ఒక్క మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా భారత దేశం మొత్తం వరి ప్రధానమైన పంట. వరి పంట మీద పరిశోధన పెరగడంతో అన్ని వాతావరణ పరిస్థితులకు అనువైన రకాలు అందుబాటులోకి వచ్చాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని రైతులు ఇప్పటికే వరి సాగును ప్రారంభించారు, మిగిలిన రైతులు వరి నాట్లు నాటుకోవడానికి సంసిద్ధమయ్యారు. అయితే వరి సాగు చేపట్టే రైతులు కొన్ని జాగ్రత్తలు పాటించవలసి ఉంటుంది, వరి పైరులో చీడపీడలు మరియు ఎరువుల యాజమాన్యం పట్ల రైతులు ప్రత్యేక శ్రద్ధ పాటించవలసి ఉంటుంది.
పంట బాగా ఎదిగి, మంచి దిగుబడి పొందడానికి, పంట పైరు దశలో ఉన్నప్పుడు సరైన యాజమాన్య పద్దతులు పాటించవలసి ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వరినార్లు పొసే కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతుంది, కొన్ని ప్రాంతాల్లో నారును పెంచి ఎదిగిన మొక్కలను నాటుకుంటారు, మరికొన్ని ప్రాంతాల్లో నేరుగా విత్తే పద్దతిని అనుసరిస్తారు. అయితే పద్దతి ఏదైనా సరే వరి నారులో పురుగులు మరియు చీడపీడల సమస్య ఎక్కువుగా ఉంటుంది, వీటిని నివారించడానికి సమగ్రయజమాన్య చర్యలు పాటించాలి. దీనితోపాటుగా ఎరువుల యాజమాన్యం కూడా సరైన పద్దతిలో చేప్పట్టవలసి ఉంటుంది.
ముందుగా వరి సాగు చేపట్టే రైతులు, వరిరకాల ఎంపికలో జాగ్రత్త పాటించాలి. ప్రధానమైన చీడపీడలను మరియు మొక్కను ఆశించే పురుగులను తట్టుకునే నిలబడగలిగే రకాలను ఎంచుకోవాలి. ఈ ఏడాది వర్షాలు ఎక్కువుగా ఉన్నందున ముప్పును సైతం తట్టుకోగలిగే రకాలను ఎంపిక చేసుకోవాలి. వరి నారులో, కాండం తొలుచు పురుగు మరియు ఉల్లికోడు వంటి రోగాలు ప్రధానంగా కనిపిస్తాయి. వీటిని నివారించడానికి మొక్క నారు దశలో ఉన్నపుడు ఒక ఎకరానికి కార్బొఫ్యురాన్ 3 జి గుళికలను 800 గ్రాముల పొలంలో వెయ్యాలి. మొక్కలు నాటుకోవడానికి విత్తనాలను వెదజల్లే పద్దతి కానీ లేదా నేరుగా విత్తుకునే పద్దతిని ఎంచుకోవాలి. నేరుగా విత్తుకోవడానికి స్వల్పకాలిక రకాలు అనుగుణంగా ఉంటాయి.
అదేవిధంగా ఎరువుల యాజమాన్యం కూడా సమగ్రవంతంగా చేపట్టాలి. మొక్క ఎదుగుదలలో మరియు కాండం గట్టిపడటంలో పోటాష్ ఎరువులు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మంది రైతులు పోటాష్ ఎరువులను పై పూతగా వేస్తారు, దీని వలన ఎటువంటి లాభం ఉండదు, కాబట్టి పంట ఆఖరి దుక్కిలోనే ఎరువులను వెయ్యాలి. అంతేకాకుండా పంట దిగుబడిలో ప్రధాన పాత్ర పోషించే నత్రజని ఎరువులను, సూచించిన మొత్తాన్ని మూడు దఫాలుగా వెయ్యాలి, దీనివలన నత్రజని ఎరువు వృధాగా పోకుండా పంట ఎదుగుదలకు ఉపయోగపడతయి. సాధారణంగా ఒక ఎకరానికి 15 కిలోల యూరియా, 50 కిలోల భాస్వరం, మరియు 14 కిలోల పోటాష్ ఎరువులను, ఆఖరి దుక్కిలో పొలంలో కలియదున్నాలి. మొక్క 15-20 రోజుల దశకు చేరుకున్నప్పుడు 30-35 కిలోల యూరియా, అలాగే మూడు దశలో అంటే అంకురం ఏర్పడే దశలో మరో 30-35 కిలోల యూరియా ఎరువులను అందించాలి. ఈ విధంగా అన్ని యజమాన్య పద్దతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.
Share your comments