కొన్ని రకాల పంటలను సాగు చేయడం వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుంది. మార్కెట్ లోనూ మంచి డిమాండ్ ఉంటుంది. కాబట్టి రైతులు అలాంటి పంటలను సాగుచేయాలని వ్యవసాయ నిపుణలు చెబుతున్నారు. అలాంటి పంటల్లో కాలీఫ్లవర్ ఒకటి. కాలీఫ్లవర్ లో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా అధికంగా సీ విటమిన్ తో పాటు కె విటమిన్, పోటాషియం, మాంగనీస్, ప్రొటీన్, రైబోప్లేవిన్, మోమిన్ లు ఉన్నాయి. అందువల్ల కాలీఫ్లవర్ ను ఆహారంగా తీసుకోవడంతో శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గుండె సంబంధిత వ్యాధులు, వివిధ రకాల క్యాన్సర్ల ప్రభావాన్ని సైతం కాలీఫ్లవర్ తగ్గిస్తుంది. అందువల్ల దీనికి మార్కెట్ డిమాండ్ అధికంగానే ఉంటుంది. అలాంటి కాలీఫ్లవర్ ను ఎలా సాగు చేయాలో వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఇప్పటికే సాగు చేస్తున్న రైతులు వెల్లడించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
కాలీఫ్లవర్ ను సాగు చేయడానికి అన్ని రకాల తేలికపాటి నేలలు అనుకూలంగా ఉంటాయి. ఎర్రనేలలు, దుబ్బనేలలతో పాటు ఒండ్రునేలలు, బంకమట్టి నేలల్లో కూడా దీనిని సాగు చేయవచ్చు. ఏడాదిలో రెండు పంటల కాలల్లో సాగు చేయవచ్చు. వర్షాకాలంలో జులై, ఆగస్టు మాసాల్లో నాటుకోవచ్చు. అలాగే, సెప్టెంబర్, నవంబర్ మాసాల్లోనూ నాటుకోవచ్చు. ఆయా కాలల్లో పంటను సాగు చేయడానికి నేలను రెండు మూడు సార్లు దున్నుకోవాలి. నేలను తయారు చేసుకునే ముందు ఎకరాకు 10 టన్నుల పశువుల ఎరువును, 100 కిలోల వేపపిండి, 300 కిలోల బోకాషి, ఒక కిలో సుడోమోనాస్ ను కలుపుకుని నేలను సిద్ధం చేసుకునే సమయంలో దుక్కిలో వేసుకోవాలి. ఆ తర్వాత నేలను చదునుగా దున్నుకోవాలి. మొక్కలు నాటడానికి అనుకూలంగా బోదేలు తయారు చేసుకోవాలి. నేల తయారీ సమయంలో పై ఎరువులు వేసుకోవడం వల్ల పంట నాణ్యత మెరుగ్గా ఉంటుంది. చీడపీడలు సైతం రాకుండా ఉండి, దిగుబడి పెరుగుతుంది.
ప్రస్తుతం మార్కెట్ మూడు రకాల కాలీఫ్లవర్ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. అవి స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు ఉన్నాయి. వాటిల్లోంచి మన సాగు చేసే నేలకు అనువైన రకాలను ఎంచుకోవాలి. ఒక ఎకరం పొలానికి దాదాపు 300 నుంచి 350 గ్రాముల వరకు విత్తనాలు సరిపోతాయి. విత్తనాలను విత్తుకోవడానికి ముందు రోజు విత్తన శుద్ధి చేయాలి. దీని కోసం 4 గ్రాముల ట్రైకోడెర్మావిడిని ఉపయోగించుకోవాలి. నారు మొక్కలకు నిత్యం నిరందించాలి. నారు మొక్కలను సాగు చేసే పొలంలో మొక్కకు మొక్కకు మధ్య దూరం 45 సెంటీమీటల్లు ఉండేలా నాటుకోవాలి. మొక్కల పెరుగుదలకు అనుగుణంగా నీరు పెట్టాలి. కలుపు లేకుండా చూసుకోవాలి.
Share your comments