ప్రస్తుతం మంచి ఆరోగ్యవంతమైన పాలు దొరకడం చాలా తక్కువ. గ్రామాలలో ఎంతో కొంత వరకు ఎటువంటి కల్తీ లేని ఆవు, గేదె పాలు అందుబాటులో ఉంటుంది. కానీ పట్టణాల వరకు వచ్చేసరికి అవి కాస్త నీళ్ల పాలుగా మారుతాయి. లాభం కోసం పాలలో నీళ్ళు కలిపే సమాజం ఇది. ఒక్క రూపాయి కూడా తక్కువ లేకుండా పాలు పోయరు. అలాంటిది ఓ వ్యక్తి ఉచితంగా ఆవు పాలని ఇస్తున్నాడు. అంతేకాకుండా అడిగితే తన దగ్గర ఉన్న ఆవును కూడా ఉచితంగా ఇస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో..? ఎందుకు ఇస్తున్నాడో..? తెలుసుకుందాం..
కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామానికి చెందిన ఆవుల శీను అనే రైతు. శ్రీశైలం నీటి ముంపు గ్రామమైన ఆ గ్రామంలో నివసిస్తున్న శ్రీనివాసులకు 500 ఆవులు ఉన్నాయి. ఇక ఎవరి దగ్గర ప్రతిఫలం ఆశించకుండా ఐదు సంవత్సరాల నుండి పాలను ఉచితంగా పోయడమే కాకుండా కుటుంబాలకు, దేవాలయాలకు, ఇతరులకు ఆవులను ఉచితంగా దానం చేస్తున్నాడు. ఈయన దగ్గర స్వచ్ఛమైన పాలు తీసుకోడానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్లంతా వస్తుంటారు. రూపాయి కూడా ఆశించకుండా వాళ్లకు పాలను ఇస్తున్నాడు.
ఆవులను కర్నూలు జిల్లాకు చెందిన వాళ్లకు మాత్రమే ఉచితం గా ఇస్తాడు. ఇక ఆవుకు దూడ జన్మిస్తే ఆవు తో పాటు దూడను కూడా ఇస్తాడు. ఇక మూడు నెలల పాటు పాలు ఇస్తుందని ఇక పాలు తగ్గిపోవడంతో వాటిని తిరిగి తనకు ఇవ్వమని చెబుతాడు . ఇక చాలామంది అతని దగ్గర ఆవులను తీసుకొని తమ జీవనాన్ని సాగిస్తున్నారు. ఒక ఆవు చాలకపోతే మరో ఆవును కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు శీను. అందుకే తనకు ఆవుల శీను అనే పేరు కూడా వచ్చింది.
ఇక ఈయన ఇలా అవ్వడానికి కారణం ఏంటంటే తన దగ్గర ఉన్న ఐదు వందల ఆవులను నిలుపుకునేందుకు, గడ్డి వేసుకునేందుకు సరైన సౌకర్యం లేదని తెలిపాడు. రెవెన్యూ అధికారుల స్థలం కేటాయిస్తే మరికొందరికి ఆవు పాలు, ఆవులను అందిస్తానని తెలిపాడు. ఇక ఇటీవలే జిల్లా ఎస్పీ కార్యాలయానికి కూడా ఒక ఆవును ఇచ్చాడట. తనకు రెండెకరాల భూమి కేటాయిస్తే ఆవులను మేపి తన వంతు సహాయం చేస్తానని కోరాడట. ఇక మొత్తానికి ఈయన సహాయం పట్ల ఎంతో మంది లాభ పడటమే కాకుండా ఈయనపై తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు.
Share your comments