గొర్రెల పెంపకం వాణిజ్యపరంగా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. తెలుగు రాష్ట్రాలు గొర్రెల పెంపకంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నాయి. అనావృష్టి ప్రాంతాల్లో గొర్రెల పెంపకం సానుకూలంగా ఉంటుంది. గ్రామాల్లో ఇప్పుడు బీద వారే కాదు.. చదువుకున్న యువతసైతం స్వయం ఉపాధిగా గొర్రెల పెంపకాన్ని ఎంచుకుంటోంది. ఈ గొర్రెలను ముఖ్యంగా మాంసం, ఉన్ని, ఎరువులకోసం పోషిస్తుంటారు.
మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లో నెల్లూరు జాతిని పెంచుతారు. తెలంగాణా ప్రాంతంలో దక్కని జాతిని ఎక్కువగా పెంచుతారు. నెల్లూరు గొర్రెల జాతిలో జొడిపి, పల్లా, బ్రౌన్ అనే మూడు రకాలను మనం చూడొచ్చు. ఈ నెల్లూరు గొర్రెల జాతిని మాంసోత్పత్తికి మాత్రమే పెంచుతారు. ఇక తెలంగాణ ప్రాంతంలో పెంచే దక్కని జాతి గొర్రెలు తక్కువ నాణ్యతున్న ఉన్ని మరియు మాంసోత్పత్తికి ప్రసిద్ధి చెందినవి. మొదటిసారిగా గొర్రెల పెంపకం చేపట్టేందుకు సిద్ధమైన వాళ్లు ముందుగా 35 నుంచి 50 ఆడగొర్రెలు, రెండు విత్తనపు పొట్టేళ్ళతో గొర్రెల పెంపకాన్ని ప్రారంభిస్తే మంచిగుంటుంది.
వాటిని పెంచుతుంటే వచ్చే అనుభవంతో మనకు అనుకూలంగా ఉన్న పచ్చికబయళ్ళు, పనివారి సంఖ్య, తిండి గింజలు, మేత మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని గొర్రెల సంఖ్యను పెంచితే మంచి లాభాలను పొందవచ్చు. రెండెకరాల పొలంలో 50 నుంచి 60 గొర్రెలను పెంచితే సాలుకు రూ. 25-30 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ గొర్రెల పోషణలో అతిముఖ్యమైనది వాటి ఆహారం. మీరు పెంచే గొర్రెల పెంపకం లాభసాటిగా ఉండాలంటే వాటికి సరిపోయేంత మేత దొరికే పచ్చిక బయళ్ళు ఉండాలి. ఇది చాలా ముఖ్యం కూడా. ఎందుకంటే ఎలాంటి దాణాలు పెట్టకున్నప్పటికీ పచ్చిక బయళ్ళలో దొరికే మేతతోనే గొర్రెలను ఈజీగా పెంచుకోవచ్చు.
Share your comments