చాలామంది రైతులు వ్యవసాయంతో పాటు అనుబంధంగా కోళ్లు, మేకలు, పాలిచ్చే జంతువుల పెంపకాన్ని కొనసాగిస్తుంటారు. ఎప్పటికప్పుడు మంచి ఆదాయాన్ని అందించడంలో కోళ్ల పెంపకం చాలా డిమాండ్ పొందిందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం నాటు కోడికి ప్రత్యామ్నాయంగా చాలామంది కడక్ నాథ్ లేదా నల్ల కోడి రకాన్ని ఎంచుకుంటున్నారు. ఈ కోళ్లు ఎక్కువ పోషక విలువలను కలిగి ఉంటాయి. అందుకే చాలామంది వీటిని పెంచుకుంటూ లాభాలను సాధిస్తున్నారు. మాంసంతో పాటు సుమారు వంద గుడ్ల వరకు పెంచే ఈ కోడిని ఎలా పెంచుకోవాలో తెలుసుకుందాం.
కడక్ నాథ్ కోళ్లు మధ్య ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే దొరికేవి. ఆయా రాష్ట్రాల్లోని గిరిజనులు వీటిని ఎక్కువగా పెంచుకునేవారు. ఆదివాసి జనాలు వీటిని పవిత్రంగా భావించి దేవుళ్లకు నైవేద్యంగా పెడతారు. ఈ మాంసంలో పోషకాలు చాలా ఎక్కువగా ఉండడంతో ఇవి చాలా ప్రాచుర్యం పొందాయి. దీంతో చాలామంది రైతులు వీటిని పండించడం ప్రారంభించారు.
కడక్ నాథ్ ప్రత్యేకతలు
నలుపు, నీలం రంగుల్లో ఉండే ఈ కోళ్లలో చర్మం, మాంసంతో పాటు రక్తం కూడా నల్లగా ఉంటుంది. అందుకే వీటిని కాలా మాళి అంటారు. ఈ రంగులో ఉండే మాంసంలో చాలా పోషకాలు, ఔషధ విలువలు ఉంటాయి. ఇవి సెక్స్ సామర్థ్యాన్ని పెంచడంతో పాటు దీర్ఘ కాలిక సమస్యలను తగ్గిస్తాయి. ఈ కోడి మాంసాన్ని మూలికా వైద్యంలో కూడా వాడతారు. వీటిలో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ. అందుకే అన్ని రకాల వాతావరణ పరిస్థితులను ఇవి తట్టుకుంటాయి. ఈ జాతి కోళ్లు చాలా తొందరగా గుడ్లు పెట్టడం ప్రారంభిస్తాయి. ఒక్క సీజన్ లోనే ఇవి సుమారు 100 గుడ్లను పెడతాయి.
కడక్ నాథ్ పెంపకం
కడక్ నాథ్ కోళ్లను మధ్య ప్రదేశ్ లో ఎక్కువగా పెంచుతున్నారు. ఒక్కో పిల్ల చిన్నగా ఉండగానే రూ. 60 నుంచి 80 కి దీన్ని ఖరీదు చేస్తున్నారు చాలామంది. ఈ కోళ్లను పెరట్లోనే నాటు కోళ్ల మాదిరిగా పెంచుకోవచ్చు. ఇవి అన్ని రకాల వాతావరణాలను తట్టుకుంటాయి కాబట్టి కేవలం సరైన దాణా అందిస్తే సరిపోతుంది. అయితే బాయిలర్ కోళ్ల తో పోల్చితే వీటిని ఎక్కువ రోజులు పెంచాల్సి ఉంటుంది. వీటిని కనీసం 120 రోజులు పెంచాలి. అప్పటికి పెట్ట కేవలం 1.5 కేజీల బరువు పెరుగుతుంది. పుంజు అయితే రెండు కేజీలు ఉంటుంది. ఇంకా ఎక్కువ రోజులుంటే ఎక్కువ బరువు పెరుగుతుంది. కడక్ నాథ్ కోళ్లు కేజీకి సుమారు రూ. 1000 నుంచి రూ.1400 వరకు పలుకుతోంది. వీటికి డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటోంది. ఒక కోడి పెంచేందుకు కేవలం రూ.250 ఖర్చవుతుంది. అలా చూసుకున్నా ఒక్కో కోడిపై సుమారు వెయ్యి వరకు లాభం వస్తోంది. ఫారం కోళ్లకు ఇచ్చే కొన్ని రకాల వ్యాక్సీన్లు ఈ కోళ్లకు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వీటికి నూకలు, తవుడు, మొక్కజొన్న పిండి అందించవచ్చు. అజోలా నాచును కూడా ఇవి ఎక్కువగా తింటాయి. వీటిని ఎక్కువగా అందిస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభం పొందవచ్చు.
ఎన్నో ఔషధ గుణాలు..
కడక్ నాథ్ కోళ్లలో ఎన్నో ఔషధ విలువలు ఉంటాయి. ఇవి బీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, ఆస్తమా, అధిక బరువు సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇందులో ఎన్నో వ్యాధి నిరోధక శక్తిని అందించే గుణాలు ఉన్నాయి. విటమిన్ బి1, బి2, బి6, బీ12, విటమిన్ సిలతో పాటు ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. కొవ్వు చాలా తక్కువగా కేవలం 1 శాతం మాత్రమే ఉంటుంది. ఈ కోడి మాంసంతో పాటు రక్తంలో ఎన్నో రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. మెలనిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి నల్లగా ఉంటాయి. ఇవి తినడం వల్ల మహిళల్లో అధిక రక్తస్రావం, ప్రసవానంతర సమస్యలు తగ్గుతాయి. గర్భిణులకు ఇది ఎంతో మంచిది. పురుషుల్లో నరాల బలహీనత, వ్యంధ్వత్వం వంటివి కూడా తగ్గుతాయి. ఈ మాంసానికి వయాగ్రాలా పనిచేసే లక్షణం కూడా ఉంటుంది. ఈ కోడి మాంసం న్యుమోనియా, ఎనీమియా, క్షయ, ఆస్తమా వంటి వ్యాధులను తగ్గించే గుణం కూడా ఈ మాంసానికి ఉంటుందట. ఈ కోడి రుచి కూడా అద్భుతంగా ఉంటుంది కాబట్టే లైన్లు కట్టి మరీ దీన్ని చాలామంది కొనుగోలు చేస్తున్నారట. హైదరాబాద్ చుట్టు పక్కల కడక్ నాథ్ కోడి మాంసంతో వండే కూరల షాపులు వెలిశాయి.
గుడ్లు కూడా.
ఈ కోడి మాంసమే కాదు.. గుడ్లు కూడా ఎన్నో పోషకాలు నిండి ఉంటాయి. వీటిలో ప్రోటీన్లు చాలా ఎక్కువ. కొవ్వు శాతం తక్కువ. సంవత్సరానికి ఈ కోళ్లు వందకు పైగా గుడ్లను పెడుతాయి. వీటిలో ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకుంటే ఆస్తమా, మూత్ర పిండాల సమస్య, నీరసం వంటివి తగ్గుతాయి. వయసు పైబడిన వారికి ఈ గుడ్లు చక్కటి ఆహారం. ఈ జాతి గుడ్డు ఒక్కొక్కటి రూ. 40 నుంచి రూ. 50 వరకు ఉంటుంది. ఈ కోడి ఆరు నెలల్లో గుడ్లు పెట్టడం ప్రారంభిస్తుంది. కడక్ నాథ్ కోళ్లకు గుడ్లు పొదిగే గుణం ఉండదు. అందుకే నాటు కోళ్ల గుడ్లతో కలిపి వీటిని పొదిగించాల్సి ఉంటుంది. లేదా ఇంక్యుబేటర్లను ఉపయోగించవచ్చు. ఇలా చేయడం వల్ల ప్రత్యేకంగా పిల్లల్ని కొనాల్సిన అవసరం లేకుండా లాభాలను పొందే వీలుంటుంది.
Share your comments