Animal Husbandry

కోడి పిల్లల మరణాల నివారణకు పాటించాల్సిన యజమాన్య పద్ధతులు

KJ Staff
KJ Staff
chicks arrival
chicks arrival

డా|| టి. విజయ నిర్మల, డా|| వి. దేవి వర ప్రసాద్ రెడ్డి, బి. శాలిరాజు,

డా|| కె. వెంకట సుబ్బయ్య, డా|| వి. దీప్తి, డా|| ఇ. కరుణ శ్రీ , డా|| బి. శ్రీనివాసులు, కృషి విజ్ఞాన్ కేంద్రం, డా|| వై.ఎస్, ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, పిన్ కోడ్ - 534101

కోళ్ల పెంపకందారులు కోడి పిల్లల్లో మరణాల శాతం ఎక్కువగా ఉండడం వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా పిల్లల మొదటి వారం చాలా సమస్యాత్మకంగా ఉంటుంది. ఈ దశలో పిల్లలు సున్నితంగా ఉండి తక్కువ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి కోళ్ల పెంపకం దారులు ఈ సమయంలో అత్యంత అప్రమత్తంగా ఉండి మేలైన యజమాన్య పద్ధతులను అవలంభించాలి.

కోడి పిల్లల్ని తీసుకు వచ్చే ముందు కోళ్ల ఫారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* ఫారం చుట్టూ 5 నుంచి 10 అడుగుల వరకు పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలి.

* షెడ్ చుట్టూ ప్రదేశంలో కీటక నివారణ మందులు స్ప్రే చేయాలి.

* నీళ్ల ట్యాంకులు, పైపు లైన్లలోని నీటిని పూర్తిగా తొలగించి బ్లీచింగ్ పౌడర్ తో శుభ్రం చేయాలి.

* కొత్త బ్యాచ్ కోడి పిల్లలు వచ్చే 15 రోజుల ముందుగా కోళ్ల షెడ్ ని శుభ్రపర్చడం ప్రారంభించాలి. శుభ్రపర్చిన తర్వాత కొత్త బ్యాచ్ రావడానికి మధ్య కనీసం ఏడు రోజుల వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

* ఫారంలోని సైడ్ గోడలకు వాడే ప్లాస్టిక్ రకం లేదా గోనె సంచులను తీసివేసి, లోపల ఉన్న దుమ్ము, ధూళి, ఈకలు, రెట్ట మొదలైన వాటిని పై కప్పు, కింద, పక్క గోడలు, చూర్లు మొదలైన ప్రాంతాల్లో శుభ్రం చేయాలి. ఆ తర్వాత నీటితో శుభ్రంగా కడగాలి. లిట్టర్, కోళ్ల స్రావాలు వంటి ఆర్గానిక్ పదార్థాలను గార పట్టడం, ఉప్పు పట్టడం వంటి ఇనార్గానిక్ పదార్థాలను పూర్తిగా తొలగించడానికి ఆమ్ల, క్షార లక్షణాలు రెండూ ఉన్న క్రిమి సంహారక మందులతో శుభ్రం చేస్తే అధిక ప్రయోజనం ఉంటుంది.

* 20 మి.లీ ఫార్మలిన్, 10 గ్రాముల పొటాషియం పర్మాంగనేట్, ఒక క్యూబిక్ మీటర్ స్థలానికి చొప్పున వాడుతూ ఫ్యూమిగేషన్ చేయాలి. 40 లీటర్ల నీటిలో 160 మి. లీ బి-90 కానీ, ఎక్స్-185 గానీ కలిపి 100 చదరపు అడుగుల విస్తీర్ఱం చొప్పున స్ప్రే చేయడం ద్వారా డిస్ ఇన్ఫెక్షన్ చేయవచ్చు.

* థర్మల్ ఫాగింగ్ ఈ రెండు పద్ధతుల కంటే సులువైనది. కాక్సి ఊసిస్ట్ లు, మారెక్స్ వ్యాధి, గంబోరో వ్యాధి వైరస్ ల నిర్మూలనకు ఈ పద్ధతి ఉత్తమమైనది. ఒక వేళ కింద నేల మట్టిదైతే ఉపరితలంగా ఉన్న మట్టిని లిట్టర్ తో సహా తీసివేసి కొత్త మట్టిని వేయాలి. నేల ఆరిన తర్వాత కొత్త లిట్టర్ ని 3 నుంచి 5 సెంమీ ల మందంలో ఏర్పాటు చేయాలి. ఈ లిట్టర్ పై పాత పేపర్లు పరిచి ఉంచితే పిల్లలు లిట్టర్ తినే ప్రమాదం ఉండదు.

* కోళ్ల షెడ్ లో వాడే మేత తొట్లు, నీటి తొట్లు, ఇతర పరికరాలను బయో సాల్వ్ వంటి క్రిమి సంహారక మందులతో శుభ్రపర్చుకోవాలి.

* ఫారంలో ఏవైనా పగుళ్లు, రంధ్రాలుంటే వెంటనే మూసేసి ఎలుకల వంటివి రాకుండా చూడాలి.

* పిల్లలు రావడానికి రెండు రోజుల మందే దాణాని సిద్ధం చేసుకొని ఉంచాలి.

కోడి పిల్లల్ని తీసుకు వచ్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు

* హుషారుగా, చురుకుగా, మంచి బరువున్న నాణ్యమైన కోడి పిల్లల్ని మాత్రమే ఎంచుకోవాలి. రవాణా సమయం తక్కువగా ఉండాలి.

* పిల్లల బరువు తెలుసుకోవడానికి బాక్స్ తో సహా తూకం వేయాలి.

* పిల్లలను చిక్ గార్డుల లోపల మసక వెలుతురులో జాగ్రత్తగా ఒత్తిడికి లేనవ్వకుండా దించాలి. ఆ తర్వాత పూర్తి వెలుతురు అందించాలి (కొత్త వాతావరణం, రవాణా వంటి కారణాల వల్ల పిల్లలు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. దాని నివారణకు 15 గంటల పాటు తాగే నీళ్ల ద్వారా యాంటీ బయోటిక్ మందులను (లీటర్ నీటికి ఒక గ్రాము చొప్పున), బీ కాంప్లెక్స్ (100 పిల్లలకు 30 మి.లీ చొప్పున), విటమిన్ ఎ, డి, ఇ, సి ద్రావణాన్ని (100 పిల్లలకు 5 మిల్లీ లీటర్లు చొప్పున) అందించాలి.

* పిల్లల సంఖ్యను బట్టి బ్రూడింగ్ ను అమర్చుకోవాలి. ఎలక్ట్రిక్ బ్రూడర్ వాడుతుంటే 250 నుంచి 300 పిల్లలకు ఐదు అడుగుల వ్యాసం, 2.5 అడుగుల ఎత్తు ఉండి రేకు లేదా కార్డ్ బోర్డ్ తో చేసిన రక్షణ కవచం (చిక్ గార్డ్) లను చిన్న పిల్లలు మేత, నీటి పాత్రలు, ఉష్ణోగ్రత నుంచి దూరంగా వెళ్లకుండా పిల్లల చుట్టూ గుండ్రంగా ఏర్పాటు చేయాలి.

* ఒక వారం రోజుల పాటు రోజూ చిక్ గార్డును దూరంగా జరుపుతూ పోతుండాలి. పది రోజుల తర్వాత చిక్ గార్డ్ ని తీసివేయవచ్చు. గ్యాస్ బ్రూడర్ వాడుతున్నట్లైతే 2500 పిల్లలకు ఒక బ్రూడర్ అమర్చుకోవాలి.

* మేత, నీటి తొట్లను ఒక దాని తర్వాత ఒకటి సరిసంఖ్యలో ఏర్పాటు చేయాలి. పిల్లలను బ్రూడర్ లో వదిలేటప్పుడు వాటి ముక్కులను నీటిలోను, మేతలను ముంచి వదిలితే వాటికి రుచి బాగా తెలిసి మేత, నీటిని సరిగ్గా తీసుకుంటాయి.

* మొదటి 2,3 రోజులు పిల్లలు ఆహారం తినలేనందున లిట్టర్ పైన ఉన్న పేపర్ పై నలగగొట్టిన గింజలను లేదా దాణాను చల్లాలి. రెండు రోజుల తర్వాత కోళ్ల మేతను మేత పాత్రల ద్వారా అందించాలి. మేత పాత్రలను పూర్తిగా కాకుండా సగం వరకు మాత్రమే నింపి పెడితే పిల్లలు మేతను కాళ్ల తోను, ముక్కుల తోను బయటకు తోడి పోయవు.

* చిక్ దశలో పిల్లలకు సరిపోను ఉష్ణోగ్రతను అందించడం ద్వారా కోడి పిల్లల్లో వృద్ధి, ఎదుగుదల బాగుంటుంది. బ్రూడింగ్ సమయంలో బ్రూడర్ కింద ఉష్ణోగ్రత మొదటి వారం 95 డిగ్రీల ఫారన్ హీట్ ఉండి, ప్రతి వారం 5 డిగ్రీల ఫారన్ హీట్ తగ్గిస్తూ 75 డిగ్రీల ఫారన్ హీట్ వచ్చేవరకూ చేయాలి. ఎనిమిది వారాల తర్వాత సాధారణ ఉష్ణోగ్రత సరిపోతుంది. బ్రూడర్ ఉండే ఫారంలో కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఉష్ణోగ్రత నిలకడగా ఉండాలి.

* రక్తపారుడు రోగం (కాక్సిడియోసిస్) రాకుండా మేతలో యాంఫ్రాల్ కానీ, బై పురాన్ కానీ తగిన మోతాదులో పొందుపర్చాలి.

* కొక్కెర తెగులు సోకకుండా మొదటి వారం లోపలే లసోటా టీకాను, గంబోరో వ్యాధి నివారణకు రెండో వారంలో బి2కె టీకాను వేయించాలి.

* 15 రోజుల వయసు లోపలే పిల్లలకు ముక్కులు కత్తిరించడం (డీబీడింగ్) వల్ల ఒక దానికొకటి పొడుచుకొని మరణించకుండా కాపాడవచ్చు.

* తడి లిట్టర్ ని ఎప్పటికప్పుడు తొలగిస్తుండాలి. పాత లిట్టర్ ను వాడకూడదు.

* బ్రూడింగ్ దశలో ఉష్ణోగ్రతలో వ్యత్యాసం, దాణా, నీటి పాత్రల ఏర్పాటు, సంఖ్య, స్థలం కేటాయింపు, లిట్టర్ లో అమ్మోనియా సాంద్రత మొదలైనవి సక్రమంగా లేకుంటే తొక్కిసలాట జరిగి కోడి పిల్లలు మరణించే ప్రమాదం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి.

* ఫారంలోనికి కుక్కలు, పిల్లులు, ఎలుకలు, పాములు రాకుండా జాగ్రత్త వహించాలి.

* వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు, కోళ్ల షెడ్ ముందు క్రిమి సంహారక మందులతో పుట్ బాత్ ఏర్పాటు చేయాలి.

డా|| వై.ఎస్, ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, పిన్ కోడ్ - 534101

Share your comments

Subscribe Magazine