ఎండాకాలం వచ్చేసింది. చాలామందికి ఎండాకాలం అంటే పెద్దగా ఇష్టం ఉండదు. వేడి, ఉక్కపోత, భగభగ మండే సూర్యుడి కిరణాలతో సమస్యలు వంటివన్నీ ఇబ్బంది పెడుతాయి. కానీ వేసవిలో అందరికీ ఇష్టమైన సంగతి ఒకటి ఉంటుంది.
అదే అందరికీ ఇష్టమైన మామిడి పండ్లు. ఈ సీజన్ లోనే అవి లభిస్తాయి కాబట్టే చాలామందికి వేసవి నచ్చుతుంది. పండ్లలోనే రారాజుగా పిలిచే ఈ పండ్లంటే చాలామందికి ఇష్టం. ఇందులోని ఎన్నో వందల రకాలున్నాయి. ఇప్పటికే కొన్ని రకాలు అంతరించే స్థాయికి కూడా చేరుకున్నాయి. మామిడి పండ్లంటే మహా ఇష్టమైనా సరే.. ఎప్పుడైనా మామిడి రకాలను కాపాడే ప్రయత్నం మీరు చేశారా? లేదు కదా.. అలాంటి మహా ప్రయత్నాన్ని వయసు పైబడినా కొనసాగిస్తున్నారు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి.
కర్ణాటకలోని బెంగళూరు సమీపంలో ఉన్న శివ మోగకి చెందిన బీవీ సుబ్బారావు (బెలూరు సుబ్బన్న హెగ్డే) తనకెంతో ఇష్టమైన మామిడి పండ్ల కోసం తన జీవితంలో చాలా భాగాన్ని కేటాయించేశారు. ఎంతగా అంటే ఆయన పేరు చెప్పగానే మామిడి పండ్లే గుర్తొచ్చేంతలా తన చుట్టుపక్కల ఆయన పాపులర్ గా మారిపోయారు. మామిడి రకాలను కాపాడేందుకు ఆయన చేసే ప్రయత్నం నమ్మలేనిది.. ఎవరితో పోల్చలేనిది కూడా. ఆయన 150 రకాల అరుదైన మామిడి రకాలను సేకరించి వాటిని పెంచుతున్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఈ మామిడి రకాలను సేకరించేందుకు నేను ఎన్నో గ్రామాలకు పర్యటించాను. అక్కడ ఊరగాయ పెట్టేందుకు ఉపయోగించే 120 రకాల మామిడి కాయలను సేకరించాను. అంతేకాదు.. మరికొన్ని రకాలకు చెందిన మామిడి పండ్లను వెస్ట్రన్ ఘాట్స్ నుంచి సేకరించి వాటిని కూడా పెంచడం ప్రారంభించాను. ఇందుకోసం నాకు పన్నెండు సంవత్సరాలు పట్టింది. నాకు చిన్నతనం నుంచి మామిడి కాయలంటే ఎంతో ఇష్టం. మా ఇంట్లో ఒక రకం మామిడి చెట్టు ఉండేది. అది కూడా అరవై సంవత్సరాల కంటే పైబడింది. అది తింటూ మామిడి కాయలను ఇష్టపడి స్థానిక వెరైటీలన్నింటినీ పెంచాలని భావించాను. అందుకే స్థానికంగా ఒక ఎకరం స్థలాన్ని తీసుకున్నాను. నా భార్య కూడా నాకు ఇందులో సహకరించింది. అని చెప్పారు.
ఆయనకు చెట్లు ఎక్కడం రాకపోవడంతో ఎవరో ఒకరిని బతిమాలి ఆ చెట్టు కాయలను తీసుకురావడం చేసేవారు. దాన్ని ఆయన భార్య ఊరగాయ పెట్టేవారు. ఆ ఊరగాయ రుచిగా ఉంటే తిరిగి మళ్లీ ఆ ఊరికి వెళ్లి ఆ చెట్టు నుంచి ఒక కొమ్మ తీసుకొచ్చి తన దగ్గర ఉన్న చెట్లకు గ్రాఫ్టింగ్ చేసేవారు. దీంతో ఒకే చెట్టుకు ఐదు రకాల కాయలను కాసేలా తయారుచేశారు. దీనివల్ల తక్కువ స్థలంలోనే ఎక్కువ రకాల కాయలు వచ్చేలా తయారుచేశారు. ఆయన మామిడి కలెక్షన్ లో దొంబెసర జీరిగె, గెనెసినాకుడి జీరిగె, చీనె తోట జీరిగె, బాగీ జీరిగె, బరిగె జీరిగె వంటి అరుదైన రకాలు కూడా ఉన్నాయి. వీటి రుచి, వాసన అద్భుతంగా ఉండడంతో పాటు ఇందులో కొన్ని కాయలు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు కూడా పాడవ్వకుండా ఉంటాయట.
ఆయన సేకరించిన రకాలలో చాలా రకాలు అంతరించిపోయే దశలో ఉన్నవే.. ఇవి సేకరించడం ఆయనకు కూడా చాలా కష్టంగానే మారింది. ఎన్నో గ్రామాలను పర్యటించి అక్కడి స్థానిక రకాలను సేకరించడం ప్రారంభించారు. ఇందులో ఎక్కువ మామిడి రకాలు ఊరగాయ పెట్టేందుకు ఉపయోగించేవే.. సాధారణంగా మామిడి పండ్ల రకాలు మార్కెట్లో మంచి డిమాండ్ ని కలిగి ఉంటాయి. అందుకే వీటిని ఎక్కువగా పండిస్తారు. అదే ఊరగాయ పెట్టే మామిడి కాయల రకాలు తక్కువ డిమాండ్ కలిగి ఉంటాయి. అందుకే వీటిని తక్కువగా పెంచుతారు. ప్రతి సంవత్సరం నవంబర్ నుంచి మార్చి వరకు గ్రామాల్లో పర్యటించి తన ప్రాజెక్ట్ లో భాగంగా ఈ మొక్కలను సేకరించి పెంచారు
ఈ 150 వెరైటీల్లో కేవలం 15 రకాలు మాత్రమే నిల్వ ఉండేవిగా ఆయన గుర్తించారు. అందుకే ఐదు వెరైటీలను ఒక చెట్టుకు గ్రాఫ్ట్ చేయడం ప్రారంభించారు. మరికొన్ని రకాలను కుండీల్లో పెంచారు. తన ఇంట్లో మ్యాంగో పార్క్ ని ఏర్పాటు చేసి మామిడి పండ్ల ప్రాధాన్యతను అందరికీ అర్థమయ్యేలా చెబుతున్నారు. అంతేకాదు.. వాటిని పెంచడానికి ఇష్టపడేవారికి మామిడి టెంకలు, కొమ్మల గ్రాఫ్టింగ్ లను ఆయన ఉచితంగా అందిస్తున్నారు. ఊరగాయలు పెట్టి, విదేశాలకు ఎక్స్ పోర్ట్ చేసే బిజినెస్ లో ఉన్నవారు ఈ రకాలను అంతరించిపోకుండా కాపాడాలని ఆయన ఎప్పుడూ చెబుతూ ఉంటారట. ఆయన చేసిన ఈ కృషికి గాను ఆయనను వివిధ అవార్డులు కూడా వరించాయి. ఇందులో బెంగళూరులో జరిగిన నేషనల్ హార్టికల్చర్ ఫెయిర్ వాళ్లు అందించిన అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఎంతో ప్రత్యేకమైంది.
Share your comments