ప్రపంచ వ్యాప్తంగా సగం కంటే ఎక్కువ జనాభా ప్రధాన ఆహారంగా వాడే వరి (Rice) పంటను సాగు చేయడానికి ఎక్కువ మోతాదులో నీరు అవసరం. సంప్రదాయ పద్దతిలో కిలో బియ్యం ఉత్పత్తి చేయడానికి 3000 నుండి 5000 లీటర్ల నీరు అవసరం అవ్తుంది. ఇది ఇతర ఆహార ధాన్యాల ఉత్పత్తికి అయ్యే నీటి వినియోగం కంటే 2-3రెట్లు అధికం. ఇది ఇలానే ఉంటే 2020-2025 సంవత్సరానికి వచ్చే సరికి 15-20 మిలియన్ హెక్టార్ల వరి పొలాలు నీటి ఎద్దడి సమస్యని ఎదుర్కునే అవకాశం వుందని అంచనా. కాబట్టి తక్కువ నీటితో ఎక్కువ ఉత్పాదకత సాధించాల్సిన అవసరం ఎంతైనా వుంది. తక్కువ నీటి వినియోగంతో దిగుబడులు తగ్గకుండా వరి పంటను సాగు చేయడానికి అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ వారు తడి పొడి విధానాన్ని రూపకల్పన చేసారు. తడి-పొడి సాగు పద్ధతిలో నీటి యాజమాన్యం అనగా “క్రమంగా నీరు పెట్టడం మరియు ఆరబెట్టడం”. ఈ పద్దతిలో రెండు తడుల మధ్య సమయం వాతావరణ పరిస్థితులు, నేల రకం మరియు పంట కాలాన్ని బట్టి 1 నుండి 10 రోజుల వరకు వుంటుంది.
పొలంలో అమర్చుకునే నీటి గొట్టం నిర్మాణం:
ఈ పద్దతిలో మార్కెట్ లో దొరికే ప్లాస్టిక్ పైపు (15 సెం.మీ. వ్యాసము, 30 సెం.మీ. పొడవు) కు సగ భాగం (15 సెం.మీ) వదిలి మిగతా 15 సెం.మీ. పైపుకు 2 సెం.మీ. ఎడంతో రంధ్రాలు చేసుకోవాలి. ఈ పైపును రంద్రాలున్నత వరకు ఒక ఒడ్డుకు దగ్గరగా పొలంలో దింపాలి. ఆ తరవాత పైపు లోపల మట్టిని అడుగు భాగం వరకు తీసివేయాలి. పైపు లోపలి నీటి మట్టం & పొలంలో నీటి మట్టం ఒకే ఎత్తులో ఉండేటట్లు జాగ్రత్త పడాలి.
తడి పొడి విధానం అమలు పద్ధతి:
నాటు వేసిన కొన్ని రోజుల తర్వాత అనగా సుమారు 1-2 వారాలు లేదా నేరుగా విత్తే పద్దతిలో సాగు చేసే వరిలో మొక్క10 సెం. మీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత ఈ పద్దతిని ఆరంభించవచ్చు.
నాటిన నుండి చిరుపొట్ట దశ వరకు : పైపులో నీటి మట్టం నేల మట్టం కన్నా 5 సెం.మీ. క్రిందకు తగ్గినచో, పొలంలో నీటి మట్టం నేల మట్టంపై 5 సెం.మీ పైకి ఉండేటట్లు నీటిని పెట్టాలి.
పూత దశ నుండి గింజ పాలు పోసుకునే దశ వరకు: పైపులో నీటి మట్టం నేల మట్టం కన్నా 3 సెం.మీ. క్రిందికి తగ్గినపుడు, తిరిగి నేల మట్టంపై 5సెం.మీ. ఉండేటట్లు నీటిని పెట్టాలి.
లాభాలు:
- పంటలకు అవసరమైన నీటి తడులా సంఖ్య తగ్గడం వళ్ళ 15-30 శాతం నీరు ఆదా అవ్తుంది.
- వరి దుబ్బు మరియు కంకుల సంఖ్య ఎక్కువగా వుండడం వల్ల చేను మీద పడిపోదు.
- నేల బౌతిక పరిస్థితులు మెరుగుపరచడమే కాకుండా యంత్రం ద్వారా కోతకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
- కరెంట్ ఖర్చు, సాగు ఖర్చు తగ్గుతాయి.
- మీథేన్ అనబడే కాలుష్య కారకం విడుదల తగ్గుతుంది.
- హైడ్రోజన్ సల్ఫైడ్ వల్ల వరికీ హాని కలుగకుండా వుంటుంది.
Authors:
జె.విజయ్, (సేద్య విభాగ శాస్రవేత్త); డా.ఎల్.మహేష్ (విస్తరణ విభాగ శాస్త్రవేత్త); డి.శ్రీనివాస రెడ్డి (కీటక విభాగ శాస్రవేత్త), డా.ఎన్.వెంకటేశ్వర్ రావు (సేనీయర్ శాస్త్రవేత్త & హెడ్), కృషి విజ్ఞాన కేంద్రం, జమ్మికుంట.
Share your comments