతులకు తప్పకుండా అవగాహన ఉండాలి.

విత్తనము అనగా పంట ఉత్పత్తికి మరియు పునరుత్పత్తిలో ఉపయోగపడే పదార్థము, అందువలన మొలక శాతం విత్తనానికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం. “శుబీజం శుక్షేత్రే జయతే సంపాదయతే” అని మన సంస్కృతిలో నాణ్యమైన విత్తనం యొక్క విలువలను తెలియజేయడమైనది. నాణ్యమైన విత్తనం అనగా శుభ్రత, జన్యు స్వచ్చత, బాహ్య స్వచ్చత, బాగా మొలకెత్తే స్వభావం కలిగి ఆరోగ్య వంతంగా పెరిగి మంచి దిగుబడి ఇవ్వాలి. చెరకులో శాఖీయ ఉత్పత్తి వలన రకముల దిగుబడిశక్తి త్వరగా తగ్గిపోవడం, ఎక్కువ మోతాదులో విత్తన అవసరం, విత్తనోత్పత్తి రేటు తక్కువగా ఉండటం, విత్తన జీవశక్తి తక్కువగా ఉండటం మొదలైనవి చెరకు విత్తనోత్పత్తిలో ప్రధాన సమస్యలు.

రూ. 700 కే బ్యాగ్ ఎరువు .. మార్కెఫెడ్‌ కొత్త ఆవిష్కరణ !

తక్కువ పరిమాణంలో నాణ్యమైన విత్తనాన్ని ప్రతి రైతు తనకు తానే తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతో మంచి రాబడి పొందగలరు. గ్రామ స్థాయిలో విత్తనోత్పత్తి చేసేటప్పుడు సాధ్యమైనంత వరకు ఒకే రకమును ఉత్పత్తి చేయాలి, సామూహికంగా చేయాలి, ఒకే ప్రదేశంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. విత్తన ఎంపికలో పూత పూయని చెరకు చిగురు భాగం లేదా 7-8 నెలల వయస్సు గల లేవడి తోటల నుండి విత్తనమును ఎంపిక చేసుకోవాలి. రెండు కన్నుల ముచ్చెలను దూరపు చాళ్ల పద్దతిలో నాటుకున్నట్లయితే ఎకరాకు ఉండవలసిన మొక్కల సాంద్రతను బట్టి నాటుకోవాలి.

విత్తన శుద్ధిః


నాటుటకు ముందు ముచ్చెలను 200 లీ.. నీటికి 100గ్రాముల కార్చండజిం మరియు 50 మి.లీ ఇమిడాక్లోప్రిడ్‌ మందులో 15ని. ఉంచినట్లయితే పొలుసు పురుగు, చెదలు, వేరు పురుగు మరియు అనాస కుళ్ళు తెగులు అరికట్టవచ్చు. ముచ్చెలను వేడి నీటిలో 520 సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద 30 నిమిషాలు లేదా తేమతో మిలితమయిన వేడి గాలిలో 540 సెల్సియస్‌ ఉష్ణోగ్రత వద్ద 2 గం॥లు ఉంచి శుద్ధి చేయాలి. ముచ్చెలను శుద్ది చేయటం ద్వారా కాటుక, ఆకుమాడు, గడ్డిదుబ్బు తెగుళ్ళను నివారించవచ్చు. కొత్త రకాల విత్తనోత్పత్తి, వాటి నాణ్యమైన విత్తనం ఎక్కువ సంవత్సరాలు రైతులకు అందాలంటే విత్తనోత్పత్తి చేసే రైతు క్షేత్రాలు ఎక్కువగా, దగ్గరగా ఉండాలి. ఈ చెరకు విత్తనోత్పత్తి కార్యక్రమము మూడు దశలలో జరగాలి.

మొదటి దశ నర్సరి:
ఈ దశలో మూల విత్తనాన్ని పరిశోధణ స్థానం, వాటిని వేడి నీటిలో మరియు కీటకనాశినీలతో విత్తన శుద్ది చెయ్యాలి. దీని నుంచి రెండవ దశ నర్సరి కోసం 6-8 నెలల వయస్సు తోటల నుండి విత్తనాన్ని సేకరించాలి.
రెండవ దశ నర్సరి:
ఈ దశలో విత్తనాన్ని మొదటి దశ నర్సరి నుంచి సేకరించి, వాటిని వేడి నీటిలో మరియు కీటకనాశినీ లతో విత్తన శుద్ధి చెయ్యాలి. ఈ దశ నర్సరీని నిపుణులైన రైతు క్షేత్రాలలో ఉత్పత్తి చేయించాలి. దీని నుంచి కమర్షియల్‌ నర్సరి కోసం 6-8 నెలల వయస్సు తోటల నుండి సేకరించాలి.

కమర్షియల్‌ దశ నర్సరి:
ఈ దశలో విత్తనాన్ని రెండవ దశ నర్సరి నుంచి సేకరించి, విత్తనాన్ని వేడి నీటిలో మరియు కీటకనాశినీలతో విత్తనశుద్ధి చెయ్యాలి. ఈ దశ నర్సరీని నిపుణులైన రైతుక్షేత్రాలలో ఉత్పత్తి చేయించాలి. చెరకు విత్తనాన్ని 6-8 నెలల వయస్సు తోటల నుండి సేకరించాలి. కమర్షియల్‌ దశ నర్సరీనుంచి విత్తనాన్ని నేరుగా రైతు క్షేత్రాలకు అందించవచ్చు. ఈ మూడు దశల పద్దతిని ప్రతి 5 సంవత్సరాలకి మళ్ళీ పరిశోధన స్థానం నుంచి సేకరించిన విత్తనం నుంచి మొదలుపెట్టాలి.

రూ. 700 కే బ్యాగ్ ఎరువు .. మార్కెఫెడ్‌ కొత్త ఆవిష్కరణ !

ఈ మూడు దశల పద్దతిని ప్రతి చెరకు కర్మాగారం పాటిస్తే రైతులు 10-12% అధిక దిగుబడులు పొందవచ్చును. ఈ మూడు దశల కోసం మొలక తోటల నుండి విత్తనాన్ని సేకరించాలి మరియు మంచి సాగు విధానాలు పాటించాలి. ఈ విత్తనోత్పత్తి క్షేత్రాలను 45-60, 120-180 మరియు 150-160 రోజులలో అనగా మొత్తం పంట కాలంలో మూడు సార్లు క్షేత్ర తనిఖీ చేయాలి.

చెరకు ముచ్చె కళ్ళ నుండి నారును పెంచే పద్దతి :

ఈ పద్దతిలో మూడు కళ్ళ ముచ్చెలకు బదులుగా చెరకు కన్నులను మాత్రమే వేరుచేసి విత్తనంగా వాడుతారు. ప్లాస్టిక్‌ ట్రేలలోని గుంతలను 1/3 వంతు వరకు కోకోపిట్‌ తో నింపుకొని విత్తనశుద్ధి చేసిన కన్నులు పైకి ఉండేటట్లు వాలుగా ఉంచాలి. చెరకు మొలక శాతం తొందరగా రావడానికి ట్రేలను ఒకదానిపై ఒకటి వరుసగా పేర్చుకొని ప్లాస్టిక్ షీట్‌ ను గాలి తగలకుండా కప్పాలి. మొలకెత్తిన ట్రేలను 4వ రోజు హరిత గ్రుహంలోకి మార్చుకొని రోజు విడిచి రోజు రోజ్‌ క్యాన్‌ తో అవసరాన్ని బట్టి తడుపుకోవాలి.
ఈ విత్తనోత్పత్తిలో చెరకు ముచ్చెకళ్ళ నుండి నారును పెంచుకుంటే వివిధ లాభాలు ఉన్నాయి, అవి ఏమనగా విత్తన ఖర్చు దాదాపు నాలుగింట మూడు వంతులు తగ్గించుకోవచ్చు. ఈ పద్దతిలో మూడు కళ్ళ ముచ్చెలకు బదులుగా చెరకు కన్నులను మాత్రమే విత్తనముగా వాడుతాము. కన్నులు వేరు చేయగా మిగిలిన చెరకు గడలను బెల్లం లేదా పంచదార తయారీకి వినియోగించుకోవచ్చు. ఈ మూడు దశల పద్దతిని పాటిస్తే రైతులు 10-12% అధిక దిగుబడులు పొందవచ్చును.

రచయిత :
యన్‌. స్వప్న, యం. సాయిచరణ్, జి. రాకేష్‌, ఎ. దినేష్‌ మరియు డా॥ బి. బాలాజీ నాయక్
ప్రాంతీయ చెరకు మరియు వరి పరిశోధన స్థానం - రుద్రూర్‌, జి॥ నిజామాబాద్‌ - 503 188

Share your comments

Subscribe Magazine