పశు గ్రాస కొరత సమయంలో పాడి పశువుల మేతగా మాగుడు గడ్డి
డా|| టి. విజయ నిర్మల, డా|| ఎ. దేవి వరప్రసాద్ రెడ్డి, జి. శాల రాజు, డా|| కె. వెంకట సుబ్బయ్య, డా|| వి. దీప్తి, జె. వెంకట సతీష్, డా|| బి. శ్రీనివాసులు, కృషి విజ్ఞాన్ కేంద్రం, డా|| వై.ఎస్, ఆర్ ఉద్యాన విశ్వ విద్యాలయం, వెంకటరామన్న గూడెం, పశ్చిమ గోదావరి జిల్లా, పిన్ కోడ్ - 534101
వరి గడ్డిలో పోషక పదార్థాల విలువ తక్కువగా ఉన్నా ప్రత్యామ్నాయ గ్రాసాలు లేనందున పచ్చి మేత కొరత ఉన్న సందర్భాల్లో రైతులు పాడి పశువులకు వరి గడ్డిని మేపక తప్పడం లేదు. పూర్తిగా వరి గడ్డి పై ఆధారపడి ఎదిగిన పశువులకు కనీసం ఒకటిన్నర కిలోల మిశ్రమ దాణాను సమకూర్చనిదే శరీర పోషణకు కావాల్సిన మాంసకృత్తులు అందడం లేదు. ఆహార పంటల ప్రాముఖ్యత పెరుగుతున్న కొద్దీ వరి పైరు కోసిన పొలాల్లో రెండో పంటగా వరి పైరును కానీ పెసర, మినుము లాంటి వాణిజ్య పంటలపై ఆసక్తి పెరగడంతో పశువులకు వేసవిలో పశుగ్రాసాల కొరత ఏర్పడి పశువుల పోషకాహార పదార్థాల కనీస అవసరాల్ని కూడా సమకూర్చుకోలేకపోయే పరిస్థితి ఏర్పడింది.
ఎండు మేతగా వరి గడ్డి, జొన్న చొప్ప, మొక్క జొన్న చొప్ప, జనుము చొప్ప మొదలైనవి మేపుతారు. మన రాష్ట్రంలో వరి గడ్డి ముఖ్యమైన ఎండు మేత. ఇవి కేవలం పశువు కడుపు నింపడానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగపడతాయి. అంటే పాల ఉత్పత్తికి, దూడల పెరుగుదలకు, సంతానోత్పత్తికి, ఇతర అవసరాలకు చాలా తక్కువగా ఉపయోగపడతాయి. అదీ కాక ఈ ఎండు మేతలు రుచికరంగా ఉండకపోవడంతో పశువులు కూడా అయిష్టంగా తింటాయి. ఈ ఎండు మేతల్లో మాంసకృత్తుల శాతం తక్కువగా ఉంటుంది. ఇవి రుచిగా ఉండకపోవడమే కాదు.. అరుగుదల శాతం కూడా తక్కువగా ఉంటుంది. అందుకే వీటిని యూరియా ద్రావణంతో సుపోషకం చేసుకొని రుచిగా తయారు చేసుకోవడం ద్వారా సద్వినియోగపర్చుకోవచ్చు.
ఎండు మేతను యూరియా ద్రావణంతో తడిపి మేపుకోవడం
నాలుగు కిలోల యూరియాను 60 లీటర్ల నీటిలో కలిపి 100 కిలో గ్రాముల వరి గడ్డి పై చల్లితే రసాయనిక చర్యలకు అనుకూలమైన తేమను పొందవచ్చు. గడ్డిని పొరలు పొరలుగా పరిచి ఒక్కొక్క పొర మీద యూరియా ద్రావణాన్ని చల్లి, ఆ గడ్డిని సిమెంట్ వరల్లో గానీ, తొట్టెలో కానీ, గోతిలో కానీ నింపాలి. గోతిలో నిల్వ చేయాలనుకుంటే కొంత భాగం భూమి లోపల, కొంత భాగం భూమి పైన ఉంటేటట్లుగా గోతిని తవ్వి ఇటుక గోడను చుట్టూ కట్టి సిమెంటుతో పూత పూయాలి. గోతిని నింపిన తర్వాత లోనికి గాలి చొరబడకుండా పై భాగాన్ని టార్పాలిన్ గానీ, పాలిథిన్ షీట్ తో గానీ కప్పి గాలికి ఎగరకుండా పైన బరువు పెట్టాలి. ఈ ప్రక్రియ కొంత ఖర్చుతో కూడుకున్నది అయినా ఉత్తమమైనది. 15 రోజుల వరకు ఇలా గడ్డిని మగ్గనిచ్చి ఆ తర్వాత ఈ మాగుడు గడ్డిని పశువుకి మేపుకోవచ్చు.
యూరియా కలపడం వల్ల ఉపయోగాలు
1. యూరియా ద్రావణంలో తడిపి మాగబెట్టిన వరి గడ్డిలో సున్నా శాతంగా ఉన్న మాంసకృత్తులు నాలుగు శాతం వరకు పెరుగుతాయి.
2. వరి గడ్డిలోని సులభంగా జీర్ణం కాలేని పీచు పదార్థం ఈ ప్రక్రియ ద్వారా ఎక్కువగా జీర్ణం అవుతుంది.
3. మామూలు వరి గడ్డి కన్నా యూరియాతో మాగబెట్టిన వరి గడ్డిని పశువులు ఎక్కువ మోతాదులో తింటాయి.
4. కరువు సమయంలో లేక పచ్చి మేత కొరత సమయంలో పాడి పశువులకు రోజుకు 10 నుంచి 12 కిలోల వరకు మాగుడు గడ్డిని మేపి శరీర పోషణకే కాక ఒకటి రెండు లీటర్ల పాల దిగుబడికి సరిపోయే మాంసకృత్తులను కూడా సమకూర్చుకోవచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* గోతి నుంచి తీసిన మాగుడు గడ్డిని సుమారు నాలుగు లేదా ఐదు గంటల పాటు గాలిలో ఆరబెట్టిన తర్వాతనే పశువులకు మేతగా వాడాలి. లేకపోతే వరి గడ్డిలో రసాయనిక చర్యలకు గురికాని మిగులు అమోనియా వాయువు ఘాటు వాసన కలిగి ఉంటుంది కాబట్టి మేత సమయంలో పశువుల కళ్లకు ఇది హాని కలిగించవచ్చు.
* యూరియాను పరిమిత మోతాదులోనే అనగా 100 కిలోల వరి గడ్డికి, నాలుగు కిలోల యూరియా, 60 లీటర్ల నీటిని మాత్రమే వాడాలి. లేకపోతే విషపూరితమై పశువు ఆరోగ్యం పాడవుతుంది.
* ఈ ప్రక్రియ ద్వారా పూర్తి ప్రయోజనం పొందాలంటే యూరియాలో మాగబెట్టిన వరి గడ్డిలోని తేమ శాతం 50 శాతానికి తగ్గకుండా జాగ్రత్త పడాలి.
ఉత్సాహవంతులైన రైతులు ఈ ప్రక్రియను అమలు చేసి మాగుడు గడ్డిని తయారు చేసుకొని ఎండాకాలంలో, కరువు సమయంలో తమ పశువులకు మేపుకొని పాడి పశువుల పోషణ భారాన్ని తగ్గించుకొని పాడి పరిశ్రమను లాభసాటిగా కొనసాగించుకోవచ్చు.
Share your comments