కాయగూరల్లో టమోటాను ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే నిజానికి టమోటా ఒక కాయగూర కాదు, ఇది ఒక పండు, అయినాసరే టమాటా లేకుండ చాలా కూరల్ని ఉహించుకోలేము. ఎర్రగా నిగనిగలాడుతూ కనిపించే టమాటాను అన్ని రకాల కూరల్లోనూ విరివిగా వినియోగిస్తారు. మార్కెట్ ధరల్లో హెచ్చుతగ్గులున్నసరే ఎంతోమంది రైతులు దీనిని సాగు చెయ్యడానికి ఆశక్తి చూపుతారు. టమాటా సాగుకు శీతాకాలం అనుకూలం. అయితే ఖరీఫ్ సీజన్లో కూడా సాగు చేసుకునేందుకు వీలుగా ఎన్నో రకాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి.
ఇటీవల కాలంలో రైతులకు లాభం చేకూర్చే ఎన్నో మేలు జాతి రకాలు రైతులకు అందుబాటులోకి వచ్చాయి, వీటికి మార్కెట్లో అధిక డిమాండ్ ఉండటంతో రైతులు వీటిని సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే టమాటను ఎన్నో రకాల చీడపీడల సమస్యలు పట్టిపీడిస్తాయి, వీటిలో సెనగపచ్చ పురుగు ఒకటి. దీని ఉదృతి ఎక్కువైతే, అధిక మొత్తంలో పంట నష్టపోయే ప్రమాదం ఉంటుంది. టమాటా పంట ఎంతో సున్నితమైనది, దీనిని సాగు చేసే రైతులు టమాటాలో ప్రధానంగా వచ్చే చీడపీడల మీద మరియు వాటి సస్యరక్షణ చర్యల మీద అవగాహన కలిగి ఉండాలి. టమాటాలో తెగుళ్లు మరియు చీడపీడల బెడద ఎక్కువగా ఉండటంతో వీటిని నివారించడానికి సరైన పద్దతిలో సస్యరక్షణ చర్యలు పాటించాలి.
టమోటా పంట ప్రారంభించిన 15-20 రోజుల దశలో సెనగపచ్చపురుగు మొక్కలను ఆశిస్తుంది. టమాటా సమీప పొలాల్లో కంది పంట సాగు చేస్తున్నట్లైతే దీని బెడద మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ పురుగులు, చెట్ల యొక్క లేత ఆకులను తింటూ పంటకు తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. ఈ పురుగులు ఆకులను తినడంతో పాటు క్రమంగా కాయలమీదకు చేరి వాటిలోని గుజ్జును తింటాయి, దీనివలన కాయలు కుళ్లిపోయి, మార్కెట్ చెయ్యడానికి పనికిరాకుండా పోతాయి.
పొలంలో ఈ పురుగుల ఉదృతిని ఒక కంట కనిపెట్టేందుకు, పొలాల్లో అక్కడక్కడా లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చెయ్యాలి. ఈ పురుగును నివారించించేందుకు, మొక్కలు నాటేముందు పొలం మొత్తం వేపపిండి వెయ్యాలి, దీనివల్ల పురుగుల గుడ్లు నిర్ములించబడతాయి. టమోటా మొక్కల మధ్యలో అక్కడక్కడా బంతిపూలను నాటుకోవడం ద్వారా పురుగు ఉదృతి కొంతమేరకు తగ్గుతుంది. పురుగులను గమనించిన వెంటనే మొక్కల మీద వేపనూనెను నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగులు తొలిదశలో ఉన్నప్పుడు ప్రొపినోఫాస్ 2 మి.లీ. లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మి.లీ. లేదా థయోకార్బ్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పురుగుల ఉదృతి ఎక్కువుగా ఉంటే ఇమామెక్టిన్ బెంజోయెట్ 5 గ్రా. లేదా ట్రేసర్ 4 మి.లీ. లేదా ఫ్లూబెండమైడ్ 4గ్రా. 10 లీటర్ల నీటికి కలిపి మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఈ యాజమాన్య పద్దతులను పాటించడం ద్వారా సెనగపచ్చ పురుగును సమగ్రవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.
Share your comments