వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ మంచి లాభదాయకంగా ఉంటుంది. అందుకే రైతులు వ్యవసాయంతో పాటు పాడి పశువులను పెంచుతూ.. పాల ద్వార మంచి అదాయం పొందుతున్నారు. అయితే, ఒక్కోసారి పాలిచ్చే ఆవులు అనారోగ్యానికి గురై రైతులకు నష్టాలను మిగులుస్తున్నాయి. అలాంటి పశువుల అనారోగ్య సంబంధ వ్యాధుల్లో ‘పాడి పశువుల పొదుగు వాపు వ్యాధి’ ఒకటి. సాధారణంగా పశువులు పాలిచ్చే సమయంలో పశువులకు ఈ వ్యాధి సోకుతుంది. అందువల్ల పొదుగువాపు వ్యాధిని ముందుగానే గుర్తించి నివారణ చర్యలు తీసుకోకపోతే పశువులు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. అలాగే, పాల దిగుబడి సైతం తగ్గిపోతుంది. పాడి పశువులలో వచ్చే పొదుగువాపు వ్యాధి, దాని నివారణ చర్యల గురించి పశువైద్య నిపుణులు చెబుతున్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
పశువుల్లో పొదుగువాపు వ్యాధి లక్షణాలు:
పాడి పశువుల్లో సాధారణంగా పాలు ఇచ్చే సమయంలో పొదుగువాపు వ్యాధి వస్తుంది. పొదుగులోకి సుక్ష్మ జీవులు చేరడం వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుంది. సాధారణ దేశీయ జాతి అవులలో ఈ వ్యాధి సోకే ప్రమాదం తక్కువగా ఉంటుంది. కానీ అధికంగా పాలు ఇచ్చే వివిధ రకాల సంకర జాతి పశువులు ఈ వ్యాధి బారినపడే అవకాశం అధికంగా ఉంటుంది. పొదుగువాపు వ్యాధి మూడు రకాలుగా వ్యాపిస్తుంది. అందులో ఒకటి లక్షణాలు కనిపించకుండా వస్తుంది. దీనిని సబ్ క్లినికల్ అని అంటారు. దీని ప్రభావం పెరిగిన తర్వాత లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి వెంటనే చికిత్స అందించాలి. వ్యాధి ముదురక ముందే చికిత్స అందించకపోతే పొదుగు పూర్తిగా పాడైపోయే ప్రమాదం సైతం ఉంటుంది. పాలు నీరులా మారడం, విరగడం, అందులో తెల్లటి ముక్కలు కనిపించడం, పొదుగు వాచిపోవడం, పశువులు పాలు పిండనీయకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మరింత ముదిరితే పొదుగు గట్టిపడిపోతుంది.
పొదుగువాపు నివారణ చర్యలు:
పశువులకు పొదుగు వాపు వ్యాధి రాకుండా ఉండాలంటే.. పశువులను ఉంచే స్థలం లేదా కొట్టాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పాడి పశువులను నిత్యం కడుగుతూ ఉండాలి. పాలను పూర్తిగా పిండాలి. అలాగే, అప్పుడప్పుడు పాల పొదుగును గోరు వెచ్చని నీటితో కడగాలి. వ్యాధి సోకిన పశువులకు పశు వైద్యుల సలహా మేరకు చికిత్స అందించాలి. పొదుగువాపు వ్యాధిని గుర్తిస్తే వైద్యం అందించడంలో ఏమాత్రం ఆలస్యం చేయకూడదు.
Share your comments