పంట దిగుబడి పెరగడానికి మరియు నాణ్యమైన ఉత్పత్తిని పొందడానికి, పంట యజమాన్య పద్దతులతోపాటు ఎరువుల వినియోగంలో కూడా సరైన జాగ్రత్తలు పాటించాలి. పంటకు అవసరమైన పోషకాలను అందించే ఎరువులను రెండు రకాలుగా విభజిస్తారు, స్థూలపోషకాలు మరియు సూక్ష్మ పోషకాలు. స్థూలపోషకాలైన నత్రజని, భాస్పరం మరియు పోటాష్ మొక్క ఎదుగుదలలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. వీటిలో పోటాష్ ఎరువుకున్న ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పోటాష్ యొక్క అవసరం పంట నాటిన దగ్గరనుండి పంట చివరి దశవరకూ ఉంటుంది, మరీముఖ్యంగా పంట ఏపుగా ఎదిగే దశలో, మరియు గింజ తయారయ్యే దశలో దీని యొక్క ఉపయోగం ఎక్కువగా ఉంటుంది. పంట ఉత్పాదకత పెంచే పోషకాల్లో పోటాష్ ముఖ్యమైనది. మొక్కల్లో జీవరసాయన క్రియలను నియంత్రించడం, కిరణజన్య సంయోగక్రియలో ఏర్పడిన పిండి పదార్ధాలను అన్ని భాగాలకు పంపించడం, పాత్ర రంద్రాలు తీర్చుకొని మూసుకొనేలా చెయ్యడం, ఎంజైమ్లను ప్రేరేపించడం మొదలైన పనులన్నీ పూర్తిచెయ్యడంలో పోటాష్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే మిగిలిన స్థూలపోషకాల మోతాదుతో పోలిస్తే పోటాష్ మోతాదు తక్కువ, సాధారణంగా ఒక టన్ను ఉత్పత్తికి 8-12 కిలోల పోటాష్ ఎరువు అవసరం అయితే ఈ మొత్తం పంటను బట్టి మరియు మట్టి తత్వాన్ని ఆధారితం చేసుకొని మారుతూ ఉంటుంది.
నూనె పంటల సాగులో పోటాష్ అవసరం చాలా ఎక్కువుగా ఉంటుంది. గింజలు గట్టి బరువు కలిగి ఉండేందుకు, మరియు నూనె శాతం పెరగడానికి పోటాష్ సహాయం చేస్తుంది. ధాన్యపు మొక్కల కాండం గట్టిపడటానికి, పంటకు శక్తీ లభించి పురుగులు మరియు తెగుళ్లను సమగ్రవంతంగా ఎదుర్కోవడంలో పోటాష్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా పప్పుజాతి మొక్కల్లో నత్రజనిని స్థిరీకరించడం, నీటి ముంపుకు గురైన మొక్కలో సంభవించే ఇనుపధాతువు యొక్క లోపాన్ని నివారించడం మొదలైనవి పోటాష్ యొక్క కీలక ఉపయోగాలు.
పోటాష్ ఎరువును సరైన సమయంలో, మరియు సరైన పద్దతిలో అందించవలసి ఉంటుంది. ఇందుకోసం ముందుగా భూసార పరీక్షను నిరవహించవలసి ఉంటుంది, భూసారపరిక్ష ఆధారంగా పోటాష్ ఎరువులను వాడవలసి ఉంటుంది. పంట తొలిదశలో 30% మరియు కాత, పూత దశలో మిగిలిన 70% పోటాష్ ను వినియోగించాలి. పంటల్లో వచ్చే పోటాష్ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా గుర్తించవచ్చు. పోటాష్ లోపమున్న మొక్కల్లో ఆకులు అంచులు ఆకుపచ్చ రంగులోకి మారి క్రమంగా పసుపుపచ్చ రంగులోకి మారి ఎండిపోతాయి. ఇటివంటి మొక్కలో ఎదుగుదల క్షిణించడమే కాకుండా కాండం బలహీనపడుతుంది, మొక్క బలహీనంగా మారి చివరికి దిగుబడి మీద ప్రభావం చూపుతుంది. ఇటువంటి లక్షణాలు గమనించిన వెంటనే సాధారణంగా ఒక ఎకరానికి పంట కాలం మరియు రకాన్ని బట్టి 16 నుండి 50 కిలోల వరకు పోటాష్ ఎరువు అవసరముంటుంది. ఈ ఎరువును జీవన ఎరువులు మరియు రసాయన ఎరువుల ద్వారా అందించవచ్చు, అయితే జీవన ఎరువుల్లో పోటాష్ మోతాదు కొద్దిశాతం మాత్రమే ఉంటుంది. కాబట్టి రసాయన ఎరువుల్ని నిర్ణిత పరిమాణంలో వినియోగించాలి. ఇవి ద్రవ రూపంలో మరియు కాంప్లెక్స్ ఎరువులాగా అందుబాటులో ఉన్నాయి.
Share your comments