Kheti Badi

పెసర పంటలో పురుగుల ఉదృతి, సకాలంలో నివారించడం ఎలా?

KJ Staff
KJ Staff

తక్కువ ఖర్చుతో సకాలంలో చేతికి వచ్చే పంట ఏదైనా ఉందంటే అది పెసర పంట. పెసరను ఖరీఫ్లో వర్షాధారిత పంటగా సాగు చేస్తారు. పెసర పంట రైతులకు ఆర్ధికంగా చేయూతనందించడంతో పాటు, భూసారాన్ని కూడా పెంపొందిస్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లోని రైతులు పెసర పంట సాగును ప్రారంభించారు, ప్రస్తుతం పెసర పూత మరియు పిందె దశలో ఉంది. ఈ ఏడాది వర్షాలు ఎక్కువ దానితో పెసరలో చీడపీడల సమస్య ఎక్కువుగా ఉందని రైతులు చెబుతున్నారు. ముందస్తు చర్యలు పాటిస్తే పెసరను రోగాల భారిన పడకుండా కాపాడవచ్చు.

పెసరను ఎక్కువుగా వర్షాధార పంటగా సాగు చేస్తారు. నీటి పారుదల ఉన్న చోట్ల మూడు కాలాల్లోనూ సాగు చెయ్యడానికి అనువుగా ఉంటుంది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కంది తరువాత పెసరను అధిక విస్తీర్ణంలో సాగు చేస్తారు. జూన్ ఆరంభంలో విత్తిన పెసర పంట ఇప్పుడు పిందె మరియు కాయ దశలో ఉంది. అయితే అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా, పంటలను కొన్ని రకాల చీడపీడలు ఆశించాయి, వీటిలో లద్దెపురుగు మరియు మారుకా మచ్చల పురుగు ప్రధానమైనవి. వీటిని గుర్తించిన వెంటనే తగిన నివారణ చర్యలు పాటించవలసి ఉంటుంది.

పెసర పంటను మారుకా మచ్చల పురుగు ఆశించి రైతులను ఆర్ధికంగా నష్టపరుస్తుంది. ఆకాశం మేఘావృతమవ్వడం, చిరుజల్లులు పడటం మరియు అధిక వాతావరణ తేమ ఈ పురుగు ఆశించడానికి కారణమవుతుంది. ఈ పురుగు మొక్క మొగ్గ మరియు పూత దశలో ఆశించడం వలన దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. పూత దశలో పూలను గుడుగా చేసుకొని లోపలి భాగాన్ని తింటుంది, అదేవిధంగా కాయ దశలో ఉన్నప్పుడు కాయల్లో రంద్రం చేసి లోపలి గింజలను తినడం ద్వారా దిగుబడి నాణ్యత తగ్గిపోవడం జరుగుతుంది. మారుకా మచ్చల పురుగు ఉదృతిని గమనించిన వెంటనే, క్లోరోపైరిఫోస్ 2.5 మి.లి లేదా డైక్లోరోవాస్ 1 మి.లి లీటర్ ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యాలి. మందులను మర్చి మర్చి వాడటం వలన పురుగులు మందులకు అలవాటు పడకుండా ఉంటాయి.

అదేవిధంగా లద్దెపురుగు కూడా పెసర పంటకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఈ పురుగు పచ్చిరొట్టను  ఎక్కువుగా ఇష్టపడుతుంది కాబట్టి, ఆకుల అడుగు భాగాన చేరి అక్కడ గుడ్లు పెడుతుంది. గుడ్ల నుండి పొదిగిన పిల్లలు ఆకులలో పచ్చటి భాగాన్ని తినేస్తాయి, దీనివలన జల్లెడ ఆకులు ఎక్కువుగా కనబడతాయి. రెండో దశ లార్వాలు ఆకులను మరియు మొగ్గలను ఆశించి పంటకు నష్టం కలిగిస్తాయి. దీనిని నివారించడానికి క్లోరోఫైరిఫోస్ 2.5 మి.లి ఒక లీటర్ నీటికి కలిపి మొక్కల పిచికారీ చెయ్యాలి. దీనితోపాటు ఎసిఫేట్ 1.5 గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చెయ్యడం ద్వారా కూడా దీనిని నివారించవచ్చు. పెద్ద లార్వాలు గమనించినప్పుడు థయోడికార్బ్ 1 గ్రాము మందును ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేస్తే లద్దె పురుగును నివారించడానికి అవకాశం ఉంటుంది.

Share your comments

Subscribe Magazine