గిరిజన రైతుల కోసం గిరి వికాసం అనే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. ఈ పథకం గురించి చాలామందికి అవగాహన ఉండదు. అసలు ఈ పథకం ఎందుకు?.. దీని వల్ల ప్రయోజనాలేంటి?.. అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
గిరిజన రైతులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గిరిజన సంక్షేమ శాఖ ఈ పథకాన్ని అమలు చేస్తుండగా... దీని ద్వారా గిరిజన భూములను సాగులోకి తీసుకురావడం, గిరిజన రైతులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తారు. నగదు బదిలీ ద్వారా కాకుండా ప్రత్యక్షంగా రాష్ట్ర ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తోంది. గతంలో ఇందిరా జలప్రభ పథకం ఉండేది. అనివార్య కారణాల వల్ల ఆ పథకం ఆగిపోవడంతో.. దాని స్థానంలో గిరి వికాసం పథకాన్ని ప్రవేశపెట్టారు.
నాలుగు రకాలుగా ఈ పథకం ద్వారా గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరుస్తారు. మొక్కలు, స్టంప్‌లు, బండరాళ్లు మొదలైన వాటిని తొలగించడం ద్వారా బంజరు భూములను సాగు భూములుగా మార్చడం చేస్తారు. ఇక గిరిజన రైతుల పోలాలకు బోర్లు వేయించడం, బార్లు తవ్వించడం చేస్తారు. ఇక బోర్లు ఉన్న రైతులకు విద్యుత్ సదుపాయం కల్పించడం చేస్తారు. ఇక చెరువులను నిర్మించడం చేస్తారు.
ఈ పథకం గురించి గిరిజన రైతులకు అవగాహన కల్పించేలా పత్రికలు, టీవీల్లో ప్రకటనలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి అర్హత పొందాలంటే గిరిజన రైతులు పట్టా కలిగి ఉండాలి. తెలంగాణలో 31.77 లక్షల మంది గిరిజనులు ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో 9.08 శాతం. వీరిని రైతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం గిరి వికాసం పథకం అమలు చేస్తోంది.
ఇందిర జలప్రభ పథకంపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఏమాత్రం పరిజ్ఞానం లేని వారికి బాధ్యతలను అప్పగించడం వల్ల కమీషన్లకు కక్కుర్తి పడి ఎక్కడ పడితే అక్కడ బోర్లు నిర్మించారు. అవి ఎందుకూ పనికి రాకుండాపోయాయి. దీంతో ఆ పథకం వల్ల రాష్ట్ర ఖజానాకు ఎంతో నష్టం జరిగింది. గిరిజన రైతులకు కూడా లబ్ధి చేకూరలేదు. దీంతో గిరి వికాసం పథకంలో ఎలాంటి అవకతవకలు చోటుచేసుకోకుండా గిరిజన రైతులకు లబ్ధి చేకూరేలా ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.
Share your comments