కరోనా వైరస్ చాలామందిలో ఆరోగ్యంపై ఆసక్తిని పెంచింది. చాలామంది ఇప్పుడు ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటిస్తున్నారు. ఇంట్లోనే రకరకాల మొక్కలను పెంచుతూ కూరగాయలు, ఆకుకూరలు వంటివన్నీ తమ సొంత గార్డెన్ రుచులను ఆస్వాదిస్తున్నారు. ఇందులో ముఖ్యంగా చాలామంది మైక్రో గ్రీన్స్ పెంచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
అసలేంటి మైక్రో గ్రీన్స్?
వివిధ రకాల గింజల నుంచి మొలకలు రాగానే వాటిని స్ప్రౌట్స్ రూపంలో తీసుకోవడం మనందరికీ తెలిసిందే. ఈ స్ప్రౌట్స్ ని మరికొంత పెంచితే వాటిని మైక్రో గ్రీన్స్ అని పిలుస్తారు. మొత్తంగా చెప్పాలంటే మొలక వచ్చిన చిన్న మొక్కలు ఇవి. విత్తనం నుంచి మొలకలు వచ్చి అవి రెండు ఆకులు వేసే స్థాయికి చేరగానే వాటిని కట్ చేసుకొని వంటల్లో లేదా సలాడ్ లో వేసుకొని ఉపయోగించుకోవడమే ఈ మైక్రో గ్రీన్స్ ముఖ్య ఉద్దేశం. వీటిని తినడం వల్ల శక్తి, పోషకాలు అందుతాయి. వీటిని పెంచడం చాలా సులభం.
ఎలా పెంచాలంటే..
ఈ మైక్రో గ్రీన్స్ పెంచడం చాలా సులభం. వీటిని పెంచుతూ మొక్కల పెంపకాన్ని ఆస్వాదించవచ్చు. ఈ మొక్కలను పూర్తిగా వేళ్లతో సహా తీసుకోవచ్చు. ఇవి మామూలు మొక్కల కంటే ఎన్నో పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని పెంచేందుకు చిన్న చిన్న ట్రేలు అవసరమవుతాయి. ఇందుకోసం స్వీట్ బాక్సులు, చిన్న ఫుడ్ ట్రేల వంటివి కూడా ఉపయోగించవచ్చు. అయితే మీరు ఉపయోగించే ధాన్యాలు పురుగుల మందులు జల్లకుండా పండించినవి తీసుకుంటే మంచిది. వీటిని చాలా తక్కువ స్థలంలో ఎక్కువ గింజలు వేసి పండించే వీలుంటుంది. మైక్రోగ్రీన్స్ పండించేందుకు కింద నీళ్లు నిలువ ఉండకుండా చూసుకోవాలి. ఇందుకోసం జాలి బుట్టలను నీళ్లు పోసిన ప్లేట్లలో పెట్టి కూడా పెంచవచ్చు. దీన్ని బాటమ్ వాటరింగ్ మెథడ్ అని పిలుస్తారు. ఇలా చేయడం వల్ల ఫంగస్ ఎక్కువగా రాకుండా ఉంటుంది. వీటిలో కొబ్బరి పీచు, కోకో పీట్, పత్తి, తడి టిష్యూ పేపర్స్ వంటివి వేసుకోవాలి.
నీటిని కొద్దిగా నిల్వ ఉంచుకునేవైతే మంచిది. అందుకే అన్నింటికంటే ఇందుకోసం కొబ్బరి పీచు మంచిది అని చెప్పవచ్చు. కొబ్బరి పీచుపై విత్తనాలను చల్లుకోవాలి. వీటిని అప్పుడప్పుడూ నీళ్లు జల్లుతూ మూడు నుంచి నాలుగు రోజుల పాటు చీకట్లో ఉంచాలి. ఆ తర్వాత కిటికీ పక్కన పెట్టి చాలా తక్కువ వెలుతురు తగిలేలా చూసుకోవాలి. రోజుకు రెండు సార్లు చాలా తక్కువ మోతాదులో నీటిని అందించాల్సి ఉంటుంది. ఇలా చేస్తుంటే వారం రోజుల్లో మైక్రో గ్రీన్స్ సిద్ధమైపోతాయి. వీటిని వారం పాటు ఉపయోగించుకోవచ్చు. ఇవి రాగానే మరో బ్యాచ్ వేస్తే చాలు.. ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. మైక్రోగ్రీన్స్ పెంచిన తర్వాత మిగిలిన కొబ్బరి పీచును కంపోస్ట్ లో ఉపయోగించుకోవచ్చు. మరికొంత కొబ్బరి పీచు తీసుకొని కొత్త బ్యాచ్ తయారుచేసుకోవచ్చు. వేళ్లు తినడం మీకు ఇష్టం లేకపోతే వాటిని కూడా కంపోస్ట్ లో వేయవచ్చు. ఇందులో బయో ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మొక్కలు పెరిగేందుకు చాలా బాగా పనిచేస్తాయి. తయారైన మైక్రో గ్రీన్స్ ని సలాడ్లు, గ్రీన్ జ్యూసులు, సూపులు వంటివాటిలో వేసుకోవచ్చు. అన్నంతో పాటు తినే వీలుంటుంది. ఒక్కో మైక్రో గ్రీన్ ఒక్కో రకం ఫ్లేవర్ ని అందిస్తుంది కాబట్టి వీటిని మిక్స్ చేసి ఉపయోగించుకోవచ్చు.
ఈ మొక్కలు పెంచవచ్చు..
మైక్రో గ్రీన్స్ గా అన్ని రకాల మొక్కలు పెంచేందుకు వీలు పడదు. అంతే కాదు.. పోషకాలు కూడా ఎక్కువగా అందాలంటే కొన్ని రకాల గింజలను మాత్రమే ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎర్ర తోటకూర, క్యాబేజీ, ఆల్పాల్ఫా, బ్రొకొలీ, ఆవ గింజలు, కొత్తిమీర, బీట్ రూట్, తులసి, చియా, అవిసె, వాము, ముల్లంగి, సోంపు వంటి ఎంచుకొని మైక్రో గ్రీన్స్ పెంచుకోవాల్సి ఉంటుంది.
ఆరోగ్యకరంగా వీటిని పెంచాలంటే..
మొక్కల అడుగుభాగం ఎప్పుడు తడిగా ఉండేలా చూసుకోవాలి.
నీరు మరీ ఎక్కువగా పోయడం సరికాదు. వాటిని స్ప్రేయర్ సాయంతో తడపాలి. నీరు ఎక్కువగా అందిస్తే వాటి వేళ్లు పాడవుతాయి.
ఈ మొక్కలను నేరుగా సూర్మ రశ్మి తగలకుండా కాపాడుకోవాలి.
తక్కువ లోతులో, వెడల్పుగా ఉన్న కంటెయినర్లలో వీటిని నాటుకోవాలి.
ఒకవేళ ఫంగస్ పెరిగితే వాటిని బయట పడేయాలే తప్ప వాడకూడదు.
తక్కువ మోతాదులో ముందు పెంచి అది అలవాటయ్యాక వేరేవి పెంచడం మంచిది. రెండు వారాలకోసారి కొత్త మొక్కలు వేసుకోవాలి.
https://krishijagran.com/agripedia/what-are-microgreens-and-their-potential-health-benefits/
https://krishijagran.com/agripedia/start-your-microgreen-profitable-business-at-home/
Share your comments